మహిళలపై వాతావరణ మార్పుల ప్రభావం

Impact of climate change on women–  పేదరికం, అనారోగ్యంతో సతమతం
–  పంటపని, ఇంటిపనికే పరిమితం
న్యూఢిల్లీ : లింగ సమానత్వానికి సంబంధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో పురోగతిపై ఐక్యరాజ్యసమితికి చెందిన మహిళా సంస్థ ఆందోళన వ్యక్తం చేసిది. ఈ మేరకు ఆ సంస్థ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. 2030 నాటికి ప్రపంచ మహిళా జనాభాలో సుమారు 8% మంది పేదరికంలో మగ్గుతుంటారని, నాలుగో వంతు మంది ఆహార అభద్రతను చవిచూస్తారని ఆ నివేదిక హెచ్చరిం చింది. ‘నాయకత్వ స్థానాలలో లింగ అసమానతలు అధికంగా ఉన్నాయి. పురుషులు, మహిళల మధ్య ఇంటిపని పంపకంలో చాలా వ్యత్యాసముంది. భద్రత విషయంలో కూడా అసమానతలు ఉన్నాయి’ అని వివరించింది.
నివేదిక ప్రకారం…వాతావరణ మార్పుల కారణంగా శతాబ్దం మధ్య నాటికి 1.6 కోట్ల మందికి పైగా మహిళలు, బాలికలు పేదరికంలోకి జారుకుంటారు. మరో 23.6 కోట్ల మంది ఆహార అభద్రతకు లోనవుతారు. ఇలాంటి పరిస్థితుల లో ప్రభుత్వం తన వాతావరణ మార్పుల ప్రణాళికలలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. మహిళల కుటుంబ బాధ్యతలు వాతావరణంతోనే ముడిపడి ఉంటాయి. ఇంటికి అవసరమైన నీరు తేవడం, పశువుల కోసం గ్రాసాన్ని సేకరించడం, తన కుటుంబానికి ఆహార భద్రత కల్పించడం వంటి పనులన్నీ మహిళల పైనే పడుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ వంట చెరకు తెచ్చే బాధ్యత మహిళలదే. ఈ విధుల నిర్వహణకు మహిళ లు అనేక గంటల పాటు శ్రమించాల్సి వస్తోంది. ఉద్యోగావ కాశాలు తగినంతగా లేకపోవడం, ఒకవేళ ఉద్యోగం దొరికి నా వేతనాలు తక్కువగా ఉండడం వంటి కారణాలతో మహి ళలు సామాజికంగా, ఆర్థికంగా బలహీనుల వుతున్నారు.
పశ్చిమ మహారాష్ట్రలో మహిళలు తాగునీటి కోసం చాలా దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో ఇతర ఇంటిపనులు చేసేందుకు వారికి చాలా తక్కువ సమయం దొరుకుతోంది. దారుణమైన పరిస్థితి ఏమంటే కొన్ని గ్రామాలలో పురుషులు ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఇంటికి అవసరమైన తాగునీరు తెస్తుందని. ప్రభుత్వం మాత్రం దేశ ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు అందజేస్తున్నానని గొప్పలు చెప్పుకుంటోంది. అయితే దేశంలో ఎంతమందికి రక్షిత మంచినీరు లభిస్తోందో చెప్పే వివరాలేవీ ప్రభుత్వం వద్ద లేవు. ఇక వంట కోసం కట్టెలు తేవడం కూడా మహిళల పనే. పోనీ ఆ కట్టెలు ఏమైనా దుమ్మూ ధూళి లేకుండా ఉంటాయా అంటే అదీ లేదు.
అలాంటి వంట చెరకు వాడకంతో మహిళల ఆరోగ్యం దెబ్బతింటోంది. భారతీయ కుటుంబాలలో మూడో వంతు ఇప్పటికీ వంట చెరకు పైనే ఆధారపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో 47%, పట్టణ ప్రాంతాలలో 6.5% కుటుంబాలకు ఇప్పటికే కట్టెల పొయ్యిలే దిక్కు. గ్యాస్‌ ధరలు అధికంగా ఉండడంతో పేదలు దాని వినియోగంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక వ్యవసాయ పనులలో మహిళల భాగస్వామ్యం గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వ్యవసాయ పనులలో ఎండనక, వాననక శ్రమిస్తున్న మహిళలు అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.