రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం

– వచ్చే రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు
– 30, 31, ఒకటో తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేసింది. 28, 29 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే సూచనలున్నాయి. ఈ మేరకు వరంగల్‌, హన్మకొండ, జనగాం, ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది. 30న జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. 31న భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేసింది. జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, నల్లగొండ, పెద్దపల్లి, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశముంది. ెప్టెంబర్‌ ఒకటో తేదీన జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలుండటంతో ఆ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ హెచ్చరిక జారీ చేసింది. అదే రోజు కరీంనగర్‌, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడొచ్చు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో వచ్చే 48 గంటల పాటు తేలికపాటి జల్లులు పడే సూచనలున్నాయి. మంగళవారం ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు రాష్ట్రంలో 197 ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.