భారతదేశంలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొన్నది. రైతులకు కూలీలు దొరకడం లేదు. కూలిరేట్లు అధికంగా ఉన్నాయని రైతులు బాధపడుతున్నారు. ఇంకొక వైపు, వ్యవసాయ కూలీలకు పని దొరకడం లేదు. వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా లేదు. వలసెళ్లి తక్కువ కూలికి పని చేయడానికి సిద్ధపడుతున్నారు. నిత్యం వలస వెళ్లడమే ఒక సాహస, విధి లేని చర్య కాగా, అక్కడ కూడా అనేక రకాల ఒత్తిడులకు లోను కావడం ఇంకొక సమస్యగా మారింది. ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక పరిస్థితి. ఒకప్పుడు పాలమూరు కూలీలు దేశమంతట ప్రసిద్ధి. ఇప్పుడు ఉత్తరాది, పశ్చిమ రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాలకు వలస రావడం సాధారణం. కేరళ రాష్ట్రమంతటా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన, వస్తున్న కూలీ కుటుంబాలే. పట్టణాల్లో పనిచేసే ఈశాన్య రాష్ట్రాల యువత ఒక పరిణామం కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల కూలీ కుటుంబాలు విస్తరిస్తుండడం కూడా చెప్పుకోదగ్గ పరిణామంగా మారింది.
భారత పేదరికంలో అత్యధిక శాతం వ్యవసాయ కూలీ కుటుంబాలున్నాయి. గ్రామీణ ప్రాంతంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం వలన తీవ్ర ప్రభావం వీరి మీదనే ఉన్నది, దరిమిలా వీరు ఎదుర్కొంటున్న సమస్యలు అనేకం – తక్కువ వేతనాలు, నిరంతరం పని దొరక్కపోవడం, స్థిరాస్తులు లేకపోవడం, నిరక్షరాస్యత, సామాజిక వెనుకబాటుతనం. వ్యవసాయ కూలీలు అసంఘటితంగా ఉండటంతో వారికి రాజకీయ, ఆర్థిక ప్రాబల్యం లేకపోవడం వల్ల కూడా వారి సమస్యల పట్ల అవగాహనా, సానుభూతి, అధ్యయనం లేనేలేదు. వీరిపట్ల ఆర్థికవేత్తల్లో, అధికారుల్లో, రాజకీయవేత్తల్లో, మీడియాలో నిర్లిప్తత, నిర్లక్ష్యం, అవగాహనా లేమి స్పష్టంగా కనపడుతున్నది. దేశంలో 28 కోట్ల శ్రామికశక్తి మీద రాజ్యాంగం ఏర్పరిచిన వేదికల్లో (పార్లమెంట్ వగైరా), ప్రక్రియలలో (కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో), వివిధ సమావేశాల్లో ప్రస్తావన శూన్యం. నిత్యం వీరి పరిస్థితి పట్ల సమీక్ష చేయాల్సిన పాలనా వ్యవస్థ పట్టించుకోవడం లేదు.
మొట్టమొదట, వీరి పట్ల పాలనా వ్యవస్థలో, నిర్ణేతల్లో తప్పుడు సమాచారం వేళ్లూనుకుపోయింది. అందులో మొట్టమొదటిది, వీళ్లు నైపుణ్యం లేని వారు, శిక్షణ లేనివారు. వాస్తవంగా వ్యవసాయ క్షేత్రాల్లో వీరు చేసే పని నైపుణ్యంతో, జ్ఞానంతో, అనుభవంతో ఉంటుంది. గడ్డి కోయడం కూడా ఒక నైపుణ్యం. విత్తనాలు ఎంచుకోవడం, నాటడం, కలుపు తీయడం వంటివి పనుల్లో శారీరక శ్రమతో పాటు నైపుణ్యం ఉంటుంది. పంట సంరక్షణ, యాజమాన్యంలో ఏ సమయంలో, ఏమిచేయాలో రైతులతో పాటు వీరికి తెలుసు. పంట కాలంలో వచ్చే వివిధ సమస్యలు, విపత్తులను ఎదుర్కోవడంలో వీరికున్న జ్ఞానం, నైపుణ్యం తరతరాలుగా వస్తున్నది. నైపుణ్యం ఉంది కాబట్టే అప్పట్లో బ్రిటిష్‌వారు మన దేశస్తులను లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో అనేక దేశాల్లో వ్యవసాయం చేయడానికి తీసుకెళ్లారు. పంటకోత ఎప్పుడు చెప్పట్టాలి, దుక్కి ఎట్లా దున్నాలి, నీరు పారబెట్టడం వగైరా సమాచారం వీరి దగ్గర ఉంటుంది. అసలు భారత వ్యవసాయంలో ఉన్న వివిధ ప్రక్రియల లోతులు తెలియని మూర్ఖుల వలన చిన్న,సన్నకారు రైతులతో, వ్యవసాయ కూలీల జ్ఞానం, నైపుణ్యం మీద దుష్ప్రచారం ఆనవాయితీగా మారింది.మహిళా వ్యవసాయ కూలీలకు పురుషుల కంటే తక్కువ వేతనం. వారి పట్ల తప్పుడు అవగాహన, మిడి మిడి జ్ఞానం కనీస వేతనాల నిర్ధారణలో ప్రతిబింబిస్తుంది.మహిళల పట్ల వివక్ష కనపడుతుంది. తరతరాల నైపుణ్యాన్ని అప్పుడే కాలేజీ నుంచి ఉద్యోగానికి వచ్చిన యువత మాదిరి పరిగణిస్తూ కనీస వేతనాలను కనిష్ట స్థాయిలోనే నిర్దారిస్తున్నారు.
రెండవది, వీరికి ఉపాధి 200 రోజులు దొరుకుతుంది అని. అధ్యయనమే లేని పరిస్థితుల్లో ఈ లెక్క ఎక్కడ నుంచి వచ్చిందో? ఏండ్ల నుంచి ఇదే చెబుతుంటారు. గ్రామాల్లో పరిస్థితులు మారిపోయాయి. వ్యవసాయం తీరు మారింది. వ్యవసాయంలో యాంత్రీకరణ చొచ్చుకుపోతున్నది. ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. పంటల సరళి మారిపోయింది. దీంతో వీరికి దొరికే ఉపాధి తగ్గింది. ఈ మధ్య వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువొచ్చిన, వరదొచ్చిన, చీడపీడలొచ్చిన, రైతుకు ఏ కష్టమొచ్చిన, దాని ద్వితీయ పరిణామం వీరికి దొరికే పని మీద వేతనాల మీద ఉంటున్నది. రైతుకు వచ్చిన కష్టం రైతు కూలి మీద కచ్చితంగా పడుతున్నది. చిన్న, సన్నకారు రైతులు సంక్షోభంలో ఉన్నారని ఒప్పుకుంటున్నారు. భూమి ఉన్నవారు కష్టాల్లో ఉంటె, భూమి లేని వారి పరిస్థితి ఏ విధంగా బాగుంటుంది?ఇటువంటి స్పృహ పాలకుల్లో లేదు. కాలం మారినప్పుడు, వ్యవసాయ కూలీలకు కాలానుగుణ పని దొరికే అవకాశం తగ్గిపోతున్నది. కేరళ రాష్ట్రంలో మూడు పంటలు పండించే ప్రాంతంలో వరదలు, అకాల వర్షాల భయానికి ఒకే పంట వేస్తున్నారు. ఆ మేరకు వ్యవసాయ కూలీలకు పని తగ్గింది. ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతు మీద ఆధారపడ్డ వ్యవసాయ కూలీ కుటుంబం పరిస్థితి కూడా దిగజారుతుంది.
సగటు రైతు ఆదాయం నెలకు రూ.6 వేలు ఉంటే, రైతు కూలీ ఆదాయం అంతకంటే ఉండే అవకాశం గ్రామాల్లో లేనే లేదు.అధికారిక గణాంకాల ప్రకారం 2014లో జాతీయ స్థాయిలో సగటు రైతు ఆదాయం రూ.6,426 కాగా 2021లో రూ.10,218. వ్యవసాయ కూలీ సగటు ఆదాయం రూ.15 వేలు అంటున్నారు. ఇదెట్ల సాధ్యం? గ్రామం దాటి పోతేనే కొంత ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం మీద అనేక రకాల ఆటుపోట్లు ఉన్నాయి. రైతు ఆదాయం మీద ప్రకృతి వైపరిత్యాలు, ఎరువులు, రసాయనాలు, విత్తనాలు తదితర ధరలతో పాటు మార్కెట్లో మోసాలు దెబ్బ కొడుతుండగా రైతు కూలీల ఆదాయం మీద వైద్య ఖర్చులు, ప్రమాదాలు, తదితర ‘అనుకోని’ వైపరీత్యాల ప్రభావం ఉంటున్నది.
వంద రోజుల ఉపాధి ఒక చట్టబద్ధ హక్కు. కానీ క్రమేణా ఇది నీరుగారుతోంది. పేరుకు ఉపాధి హామీ కాని ఉపాధి ఇచ్చే రోజులు హామీ ఇచ్చిన వంద రోజుల కంటే తక్కువగానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 13 రోజులే పని దొరుకుతున్నది. ఇచ్చే వేతనాలు కూడా తక్కువే. నోటిఫైడ్ వేతనాలకు, కనీస వేతనాలకు, పథకం కింద ఇస్తున్న వేతనాలకు పొంతన లేదు. సమానంగా లేవు. ఈ పథకం ద్వారా మొత్తం 28 కోట్ల శ్రామిక శక్తికి పని దొరకడం లేదు. దేశ వ్యాప్తంగా 5.9 కోట్ల మందికి పని కల్పించినట్టు సమాచారం ఉన్నది. ఇందులో అర్హులు, అనర్హుల లెక్క తీస్తే అవసరమైన వ్యవసాయ కూలీ కుటుంబాలకు పని దొరకడం లేదు అని కూడా తెలుస్తున్నది. వ్యవసాయ కూలీలు ఈ పథకం వల్ల కూలి రేట్లు పెంచుతున్నారు, పనికి రావడం లేదనేది వాస్తవం కాదు.
తెలంగాణా, ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ వృత్తిదారుల సంఘం 2022లో జరిపిన ఆధ్యయనంలో వర్షాకాలంలో కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు వ్యవసాయం పని దొరికిన రోజులు 30కి మించలేదు. సాధారణంగా, వ్యవసాయ కూలీకి ఒక సీజన్లో పని దొరికే రోజుల సంఖ్య కర్నాటకలో 67-90 రోజుల మధ్య ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో 82-87 రోజులు, తెలంగాణలో 68-70 రోజుల మధ్య ఉన్నది.అందరికి వ్యవసాయం ద్వారా నిరంతరం పని దొరకడం లేదు. వ్యవసాయంలో ఉండే పని ఆధారంగా బతికే అవకాశాలు నానాటికి తగ్గుతున్నాయి. పూర్వకాలం కూడా దొరకలేదు. పంటలు లేని కాలంలో ఊర్లో పంట వేయడానికి ముందు తరువాత ఉండే వ్యవసాయ పనులు, వ్యవసాయేతర పనులు ఆదుకునేవి.పేద చిన్న, సన్నకారు రైతులు కూడా కూలీ పనికి పోతున్నారు. పని దొరికితేనే కూలీ, కూలి అందితేనే నిత్య ఆహారం ఉండే వ్యవసాయ కూలీ కుటుంబాలు వ్యవసాయేతర కార్యకలాపాలకు మళ్లుతున్నారు. అత్యధికంగా నిర్మాణం రంగంలో ఉన్నారు. వ్యవసాయేతర వృత్తులు దిగజారిన పరిస్థితుల్లో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గినందు వల్ల కూడా ఊర్లో పనులు దొరకడం లేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనేక లోపల కారణంగా కూడా వీరికి సమస్యలు పెరిగాయి.
ఒక 2022 అధ్యయనంలో తమిళనాడులో, మానవ శ్రమ (కూలి), పశు శ్రమ ఖర్చు, రసాయన ఎరువులు, సహజ ఎరువులు ఇంక స్థిర ఖర్చులు తగ్గాయి. అన్నింటి కంటే పశు శ్రమ ఖర్చు చాలా తగ్గింది. యంత్ర శ్రమ, విత్తనం, క్రిమిసంహారకాలు, సాగు నీరు, ఇతర ఖర్చులు కలిపి వేరియబుల్ ఖర్చులు కొన్ని సంవత్సరాలుగా పెరిగాయి. వీటిలో ఎక్కువగా పెరిగింది యంత్రాల ఖర్చు. మెషిన్ లేబర్ పెరుగుతున్న ఖర్చు జంతు కూలీల ఖర్చుతో పాటు మానవ శ్రమ ఖర్చు తగ్గడం ద్వారా మద్దతునిస్తుంది. యంత్ర శ్రమ వలన పెరుగుతున్న ఖర్చుకు తగ్గట్టుగా పశువులు, మనుష్యుల శ్రమ ఖర్చు తగ్గుతున్నది. ప్రతి రాష్ట్రంలో, పంటలవారిగా తేడాలున్నాయి. వ్యవసాయ కూలీలు వలసలు పోయిన దగ్గర, ఇతర వృత్తులకు మళ్లిన దగ్గర, కూలి ఖర్చు పెరిగింది. డిమాండ్ ఎక్కువ ఉంది సరఫరా తక్కువ ఉన్న పరిస్థితుల్లో రేటు పెరగడం సహజమే. వ్యవసాయ కూలీలు వ్యవసాయం వదిలితే రైతుల దీర్ఘకాలిక ప్రయోజనాలకు నష్టం. అమెరికా ఆధునిక యంత్రాలతో వ్యవసాయం చేస్తున్నా వారికి మానవులు కావాల్సి వచ్చి వారు దొరక్క లాటిన్ అమెరికా దేశాలవారిని ప్రోత్సహించారు. ఇప్పుడు వాళ్ల సంఖ్య ఎక్కువ అయ్యిందని అక్కడ రాజకీయ గోల. స్పెయిన్ దేశంలో మన దేశస్తులు అమానవీయ పరిస్థితుల్లో పనిచేస్తున్నట్టు సమాచారం వచ్చింది. పని చేస్తూ ఒక వ్యక్తి చనిపోతే తోటి పనివారు తమ పని చేసుకుంటూ పోతున్నారు. వాళ్లకు ఆ పరిస్థితి తప్పలేదు.
వ్యవసాయ రంగ విధానాల్లో విధిగా వ్యవసాయ కూలీల గురించి ప్రస్తావన ఉండాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయంగా ఆహార ఉత్పత్తి మీద దృష్టి పెరుగుతున్న క్రమంలో వ్యవసాయానికి వెన్నెముక వంటి కూలీల గురించి ఆలోచన చేయడం తప్పనిసరి. వ్యవ సాయ రంగంలో మార్పులు సూచిస్తున్న కార్పొరేటు రంగం కాని, ప్రకృతి వ్యవసాయం పట్ల మక్కువ చూపెడుతున్న హితైషులు కాని ఎవరైనా కూడా వ్యవసాయ కూలీలను పరిగణనలోనికి తీసుకోవాల్సిందే. అత్యంత ఆధునిక వ్యవసాయం చేసే అమెరికాలో కూడా మెక్సికో తదితర దేశాల నుంచి వస్తున్న వలస కూలీల అవసరం గుర్తించాల్సి వచ్చింది. వీరు లేనిదే వ్యవసాయం లేదు, మార్పు లేదు, పురోగతి లేదు, పరివర్తన లేదు. అది గుర్తు పెట్టుకుంటే మంచిది.
– దొంతి నర్సింహారెడ్డి, 9010205742