సామ్రాజ్యవాదం – వాణిజ్య వైరం

Imperialism - trade warఅమెరికా నాయకత్వంలోని సామ్రాజ్య వాద దేశాలు ఏకపక్షంగా ఇతర దేశాలపై విధించే ఆంక్షలకు ఐరాస నుండి ఎటువంటి ఆమోద ముద్రా లేదు. తమ చెప్పుచేతల్లో మెలగడానికి నిరాకరించే సాహసానికి ఒడిగట్టినందుకు ప్రపంచంలో మూడోవంతు దేశాల మీద ఇప్పటివరకూ ఏదో ఒక విధమైన ఆంక్షలను విధించినట్టు ఒక అంచనా. పశ్చిమ దేశాల్లోని ఆర్థిక సంస్థల్లో ఆయా దేశాలు పెట్టిన పెట్టుబడులను స్తంభింపజేయడం ఆ ఆంక్షలలోని ఒక భాగం. ఇరాన్‌, క్యూబా, ఉత్తర కొరియా వంటి దేశాల విషయంలో ఇదే జరుగుతోంది. ఇటీవల రష్యా కూడా వాటితో పాటు ఈ తరహా ఆంక్షలకు గురైంది. ఈ విధంగా సంపదను స్తంభింపజేయడం పెట్టుబడిదారీ సూత్రాలకే విరుద్ధం. అది కేవలం అంతర్జాతీయ దారిదోపిడీ మాత్రమే. కానీ సామ్రాజ్యవాద దేశాలకు ఇటువంటి చర్యలు చేపట్టడంలో ఎటువంటి ఊగిసలాటలూ ఉండవు. పుండుమీద కారం జల్లినట్టు, ఇటీవల ఉక్రెయిన్‌ యుద్ధం సందర్భంగా స్తంభింప జేసిన రష్యన్‌ పెట్టుబడుల మీద వచ్చిన వడ్డీని ఆ రష్యామీద ఉక్రెయిన్‌ సాగిస్తున్న యుద్ధానికే ఆర్థిక తోడ్పాటుగా అమెరికా అందించింది.
ఇంకోవైపు నయా ఉదారవాద విధానాలను మూడవ ప్రపంచ దేశాల మీద అదే పనిగా రుద్దుతున్నారు. అదంతా ఆ దేశాల మంచికేనని మోసపుచ్చే విధంగా చెప్తున్నారు. అంతర్జాతీయ వ్యాపారం మీద ఎటువంటి షర తులూ, ఆంక్షలూ విధించకూడదన్నది ఆ విధానాల్లో ఒక భాగం. కానీ, అమెరికా తన వంతుకు వచ్చేసరికి మాత్రం అందుకు భిన్నంగా ఆంక్షలు విధించడానికి పూనుకుంది. తయ దేశంలో ఉపాధి అవకాశాలను పెంచుకోడానికి, వాణిజ్యలోటును తగ్గించుకోడానికి ఈ విధంగా చేస్తోంది. ఇతర దేశాలు మాత్రం ఆ విధంగా చేయడానికి వీలులేదని కన్నెర్ర చేస్తుంది. అమెరికా అనుసరించే ఈ రక్షణాత్మక విధానం ప్రధానంగా చైనాను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పుడు ఆ చర్యలను మరింత కఠినంగా అమలు చేయబోతున్నట్టు ట్రంప్‌ ప్రకటించాడు. చైనా నుండి వచ్చే దిగుమతులపై ఇప్పుడున్న సుంకాలకు తోడు అదనంగా మరో పదిశాతం సుంకాన్ని విధించనున్నట్టు ప్రతిపాదించాడు. చైనా నుండి అవాంఛనీయమైన ఔషధాలు దిగుమతి అవుతున్నాయని, అటువంటి సరుకులు రాకుండా చర్యలు తీసుకుంటామని చైనా నాయకులు హామీ ఇచ్చినా దాన్ని నిలుపుకోలేకపోయారని, అందుకే అదనపు సుంకాన్ని విధిస్తున్నామని ట్రంప్‌ తన చర్యను సమర్ధించుకుంటున్నాడు.
తాను ఏమనుకుంటే అది చేయగలనని అమెరికన్‌ సామ్రాజ్యవాదం భావిస్తోంది. తాను ఏం చేస్తే అదే చట్టం అన్నట్టు ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థ సూత్రాలనే తాను ఉల్లంఘించినా, తక్కిన దేశాలు ఏ సూత్రాలను పాటించాలో నిర్దేశించే తాను అవే సూత్రాలను ఉల్లంఘించినా అమెరికా లెక్కచేయదు. అయితే, ఈ ఏకపక్ష ధోరణి ఇప్పుడు తీవ్ర సవాలును ఎదుర్కుంటోంది. ఇంకా చెప్పాలంటే కుక్కకాటుకి చెప్పు దెబ్బ అన్న పరిస్థితిని అమెరికా చవిచూస్తోంది.
సెమి కండక్టర్ల తయారీకి సంబంధించిన టెక్నాలజీని చైనాకు ఎగుమతి చేయకూడదని అమెరికా నిషేధిం చింది. దానికి ప్రతిస్పందనగా చైనా యాంటిమొనీ అనే లోహాన్ని అమెరికాకు ఎగుమతి చేయకుండా నిషేధించింది (ఈ యాంటిమొనీని వివిధ ”భద్రతా” సంబంధిత కార్యకలాపాల్లో వినియోగిస్తారు.). దానివలన అమెరికాలో యాంటిమొనీ ధర విపరీతంగా పెరిగింది. ఇటీవల తాము అమెరికా నుండి ముడిచమురు కొనుగోలును మొత్తంగా ఆపేస్తున్నామని చైనా ప్రకటించింది. ఇది అమెరికాకు పెద్ద దెబ్బ. ఇప్పటికే అమెరికన్‌ చమురు దిగుమతులను చైనా తగ్గించుకుంటూ వస్తోంది. 2023లో 15.06 కోట్ల బ్యారెళ్ల ముడిచమురును దిగుమతి చేసుకుంటే దాన్ని 2024లో 8.19 కోట్ల బ్యారెళ్లకు తగ్గించుకుంది. అంటే 46 శాతం తగ్గింది. అమెరికా నుండి ముడిచమురును కొనుగోలు చేసే దేశాల్లో రెండవ అతి పెద్ద కొనుగోలుదారుగా ఉండిన చైనా ఇప్పుడు ఆరవ స్థానానికి తగ్గింది. ఇప్పుడు పూర్తిగా ఆ దిగుమతులను అమెరికా నుండి నిలిపివేయబోతోంది.
ట్రంప్‌ హయాంలో అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద ముడి చమురు ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా తయారైంది. రష్యా నుండి యూరోపియన్‌ దేశాలు సహజ వాయువును దిగుమతి చేసుకోడానికి నిర్మించిన ‘నార్డ్‌ స్ట్రీమ్‌’ గ్యాస్‌ పైప్‌ లైన్‌ను 2022లో పేల్చివేయడం వెనుక సిఐఎ హస్తం ఉందని అమెరికన్‌ పాత్రికేయుడు సైమోర్‌ హెర్ష్‌ బలంగా వాదిస్తున్నాడు. అలా పేల్చివేయడం ద్వారా యూరప్‌ దేశాలు రష్యా నుండి దిగుమతి చేసుకునే బదులు అమెరికా మీద ఆధారపడవలసి వస్తుందన్నదే అమెరికా వ్యూహం. ఆ తర్వాత వాస్తవంగా అదే జరిగింది. కాని ఇప్పుడు చైనా అమెరికా నుండి చమురు కొనుగోలును నిషేధిస్తే అమెరికా కొత్త కొనుగోలుదారులను వెతుక్కో వలసి వస్తుంది. అమెరికా నుండి ముడిచమురు దిగుమతులను నిలిపి వేయాలని చైనా నిర్ణయించడం కేవలం ఒక తక్షణ వాణిజ్య ప్రతీకారచర్య మాత్రమే కాదు. అమెరికా మీద ఇంధన అవసరాల కోసం ఆధారపడే స్థితి నుండి బయట పడాలన్న ఆలోచన కూడా ఉంది. అలా ఆధారపడే స్థితి కొనసాగితే భవిష్యత్తులో అమెరికా ఎప్పుడైనా చైనాను బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశం ఉంటుంది.
అమెరికా నుండి వచ్చే ముడిచమురు దిగుమతులను నిలిపివేస్తే అప్పుడు చైనా ఇంధన అవసరాలు ఎలా తీరుతాయి? దీన్ని పరిష్కరించడానికి రష్యా నుండి, ఇరాన్‌ నుండి, వెనిజులా నుండి ముడి చమురు దిగుమతులను పెంచుకోవాలని చైనా నిర్ణయించింది. ఈ మూడు దేశాలూ అమెరికా దాడులకు లక్ష్యంగా ఉన్న దేశాలే. అవన్నీ అమె రికా ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. ఆంక్షల కారణంగా ఆ దేశాల నుండి ఎగుమతి అయ్యే ముడిచమురు ప్రస్తుతానికి చౌకగా దొరుకుతోంది. రష్యా నుండి ముడి చమురు కొనుగోలును పెంచితే అటు అమెరికా మీద ఆధారపడడమూ తగ్గుతుంది, ఇటు చౌకగా చమరు కూడా లభిస్తుంది. ఇది రెండు విధాలా చైనాకు ప్రయోజనకరమే.
దానికి భిన్నంగా ట్రంప్‌ యూరప్‌ మార్కెట్‌ను చేజిక్కించుకుని సాధించిన ”విజయానికి” బదులు చైనా మార్కెట్‌ను కోల్పోయాడు. దానితోబాటు చైనాను ఒత్తిడి చేయగల శక్తి కూడా తగ్గిపోయింది.
చైనా అనుసరిస్తున్న ఈ వైఖరి పట్ల ట్రంప్‌ చాలా ఆగ్రహంతో ఉన్నాడు. చైనా అమెరికాతో వాణిజ్య యుద్ధానికి దిగుతోందని ఆరోపిస్తున్నాడు అయితే, అమెరికాయే ఈ వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది అన్నది వాస్తవం. దానికి ప్రతిస్పందనగా చైనా రక్షణాత్మక చర్యలు చేపట్టింది. ఇంతకాలమూ నిస్సహాయంగా ఉండే బడుగు దేశాలను బెదరగొట్టడానికి, వాటిని తనకు అనుగుణంగా లొంగదీసుకోడానికి అమెరికా అనుసరిస్తున్న ఆంక్షల వ్యూహానికి భిన్నమైన దిశగా అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు ఇప్పుడు మొదలయ్యాయి. ఇవి అమెరికన్‌ సామ్రాజ్య వాద ఆధిపత్యాన్ని బలహీనపరుస్తాయి. చాలా పరిమితమైన, వేళ్లమీద లెక్కించగల సంఖ్యలో ఉండే దేశాల మీద ఆంక్షలు విధించినంతకాలమూ ఆ ఆంక్షలు చాలా బలంగా ప్రభావం చూపగలిగాయి. ఆ దేశాలను లొంగదీసు కోడానికి తోడ్పడ్డాయి. కాని ఎప్పుడైతే అమెరికా ఆంక్షలకు గురయ్యే దేశాల సంఖ్య బాగా పెరిగిపోయిందో, అప్పుడు ఆ విధంగా ఆంక్షలకు గురైన దేశాల నడుమ ప్రత్యామ్నాయ వాణిజ్య ఏర్పాట్లకు ప్రాతిపదిక ఏర్పడింది. ప్రపంచంలోని దేశాలలో మూడోవంతు దేశాలు గనుక అమెరికన్‌ ఆంక్షలకు గురైతే ఆ దేశాలు తమ నడుమ కుదుర్చుకునే ప్రత్యా మ్నాయ ఒప్పందాలు అమెరికన్‌ ఆధిపత్యాన్ని కుదిపివేయగలుగుతాయి.
ఈ పరిణామాల ప్రభావం అమెరికన్‌ డాలర్‌ మీద కూడా పడుతుంది. చైనా చమురు దిగుమతి చేసు కోబోయే ప్రధాన దేశాల్లో రష్యా, ఇరాన్‌ ఇప్పటికే బ్రిక్స్‌ కూటమిలో ఉన్నాయి. ఇక మూడో దేశం వెనిజులా కూడా ఆ కూటమిలో చేరడానికి తయారుగా ఉంది. అంటే బ్రిక్స్‌ భాగస్వామ్య దేశాల నడుమ వాణిజ్యం పెరుగుతుంది అన్న మాట. ఈ వాణిజ్యం డాలర్‌ మాధ్యమంలో జరగవలసిన అవసరమేమీలేదు. ఇప్పటికి ఇంకా ఒక ప్రత్యామ్నాయ కరెన్సీ ఏది అన్న విషయంలో ఒక నిర్ణయం ఏదీ జరగలేదు. కానీ, బ్రిక్స్‌ దేశాల నడుమ జరిగే వాణిజ్యంలో డాలర్‌కు ఏ పెత్తనమూ ఉండదన్నది మాత్రం స్పష్టం. ఇటీవల కజన్‌లో జరిగిన బ్రిక్స్‌ దేశాల శిఖరాగ్ర సమావేశపు సందేశమిదే.
చమురు దిగుమతికి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకున్న క్రమంలో నుంచే డాలర్‌కు ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసుకునే క్రమం కూడా మొదలౌతుంది. అమాంతంగా ఒక్కసారి డాలర్‌ పెత్తనం అదృశ్యం అయిపోదు. కాని దాని ఆధిపత్యం దెబ్బ తినే దిశగా పరిణామాలు మొదలయ్యాయని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఇది సామ్రాజ్యవాద పెత్తనం నుండి విముక్తి పొందేందుకు అవకాశాలను పెంచే పరిణామమని చెప్పవచ్చు. మూడో ప్రపంచ దేశాలను తన గుప్పెట్లో ఇరికించుకున్న నయా ఉదారవాద వ్యవస్థ ఇంక ముందుకు పోగలిగిన పరిస్థితి లేదు. దాని ముందు దారి మూసుకుపోయింది. దాని ఫలితంగా శ్రామిక ప్రజలు అనుభవించే కష్టాలు మిక్కుటమౌతున్నాయి. ఈ నయా ఉదారవాద వ్యవస్థ చట్రం పరిధి లోపటే ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం అనేది లభించదు అన్నది స్పష్టం. అయితే, ఈ చట్రాన్ని బద్దలుగొట్టుకుని బయటపడే క్రమం కూడా కష్టాలమయమే. నయా ఉదారవాద విధానాల వలన ప్రస్తుతం ఎక్కువగా ఎవరు బాధితులుగా ఉన్నారో వారే ఆ చట్రం నుండి బయటపడే క్రమంలో కూడా ఎక్కువ బాధలను ఎదుర్కోవలసి వస్తుంది.
ఉదాహరణకు: ఏ మూడవ ప్రపంచ దేశమైనా నయా ఉదారవాద చట్రాన్నుంచి బయటపడి ప్రజలకు అనుకూలంగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించాలని నిర్ణయించిందనుకుందాం. అప్పుడు ఆ దేశంలోని పెట్టుబడులు వెంటనే బయటకు తరలిపోతాయి. అలా పెట్టుబడులు బయటకు తరలిపోకుండా ఆంక్షలు విధించారనుకుందాం. అప్పుడు బయటనుండి ఆ దేశానికి వచ్చే పెట్టుబడుల ప్రవాహం నిలిచిపోతుంది. అనతి కాలంలోనే ఆ దేశపు వాణిజ్య లోటు పెరిగిపోతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఆ దేశం ఎగుమతుల, దిగుమతుల మీద కూడా నియంత్రణ విధించాలి. దానివలన దేశంలో ప్రజలకు కావలసిన వస్తువులకు కొరత ఏర్పడుతుంది. వాటి ధరలు పెరుగుతాయి. అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది. నయా ఉదారవాద చట్రం నుండి బయటపడడానికి ఒక దేశం చేసే ప్రయత్నాలు ఆ మార్పు జరిగే క్రమంలో ప్రజలను ఈ మాదిరిగా కష్టాలకు గురిచేస్తాయి.
అయితే, డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాటు గనుక జరిగితే ఈ కష్టాలు చాలా మేరకు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆ యా దేశాల నడుమ జరిగే ద్వైపాక్షిక వ్యాపార ఒప్పందాలు ఇందుకు దోహదం చేస్తాయి. సోవియట్‌ యూనియన్‌ ఉనికిలో ఉన్న కాలంలో చాలా దేశాలతో అది ఇటువంటి ఒప్పందాలను కుదుర్చుకునేది. ఆ ఒప్పందాలు ఉభయ దేశాలకూ ప్రయోజనకరంగా ఉండేవి. ఇప్పుడు అటువంటి ఒప్పందాలకు, నయా ఉదారవాద చట్రాన్ని బద్దులుగొట్టుకుని బయటపడడానికి అవకాశాలు పెరుగుతున్నాయి. చైనా తన ముడిచమురు దిగుమతుల కోసం చేసుకుంటున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అటువంటి అవకాశాల పెరుగుదలకు సంకేతం.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌