హామీల అమలుకు ప్రశ్నించే నాయకుడు అవసరం

–  నిజమాబాద్ ఎంపీ ఎన్నికల్లో బాజిరెడ్డిని గెలిపించాలి
– అరవింద్ గెలిచిన ఐదు ఏండ్లలో ఒక్క రూపాయి పనిచేయలే
– అరవింద్ పసుపు బోర్డ్ ఆఫీస్ ఎక్కడ?
– పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఉన్న జీవన్ రెడ్డి ఒక్కసారి ఇక్కడి ప్రజలకు అగుపడలేదు
– పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్
 నవతెలంగాణ – కమ్మర్ పల్లి
హామీల అమలుకు ప్రశ్నించే నాయకుడు అవసరమని, నిజమాబాద్ ఎంపీ ఎన్నికల్లో బాజిరెడ్డిని గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. అరవింద్ గెలిచిన ఐదు ఏండ్లలో ఒక్క రూపాయి పనిచేయలేదని, అరవింద్ పసుపు బోర్డ్ ఆఫీస్ ఎక్కడ ఉందో చూపించాలని డిమాండ్ చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఉన్న జీవన్ రెడ్డి ఒక్కసారి కూడా ఇక్కడి ప్రజలకు అగుపడలేదని, అటువంటి వ్యక్తికి ఓట్లేసి మళ్ళీ మోసపోతామని ప్రజలను ప్రశ్నించారు. ఆదివారం మండల కేంద్ర శివారులోని  లలిత గార్డెన్ లో జరిగిన కమ్మర్ పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల  మండలాల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నిజామాబాద్  పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి  మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. 14 ఏండ్ల పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ 10 ఏండ్లలో అనేక రంగాలలో అగ్రగామిగా నిలిపాడాన్నారు.చెప్పినవి, చెప్పని అనేక హామీలు ఒక పద్ధతి ప్రకారం అమలు చేసారని  ఎమ్మెల్యే అన్నారు.కాంగ్రెస్  ప్రభుత్వం అనేక అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చిందన్నారు.మొన్నటి ఎన్నికల్లో ఓట్ల తేడా కేవలం 1.8 శాతం మాత్రమేనని కార్యకర్తలకు తెలియజేశారు. 100 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ నేతలు చెప్పారని, ఇప్పుడు 120 రోజులవుతున్న ఒక్క బస్ హామీ తప్ప ఏ హామీ నెరవేర్చలేదని విమర్శించారు.ఉచిత విద్యుత్ అందరికి అని చెప్పి నిబంధనల పేరుతో కొందరికి చేశారన్నారు.ఫ్రీ సిలిండర్ అమలు సరిగ్గా లేదని, మొత్తం కట్టించుకుని సబ్సీడీ డబ్బులు ఎవరికి వేస్తున్నారో కూడా తెలియటం లేదన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ఆడిగే హక్కు లేదన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అనేక హామీలను వీడియో స్క్రీన్ పై ఎమ్మెల్యే ప్రదర్శింపజేశారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వీడియోలను గ్రామ గ్రామానా ఓటర్ల వద్దకు తీసుకెళ్లి హామీలు అమలు చేసారా? లేకుంటే కాంగ్రెస్ కి ఎందుకు ఓటు వేయాలని ప్రజలను అడగాలని కార్యకర్తలను కోరారు.కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఉన్నప్పటికీ ఈ 5 ఏండ్లలో ఏనాడైనా మంచికి చెడుకు మీ గ్రామానికి వచ్చారా? అని ప్రశ్నించారు.ఏనాడు మీ వద్దకు రాని అభ్యర్థికి ఇప్పుడు మళ్లీ ఎంపీ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలన్నారు.పసుపు బోర్డ్, ఎర్రజొన్నల మద్దతు ధర విషయంలో పోయిన ఎంపీ ఎన్నికల్లో కవితమ్మకి ప్రజలు శిక్ష వేశారని, మరి ఇక్కడ ఎంపీగా గెలిచి, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి కూడా 5 రోజుల్లో పసుపు బోర్డ్ తెస్తా అన్న అరవింద్ 5ఏండ్లు అయిన తెలేదు, మరి ఆయనకు ఓటు ఎందుకు వేయాలన్నారు.ఇప్పుడు మళ్లీ మోడీ పసుపు బోర్డ్ జిఓ ఇచ్చాడు బోర్డు ఏర్పాటు అయ్యిందని కొత్త నాటకం అడుతున్నాడన్నారు. ఈ వేదికగా అడుగుతున్న పసుపు బోర్డు మెయిన్ దర్వాజ, ఆఫీస్, టాయిలెట్స్, కూర్చునే కుర్చీలు ఎక్కడ ఉన్నాయో రైతులకు చూపిస్తావా అని అరవింద్ ను ప్రశ్నించారు. బాజిరెడ్డి గోవర్ధన్ 40 ఏండ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు, పార్లమెంట్ పరిధిలో ముప్పావు వంతు నియోజకవర్గాల్లో ఆయన ప్రాతినిధ్యం వహించడం ద్వారా అందరికి సూపరిచితుడన్నారు.బాజిరెడ్డి గోవర్ధన్ సమస్యలు వస్తే వెనక్కి పోయేవాడు కాదు ఫైటర్ అని ఎమ్మెల్యే అన్నారు.అధికారంలో ఉన్న ప్రభుత్వము ఇచ్చిన హామీలను అమలు పరచడానికి,ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రజల పక్షాన నిలబడటానికి ఎంపీగా బాజిరెడ్డి ని గెలిపించాలని కోరారు.హామీలు అమలు చేయకున్న మాకు ప్రజలు ఓట్లు వేశారు అనే పరిస్థితి వస్తే రాబోయే ఐదు ఏండ్లు కాంగ్రెస్ ఏ హామీ నెరవర్చదని ప్రజలకు సూచించారు. ఇచ్చిన హమీలు నెరవేర్చకుంటే ప్రజలు ఒడిస్తారన్న భయం కాంగ్రెస్ కి కల్పిస్తేనే ఇచ్చిన హామీలు అమలు అవుతాయన్నారు.పార్టీ పదవులు పొంది అధికారం అనుభవించి ఇప్పడు అధికారం పోగానే దేనికో ఆశపడి పార్టీ వీడుతున్నవారు నా దృష్టిలో నీచులన్నారు.పోయిన వారు పోయిన ఇక్కడ ఉన్నవారు ఆణిముత్యాలని మీ సహకారం ఇలాగే ఉంటే ప్రజల పక్షాన పోరాడటానికి ముందుంటానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు.
బాల్కొండ నుండి మంచి మెజార్టీ ఇవ్వండి… బాజిరెడ్డి 
ఈ ఎన్నికల్లో నాకు బాల్కొండ నియోజవర్గము నుండి మంచి మెజారిటీ ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ నిజాంబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆ పార్టీ కార్యకర్తలను కోరారు. ఎక్కడి కెళ్లిన పాజిటీవ్ వేవ్ ఉందని, నేను ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ లో పని చేసిన అనుభవం, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయన్నారు.నన్ను ఎంపీగా గెలిపించండి రాబోయే 5 ఏండ్లు మీ సేవకుడిగా పని చేస్తానన్నారు.నేను స్థానికున్ని కాకున్నా జగిత్యాల లోని ప్రజలు కూడా నాకే ఓటు వేస్తాం అంటున్నారని తెలిపారు. జీవన్ రెడ్డి అధికారం అనే అహంకారంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తాడని అక్కడి ప్రజలు తనతో చెప్పినట్లు తెలిపారు.కోరుట్ల నియోజకవర్గ ప్రజలు సైతం అరవింద్ కి మళ్ళీ ఒకసారి గట్టిగా బుద్ధి చెబుతాం అంటున్నారని, ఎంపీ అరవింద్ ఏ రోజు  గ్రామాల్లో కి వచ్చి ఒక్క పని చేసిన వాడు కాదన్నారు. అహంకారం, అనుకోకుండా వచ్చిన ఎంపీ పదవి గర్వం తప్ప గెలిపించిన ప్రజలకు పని చేయాలన్న సోయి లేనివాడు అరవింద్ అన్నారు.నన్ను గెలిపిస్తే ఉంటే పార్లమెంట్ సమావేశాలప్పుడు ఢిల్లీలో ఉంట లేదంటే ఇక్కడ ప్రజల మధ్యలోనే ఉంటానన్నారు. ఈ సమావేశంలో కమ్మర్ పల్లి, మోర్తాడ్, ఏర్గట్ల మండలాల నుండి భారీగా ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.