– ఎన్ని ఇబ్బందులైనా వెనుకడుగు వేయం
– దరఖాస్తుదారుల నుంచి ఓటీపీ అడగరు
– ఎవరైనా అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయండి : ప్రజాపాలన క్యాబినెట్ సబ్ కమిటీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకిచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. ఇప్పటికే ఒకటి అమలు చేశాం. మిగతా ఐదింటిని నిర్దేశిత గడువులోగా అందిస్తాం. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయం” అని ప్రజాపాలనపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ తెలిపింది. శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఆ కమిటీ సమావేశానికి రాష్ట్రమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రజా పాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? డాటా ఎంట్రీ ఎంత వరకు పూర్తయింది? గ్యారంటీలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల్లో కేటగిరీల వారిగా వచ్చిన అభ్యర్థనలు ఎన్ని? తదితర వివరాలపై కమిటీ చర్చించింది. లబ్దిదారుల ఎంపిక, అమలుకు చేపట్టాల్సిన యాక్షన్ ప్లాన్‌పై భట్టి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. డేటాలో డూప్లికేషన్ లేకుండా సీజీజీ, ఐటీ విభాగంతో పాటు మిగతా శాఖలు సమిష్టిగా పని చేయాలని ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తు డేటా సేకరణలో కానీ, ఎంట్రీలో కానీ ఎవరు కూడా దరఖాస్తుదారుల నుంచి ఓటీపీ అడగకూడదని అధికారులకు సూచించారు. ఎవరైనా ఓటీపీ అడిగితే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, హౌం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.