
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
నల్గొండ కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్లో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఉచిత పంట బీమా పథకం పై అవగాహన సదస్సును నిర్వహించారు. రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రైతులకు భరోసా కల్పించే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం లో భాగంగా ఈ వానకాలం పంట నుండే రైతులకు ఉచిత పంట బీమా పథకాన్ని అమలు చేయాలని, ఆ అమలుకు సంబంధించిన విషయాలపై ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు అవగాహన సదస్సు జరిగింది. నల్గొండ జిల్లాలో వానాకాలంలో వరి, పత్తి, టమాట, కందులు పంటలకు… ఏసంగి లో వరి, వేరుశనగ పంటలకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఉచిత పంట బీమా పథకం వర్తిస్తుంది. దీనికోసం రైతులు క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద తాము వేసిన పంటలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద నమోదు చేసుకున్న పంటకు మాత్రమే ఇది వర్తిస్తుంది. రైతు ఒక పంట పండించి మరో పంట నమోదు చేసుకుంటే ఇది వర్తించదని అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగినా, అడవి జంతువుల వల్ల పంట నష్టం జరిగినా ఈ బీమా వర్తిస్తుంది.ఉచిత పంట బీమా విధి విధానాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో అవలంబించాల్సిన విషయాలపై ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కమిషనరేట్ హైదరాబాద్ కి చెందిన డిప్యూటీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్ బాబు, నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, యాదాద్రి భువనగిరి జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంగీతలక్ష్మి, ట్రైనర్ సుమన్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.