గృహలక్ష్మి అమలును వేగవంతం చేయాలి

– వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లను ఆదేశించిన
– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి
– సమావేశంలో పాల్గొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ హరీష్‌
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
గృహలక్ష్మి అమలును వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, ఎరువులు-విత్తనాల నిల్వలు, తెలంగాణకు హరితహారం, గృహలక్ష్మి, నివేశన స్థలాల అందజేత తదితర అంశాలపై బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లతో సి.ఎస్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్‌ మాట్లాడుతూ గృహలక్ష్మి, ఆసరా పెన్షన్ల దరఖాస్తులను పరిశీలిస్తూ, అర్హులైన వారి జాబితాలు పంపించాలన్నారు. గృహలక్ష్మి పథకం కింద అర్హులైన వారిని గుర్తించి, సత్వరమే మంజూరీ పత్రాలను పంపిణీ చేయాలన్నారు. రెండు వారాలలో ఆయా జిల్లాలకు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా పూర్తి స్థాయిలో మంజూరీలు తెలపాలని గడువు విధించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ భూపాల్‌ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి గీత రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ప్రభాకర్‌, జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.