– ఎక్కడా లేని విధంగా సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు
– హుజురాబాద్ పై సీఎం కేసీఆర్ కు అమితమైన ప్రేమ
– మహిళలకు రూ.100 కోట్లు అడిగితే రూ.200 కోట్లకు పైగా ఇచ్చిన ఘనత ఆయనదే..
– ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
నవతెలంగాణ-వీణవంక
దేశంలోనే అద్భుతమైన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని, అలాగే సబ్బండ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని, ఇదంతా సీఎం కేసీఆర్ చలువేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలల్లో మండలంలో ఘనంగా పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మండలంలోని రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలన్నీ చల్లగా ఉండాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దారని అన్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులందరికీ ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, రైతు బీమా అందిస్తూ రైతులకు అండగా ఉన్నాడని పేర్కొన్నారు. అలాగే కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, దళితులకు 50 యూనిట్ల లోపు ఉచిత కరంట్ ఇస్తూ దళితులకు అండగా ఉంటూ ధనికులుగా మారుస్తున్నట్లు వివరించారు. అలాగే దివ్యాంగులకు రూ.3016 ఉన్న పింఛన్ ను వచ్చే నెల నుండి రూ.4116లకు పెంచుతున్నట్లు చెప్పారు. కావున్న సీఎం కేసీఆర్ కు మనమందరమూ అండగా ఉండాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టి నియోజకవర్గంలో లక్షా యాబై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న ఘనత ఆయనకు దక్కుతుందన్నారు.
కేసీఆర్ కు హుజురాబాద్ పై అమితమైన ప్రేమ
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు హుజురాబాద్ పై అమితమైన ప్రేమ ఉందని చెప్పారు. ఇక్కడే దళితబంధు, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు ప్రవేశపెట్టి దేశ చరిత్రలోనే అభినవ అంబేద్కర్ లాగా మారారని అన్నారు. గత ఆరు నెలల క్రితం జమ్మికుంటలో జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ను హుజురాబాద్ నియోజకవర్గ మహిళల కోసం రూ.100 కోట్ల రుణాలు కావాలని అడిగితే సీఎం కేసీఆర్ మనపై ప్రేమతో అడిగిన దానికంటె రెట్టింపులో రూ.200 కోట్లకు పైగా మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బందిని శాలువాతో సత్కరించారు. అంతకు ముందు గ్రామంలో మహిళలు బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించి, బతుకమ్మ ఆట ఆడారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. సర్పంచ్ పోతుల నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ (లోకల్ బాడీస్) గరిమా అగర్వాల్, ఎంపీపీ ముసిపట్ల రేణుకాతిరుపతిరెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాల సాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మావురపు విజయభాస్కర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు నాగిడి సంజీవరెడ్డి, ఎంపీటీసీ ఒడ్డెపల్లి లక్షిభూమయ్య, డీఎల్పీవో శ్రీలత, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో ప్రభాకర్, ఏవో గణేష్, పీఏసీఎస్ డైరెక్టర్లు చెకబండి శ్రీనివాస్ రెడ్డి, కట్కూరి మధుసూదన్ రెడ్డి, ఏపీఎం కొమురయ్య, పంచాయతీ కార్యదర్శి వెంకట్రాజం, వార్డు సభ్యులు చింతల రాజయ్య, మాడ రవీందర్ రెడ్డి, ఒగ్గె మమత సమ్మయ్య, నాయకులు బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇట్టవేన రాజయ్య, అడిగొప్పుల సత్యనారాయణ, పోతుల సురేష్, చింతల సుమన్ తదితరులు పాల్గొన్నారు.