నియంత్రణ లేని వాణిజ్యంతో చిక్కులు

Implications with unregulated tradeఏ తరహా ఆర్థిక వ్యవస్థలోనైనా స్థూల డిమాండ్‌కు లోటు ఉండదని, ఎంత మోతాదులో ఉత్పత్తి జరిగితే అది అంతా వినియోగించడానికి తగిన డిమాండ్‌ ఉంటుందని ఫ్రెంచి ఆర్థికవేత్త జె.బి.సే విశ్వసించాడు. కొన్ని రక్షణ చర్యలు, కొన్ని కోతలు ఉంటాయే తప్ప వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే మొత్తం వినియోగించబడుతుందని అతను భావిం చాడు. దీన్నే ‘సే సూత్రం’ అంటారు. అయితే ఈ సూత్రం బొత్తిగా అర్ధం, పర్ధం లేనిది. ఈ సూత్రమే గనుక వాస్తవం అయితే ఆర్థిక వ్యవస్థలో ఎన్నడూ అధికోత్పత్తి సంక్షోభం ఉత్పన్నం అయి వుండేది కాదు. సే సూత్రాన్ని మార్క్స్‌ చీల్చి చెండాడాడు. 1930 దశకంలో జె.ఎం.కీన్స్‌, మిచల్‌ కాలెక్కీ ఎవరికి వారుగానే, దాదాపు ఒకే సమయంలో ఈ సూత్రం చెల్లదని నిర్ధారించారు. అయినప్పటికీ, బూర్జువా ఆర్థిక పండితులు పెట్టుబడిదారీ వ్యవస్థలో లోపాలు ఉంటాయని అంగీకరించరు. అందుచేత రకరకాల బూటకపు సిద్ధాంత వ్యూహాలతో సే సూత్రాన్ని తిరిగి సమర్ధించ డానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలలో ఎటువంటి శాస్త్రీయతా లేదు.
ఇదంతా ఇప్పుడు ఎందుకు చర్చిస్తున్నాం? స్వేచ్ఛా వాణిజ్యాన్ని సమర్ధించే ప్రతీవాదనా సే సూత్రం చెల్లుబాటు అవుతుందనే ప్రాతిపదిక మీద నడుస్తుంది. అన్ని ఆర్థిక వ్యవస్థలూ పూర్తి స్థాయిలో ఉపాధి కల్పిస్తాయనే వాదన ప్రాతిపదికగా స్వేచ్ఛా వాణిజ్య సమర్ధకులు వ్యవహరిస్తారు. ప్రతీ దేశంలోనూ లభించే వనరులను పూర్తి స్థాయిలో వినియోగించడం ద్వారా మొత్తం ప్రపంచ ఉత్పత్తిని స్వేచ్ఛా వాణిజ్యం పెంపొందిస్తుంది అని వారంటారు (ప్రతీ దేశమూ తనకు ఏయే రంగాల్లో ప్రావీణ్యత ఉందో ఆ రంగాల్లో ప్రత్యేకించి కేంద్రీకరించి ఉత్పత్తి చేస్తుందన్నది వారి వాదన). అందుచేత స్వేచ్ఛా వాణిజ్యం వలన అన్ని దేశాలూ లాభపడతాయని వారంటారు.
ఈ వాదనలకు మూలం సే సూత్రం. ఆ సూత్రమే అసలు చెల్లదు కనుక వీరి వాదనలు సైతం చెల్లవు. పెట్టుబడిదారీ దేశాలు సాధారణంగా పూర్తి స్థాయిలో తమ వనరులను అన్నింటినీ ఉత్పత్తి కోసం వినియోగించలేవు. ఎందుకంటే వాటిలో ప్రతీ దేశంలోనూ దేశీయ డిమాండ్‌ ఎప్పుడూ ఉత్పత్తి కన్నా తక్కువగానే ఉంటుంది. అందుచేత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద కూడా ఉత్పత్తి జరిగిన మేరకు సరిపడా డిమాండ్‌ ఉండదు. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ డిమాండ్‌కు కొరత ఉన్న వ్యవస్థగానే ఉంటుంది. అందుచేత స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా ఒక దేశం తన ఉత్పత్తిని, ఉపాధి అవకాశాలను పెంచుకోవడం గనుక జరిగితే మరేదో దేశంలో ఉత్పత్తి, ఉపాధి అవకాశాలు తగ్గిపోక తప్పదు. అంటే, స్వేచ్ఛా వాణిజ్యం వలన దేశాల మధ్య పీకలు తెగిపోయేంత తీవ్రమైన పోటీ నెలకొంటుంది. తక్కిన దేశాలకన్నా ముందే తన సరుకుల్ని అమ్మేసుకోవాలని ప్రతీ దేశమూ తాపత్రయపడుతుంది.
అందుచేత నయా ఉదారవాదం అనుసరించే వృద్ధి వ్యూహం మౌలికంగానే అనైతికమైనది, అంగీకరించ కూడనిది. ఈ వ్యూహం మూడో ప్రపంచ దేశాలు ఒకదానితో ఇంకొకటి పోటీ పడేట్టు చేస్తుంది. ఇది పూర్తిగా బూర్జువా వ్యూహం. పెట్టుబడిదారుడు కార్మికులు ఒకరితో మరొకరు పోటీ పడేట్టు చేస్తాడు (ఆ కార్మికులు సంఘాలుగా ఏర్పడి బూర్జువా వర్గాన్ని ఎదిరించేదాకా ఈ పోటీ సాగుతూనేవుంటుంది. ఆ తర్వాత కూడా కార్మికులకు, నిరుద్యోగులకు మధ్య పోటీ తప్పదు). అదే మాదిరిగా నయా ఉదారవాదం మూడో ప్రపంచ దేశాలు ఒకదానితో మరొకటి పోటీ పడేట్టు చేస్తాయి. వలస పాలనకు వ్యతిరేకంగా ఏ దేశానికి ఆ దేశం పోరాడుతున్నప్పుడు వాటి మధ్య ఒక విధమైన ఐక్యత, సౌహార్ద్రత పెంపొందాయి. నేటికీ ఆ ఐక్యత, సౌహార్ద్రత ఎంతో అవసరం. అది ఉంటేనే అవి సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా నిలదొక్కుకోగలవు. వాస్తవానికి మానవ సమాజం పురోగమించాలంటే కావలసినది పరస్పర సహకారమే తప్ప పరస్పర పోటీ కానే కాదు. కాని నయా ఉదారవాదం ఇందుకు పూర్తి వ్యతిరేక దిశలో నడవాలని ఒత్తిడి చేస్తుంది. ఇది నైతికంగా అభ్యంతరకరం.
ఈ విధంగా అభ్యంతరం చెప్పడానికి మరొక కారణం కూడా ఉంది. నయా ఉదారవాద విధానాల అను భవం బట్టి చూస్తే స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో అన్ని రకాల నియంత్రణలనూ తొలగించ డంతో బాటు పెట్టుబడుల రాకపోకల మీద ఆంక్షలనూ తొలగించడం జరుగుతోంది. అలా చేయకపోతే లావాదేవీల చెల్లింపులో లోటును భర్తీ చేయడం చాలా దేశాలకు అసాధ్యం అయిపోతుంది. ఐతే ఈ విధంగా ఆంక్షలను తొలగించడం వలన ప్రపంచ పెట్టుబడుల ప్రవాహ తాకిడికి ప్రతీదేశమూ గురౌతుంది. దాని వలన అక్కడి ప్రభుత్వం బలహీనపడుతుంది. తన దేశంలో ఉత్పత్తిని పెంచడానికి గాని, ఉపాధి అవకాశాలను పెంచుకోడానికి గాని జోక్యం చేసుకోలేని స్థితిలో పడిపోతుంది.
తమ అదుపులో లేని అదృశ్య శక్తుల మీద ప్రజల జీవన ప్రమాణాలు ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ అదృశ్య శక్తులే ప్రపంచ స్థూల డిమాండ్‌ను నిర్ధారిస్తాయి. స్వతంత్రం వచ్చాక తమ ఆర్థిక భవిష్యత్తును తామే నిర్ణయించుకో గలుగుతామని విశ్వసించిన ప్రజలు వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నికల ద్వారా ప్రజా స్వామ్యయుతంగా తమ ఆకాంక్షల ను, కోర్కెలను ప్రతిబింబించే ప్రభుత్వాలు ఏర్పడతాయని, అవి తమ కోర్కెలను నెరవేరుస్తాయని వారు భావించారు. కాని నయా ఉదారవాద దశలో దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వాలు కాకుండా, పోటీ ప్రపంచపు స్వత:సిద్ధ నియమాలు నిర్ధారించడం మొదలౌతుంది. ప్రజలు ఒక మేరకు తమ దేశ రాజకీయాలను నిర్ణయించగలుగుతారు. కాని ఆ రాజకీయాలతో దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించలేని, ప్రభావితం చేయలేని పరిస్థితి వస్తుంది. అంటే వలస పాలన కాలం నాటి నిర్బంధ పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుందన్నమాట. స్వతంత్ర దేశంలో ప్రజలు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోలేని స్థితి రావడం అంటే అది నైతికంగా చాలా అభ్యంతరకరమైనది.
ఈ నైతిక అభ్యంతరాలను పక్కన పెట్టి కేవలం ఆర్థిక కోణం నుండే పరిశీలించినా, సే సూత్రం కొరగానిదిగానే తేలుతుంది. ఎటువంటి నియంతణా లేని వాణిజ్యం మీద ఆధారపడి రూపొందించిన వృద్ధి వ్యూహం కన్నా దేశీయ మార్కెట్‌ను బలోపేతం చేసే వ్యూహమే అన్ని రకాలుగా మిన్నగా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచ మార్కెట్‌లో ఉత్పత్తికి తగిన మోతాదులో డిమాండ్‌ లేదు అంటే దానర్ధం ప్రపంచంలో కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలలో (అన్నింటిలోనూ ఉండాలని లేదు) డిమాండ్‌కు కొరత ఉందని అర్ధం. మూడవ ప్రపంచ దేశాల విషయానికి వస్తే అవన్నీ సాధారణంగా స్థూల డిమాండ్‌ తగినంత లేక కొరతతోనే ఉంటాయి. నయా ఉదారవాద విధానాల అమలు అనంతరం ఇది ఆ దేశాలకు సర్వ సాధారణ లక్షణం అయిపోయింది. అటువంటప్పుడు అక్కడ ప్రభుత్వాలు జోక్యం చేసుకుని స్థూల డిమాండ్‌ను పెంచే చర్యలు తీసుకుంటే మూడవ ప్రపంచ దేశాల పరిస్థితి తప్పకుండా మెరుగౌ తుంది. ఉపాధి అవకాశాలు పెరిగి ఉత్పత్తి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితి స్వేచ్ఛా వాణిజ్యం అమలౌతుంటే సాధ్యం కాదు.
అయితే ఇక్కడ మూడు మినహాయింపులు అవసరం. ఒకటి : మనం మూడవ ప్రపంచం మొత్తం మీద అన్నింటినీ కలిపి మాట్లాడుతున్నాం. కాని ఈ మూడవ ప్రపంచ దేశాలలో కొన్ని ఇప్పటికే ఎగుమతుల పెంపుదలలో విజయ వంతమై వుండవచ్చు. వాటి ఉత్పత్తి ఇప్పటికే చాలా ఎక్కువగా ఉండి ఆ దేశాలలో స్థూల డిమాండ్‌ మరి అదనంగా పెరిగే అవకాశాలు దాదాపు లేకపోవచ్చు. కాని తక్కిన మూడవ ప్రపంచ దేశాలు కూడా అదే విధంగా విజయవంతం కావడం ఇక సాధ్యపడదు. ఒకానొక వ్యక్తి లాటరీలో ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు కాబట్టి లాటరీ టిక్కెట్లు కొన్న వారందరూ గెలుచుకోవడం ఎలా సాధ్యం కాదో ఇదీ అంతే.
రెండవది : మూడవ ప్రపంచ దేశాలలో విజయవంతం అయిన దేశాలు అక్కడ ప్రభుత్వాలు ఎగుమతులను పెంచే విషయంలో బలంగా జోక్యం చేసుకున్నాయి గనుకనే వాటి విజయం సాధ్యపడింది. ఆ ప్రభుత్వాలు గనుక స్వేచ్ఛా వాణిజ్య సూత్రాన్ని పాటించి జోక్యం చేసుకోకుండా వదలివేసినట్లయితే ఈ విజయం సాధ్యపడేది కాదు. దీనిని పట్టుకుని కొందరు అన్ని దేశాలలోనూ ఎగుమతులను ప్రోత్సహించే వాణిజ్య వ్యూహాన్ని అనుసరించాలని వాదిస్తున్నారు. కాని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తంగా డిమాండ్‌ కొరతతో ఉన్నప్పుడు ఒక దేశంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎగుమతులను పెంచడానికి పూనుకుంటే అప్పుడు అనివార్యంగా వేరే ఇంకొక దేశపు వ్యాపారం దెబ్బ తింటుంది. పరస్పర సహకారం ఉంటే తప్ప మూడవ ప్రపంచ దేశాలు సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని నిలవరించలేవు అని అనుకున్నప్పుడు వాటిలో వాటికి పోటీ పెట్టే వాదన ముందుకు తేవడం నైతికంగా అభ్యంతరకరమే గాక ఆర్థిక సూత్రాలను బట్టి చూసినా, మూడవ ప్రపంచ దేశాలన్నీ వృద్ధి చెందడానికి ఈ వ్యూహం ఎంతమాత్రమూ తోడ్పడదు.
మూడవది: ఇప్పటికే మూడవ ప్రపంచ దేశాలలో జరుగుతున్న ఉత్పత్తి వాటికున్న సామర్ధ్యం కన్నా చాలా తక్కువ స్థాయిలో ఉంది. ఇటువంటప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని స్థూల డిమాండ్‌ను పెంచే దిశగా, ఉపాధి అవకాశాలను పెంచే దిశగా ప్రయత్నిస్తే అప్పుడు విదేశీ మారకద్రవ్య నిల్వలలో లోటు పెరుగుతుంది. అందుచేత ఎగుమతులను పెంచడం తప్ప వేరే వ్యూహం ఏదీ మనకు కనిపించదు. కేవలం దేశీయ డిమాండ్‌ను పెంచినంత మాత్రాన సరిపోదు. ఇలా నయా ఉదారవాద చట్రం లోపల ఉంటూ ఎగుమతులను పెంచుకోవాలంటే మన కరెన్సీ మారకపు రేటును తగ్గించుకోవడం అనివార్యం అవుతుంది. అలా చేస్తే, మనం దిగుమతి చేసుకునే వస్తువుల రేట్లు పెరుగుతాయి. వాటిలో మనకు అత్యవసరమైన చమురు వంటివి కూడా ఉన్నాయి. వాటి రేట్లు పెరిగితే ఆ భారం మళ్లీ వినియోగదారుల మీదే పడుతుంది. దాని ఫలితంగా ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అలా పెరగకుండా చూడ డానికి నయా ఉదారవాదం ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది. ఒకపక్క మన కరెన్సీ మారకపు రేటును తగ్గించినా, మరొకపక్క కార్మికులకిచ్చే వేతనాల రేటును కూడా తగ్గించి వేస్తుంది. కార్మికుల ఉత్పాదకత పెరిగినా దానితోబాటుగా పెరగవలసిన వేతనాలను పెరగనివ్వదు.
కాని ఆ విధంగా చేయడం అన్యాయమే కాదు, అనవసరం కూడా. సంపన్నులు మాత్రమే వినియోగించే వివిధ రకాల విలాస వస్తువుల దిగుమతుల మీద ఆంక్షలు విధిస్తే కార్మికుల వేతనాలను తగ్గించకుండానే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. అంటే ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉపాధి అవకాశాలను పెంచి స్థూల డిమాండ్‌ను కూడా పెంచే దిశగా జోక్యం చేసుకోవచ్చు. ఆ క్రమంలో ఎదురయ్యే విదేశీ మారకపు కొరత సమస్యను పరిష్కరించ డానికి కొన్ని దిగుమతుల మీద ఆంక్షలు విధించవచ్చు. ఇదంతా సాధ్యమే (దానితోబాటు పెట్టుబడుల రాక, పోకల మీద కూడా ఆంక్షలు విధించాలి). విదేశీ రుణ భారం భరించలేనంతగా పెరిగిపోయిన దేశాల విషయంలో కూడా ఈ వ్యూహాన్ని అనుసరించవచ్చు. తీర్చవలసిన రుణాలలో ప్రాధాన్యత ప్రకారం చెల్లించే విధానాన్ని అనుసరిస్తే దీనికి ఒక దారి దొరుకుతుంది.
కాని ఈ విధమైన వ్యూహాన్ని అనుసరించడానికి అంతర్జాతీయ ద్రవ్యపెట్టుబడి ఎంతమాత్రమూ అంగీకరించదు. దాని వెనుక ఉన్న బలమైన దేశాలూ అంగీకరించవు. కాని వాళ్లు ప్రబోధిస్తున్న ఆర్థిక సిద్ధాంతం యావత్తూ ఎంత లోపభూయిష్టమో మనం ఇప్పుడు చూశాం. అందుచేత అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి, సంపన్న పశ్చిమ దేశాలు ఆదేశించినదానికల్లా తలాడించడం కాకుండా మూడవ ప్రపంచ దేశాలు విడివిడిగా కాని, అందరూ కలిసికట్టుగా కాని తమ తమ దేశాల్లో స్థూల డిమాండ్‌ను పెంచేవిధంగా ఉపాధి అవకాశాల కల్పన కోసం ప్రయత్నిం చాలి. విదేశీ మారకద్రవ్యం దేశ అవసరాల ప్రాధాన్యత రీత్యా ఖర్చు చేసే నియంత్రణను పాటించాలి.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌