– సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారం
– సీఎంతో నిటి అయోగ్ బృందం భేటీ
– రాష్ట్రావసరాలపై సమగ్ర చర్చ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా శ్రేయస్సు, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సహకార సమైక్యవాద (కో-ఆపరేటివ్ ఫెడరలిజం) ప్రాముఖ్యతకు అనుగుణంగా కలిసి పనిచేయాలని నిటి అయోగ్, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాయి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేసింది. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మెన్ సుమన్ కుమార్ బేరి బృందం ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డితో సమావేశమైంది. ఈ సందర్భంగా వారు రాష్ట్ర సమగ్ర ప్రగతి, అభివృద్ధి అంశాలు, విధాన కార్యక్రమాలు, సహకారంపై చర్చించారు. సమర్థవంతమైన పాలనకు మార్గదర్శక సూత్రంగా కో-ఆపరేటివ్ ఫెడరలిజం ప్రాముఖ్యతను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నిటి ఆయోగ్, రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్ళ పరిష్కారానికి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధి, కీలక రంగాలకు సంబంధించిన ప్రాధాన్యతలు, రాష్ట్ర అవసరాలను నిటి ఆయోగ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కేంద్రం నుంచి అందవలసిన న్యాయమైన కేటాయింపులపై తప్పనిసరి సిఫార్సులు చేస్తామని నిటి అయోగ్ అధికారుల బృందం తెలిపింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి పలు అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. 16వ ఆర్థిక సంఘం ద్వారా పెరిగిన రాష్ట్ర కేటాయింపులను పరిశీలించాలనీ, ఆరోగ్యం, విద్యలో మౌలిక సదుపాయాల కోసం నిధులు కేటాయించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్ 94(2) ప్రకారం వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంట్‌కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.1,800 కోట్ల నిధుల విడుదల అంశాన్ని ప్రస్తావించారు. వినూత్న పాలనా పద్ధతులు, విజయవంతమైన నమూనాల అమలు కోసం పరస్పరం సహకరించుకొనేందుకు అంగీకారం తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ, ఇంజినీరింగ్ కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న యువతలో నైపుణ్యాలను పెంపు కోసం తీసుకోవాల్సిన చర్యల్ని గుర్తుచేశారు. సోలార్ ఎనర్జీ వినియోగంపై రాష్ట్రానికి సహకరించాలని కోరారు. వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వ సామర్ధ్యాలను పటిష్టం చేసేందుకు స్టేట్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ ట్రాన్స్ఫర్మేషన్ (సిట్) ఏర్పాటుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అమలు కోసం అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ)తో సబర్మతి రివర్ ఫ్రంట్, నమామి గంగే ప్రాజెక్టుల తరహాలో సాంకేతిక సహకారం, అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా సీఎం నిటి అయోగ్ ప్రతినిధి బృందాన్ని కోరారు. దానిలో భాగంగా మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అర్బన్ గ్రోత్ హబ్‌గా మారుతున్న హైదరాబాద్‌ను కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాలుష్య రహిత పట్టణంగా అభివృద్ది చేయడానికి ప్రణాళికలు ఇవ్వాలని కోరారు. నిటి అయోగ్ పాలక మండలిలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా నిట్ అయోగ్ వైస్ చైర్మెన్ సుమన్ కుమార్ కోరారు. సమావేశంలో సభ్యులు విజయకుమార్, డైరెక్టర్ జనరల్ సంజరుకుమార్, డైరెక్టర్ అభినేష్ డాష్, ముత్తు కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు తదితరులు పాల్గొన్నారు.