పోతారంలో ఋతుప్రేమ కార్యక్రమంపై అవగాహన
జూన్ 14 నుంచి గర్భిణులకు, మహిళలకు కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ దుబ్బాక రూరల్
‘మహిళ ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జూన్ 14 నుంచి గర్భిణులకు, మహిళలకు కేసీఆర్ న్యూట్రీషన్ కిట్లు అందజేస్తాం. మహిళల ఆరోగ్య సంక్షేమం కోసం ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ సేవలతో పాటు ఋతుప్రేమ సేవలు అందనున్నాయి. అందుకు అనుగుణంగా వైద్య సిబ్బందిని నియమించాం’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక మండలం పోతారం గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఋతు ప్రేమపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జడ్పి చైర్మన్ రోజా శర్మతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రతి మూడు నెలలకోసారి ఎంసీడీ కిట్లను ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ అందిస్తూ వైద్య సమాచారం తెలుసుకుంటుందన్నారు. దుబ్బాక మండల వ్యాప్తంగా మహిళలకు ఋతు ప్రేమ పై అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి మంత్రి ఆదేశించారు ప్రతి మంగళవారం తిమ్మాపూర్ పిహెచ్ సి లో ఆరోగ్య మహిళ, ఋతు ప్రేమ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జూన్ నెలాఖరు నుంచి గహ లక్ష్మీ పేరుతో మూడు లక్షలు మంజూరు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. పేదవాల్లకు మంచి వైద్యం అందాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త పుష్పాలత, సర్పంచ్ గడీల జనార్దన్ రెడ్డి,తిమ్మాపూర్, రామక్కపేట వైద్య అధికారులు, సిబ్బంది,ఏఎన్‌ఎం,అంగన్వాడీ, ఆశవర్కర్లు, గ్రామ మహిళలు ఉన్నారు
చెత్త సిద్దిపేట పట్టణ ప్రజల సంపద
నవ తెలంగాణ – సిద్దిపేట
తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇచ్చి ప్రజలు స్వచ్ఛతకు అడుగులు వేశారు. చెత్త సిద్దిపేట పట్టణ ప్రజల సంపద, ఆరోగ్య సిద్ధిపేటలో ప్రజల భాగస్వామ్యం ఉన్నదని, అద్వాన్నం నుంచి ఆకుపచ్చ సిద్ధిపేటగా అవతరించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మున్సిపాలిటీ కౌన్సిల్ హాల్ లో బుధవారం సాయంత్రం తడి, పొడి చెత్త, వార్డుల్లో కంపోస్టు తయారీ కేంద్రాలు, డీఆర్సీసీ కేంద్ర పనితీరు, పట్టణ అభివద్ధి పనులపై మున్సిపల్ చైర్మన్ కడవేర్గు మంజుల రాజనర్సు, అడిషనల్ జిల్లా కలెక్టర్ లోకల్ బాడీస్ ముజమ్మీల్ ఖాన్, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, కమిషనర్ సంపత్, పర్యావరణ ప్రేమికురాలు డాక్టర్ శాంతి, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బందితో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆకుపచ్చ, ఆహ్లాదకరమైన సిద్ధిపేట పట్టణం చేద్దామని, ఇందుకు మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది సహకారం అవసరమని, నిధులు ఖర్చు చేయడం కంటే.. సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమని అన్నారు. డంప్ యార్డుకు చెత్త వెళ్లొద్దుని, డంప్ యార్డు రహిత సిద్ధిపేటగా మారి దేశానికే ఆదర్శంగా మారాలన్నదే మన లక్ష్యమని అన్నారు. పట్టణంలో 113 బ్లాక్ స్పాట్లు ఉంటే, ప్రస్తుతం 41 బ్లాక్ స్పాట్లు ఉన్నాయని, అన్నీచోట్ల చోట్ల సీసీ కెమెరాలు బిగించాలని పోలీసు నిఘా విభాగాన్ని ఆదేశించారు. పట్టణ బయట ప్రదేశాలలో చెత్త వేసే వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే 90 శాతం స్వచ్ఛత సిద్ధిపేటగా మారిందని, ఇక మిగిలిన పది శాతం మార్చేందుకు సమన్వయం చేసుకుంటూ , సమిష్టిగా కషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ
నవతెలంగాణ- సిద్ధిపేటరూరల్
పుల్లూరు ప్రజలందరి పండుగ నాభి శిల బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహౌత్సవమని మంత్రి హరీష్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని పుల్లూరు గ్రామంలో నూతన పోచమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట మహౌత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నో దశాబ్దాల కల పుల్లూరు గ్రామంలో బొడ్రాయి, పోచమ్మ దేవాలయం కల నిజమైందన్నారు. గ్రామ ప్రజలందరికీ ఇవాళ పండుగ రోజు అన్నారు. గ్రామాన్ని అనేక రకాలుగా అన్నీ రంగాలలో అభివద్ధి చేసుకున్నామని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యగారంగా తెలంగాణ మారిందన్నారు. గ్రామానికి డబుల్ లేన్ రోడ్డు-బైపాస్ రోడ్డు రావడంతో సరికొత్త అందమొచ్చిందన్నారు. రానున్న వారం రోజుల్లో రూ.2 కోట్ల వ్యయంతో గ్రామ ఎస్సీ కాలనీ నుంచి రామంచ వెళ్లే రహదారికి పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నరేశ్ గౌడ్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఏంపీపీ శ్రీదేవి చందర్, జెడ్పీటీసీ శ్రీహరి గౌడ్, ఎంపిటిసి లతా వెంకట్ , ఉప సర్పంచ్ ప్రసాద్ రెడ్డి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.