– ఆరు నెలల్లో 27 బిలియన్లకు చేరిక
– ఆర్‌బీఐ వద్ద పెరిగిన నిల్వలు
ముంబయి: భారతదేశ బంగారం దిగుమతులు అమాంతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ప్రథమార్థంలో ఏకంగా 21.78 శాతం పెరిగి 27 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.23 లక్షల కోట్లు) విలువ చేసే పసిడి దిగుమతులు చోటు చేసుకున్నాయి. 2023-24లో ఇదే ఆరు నెలల కాలంలో 22.25 బిలియన్ల దిగుమతులు నమోదయ్యాయి. అమాంతం పెరిగిన దిగుమతులు భారత కరెంట్ ఖాతా లోటును మరింత పెంచనున్నాయి. గడిచిన ఆరు నెలల్లో వెండి దిగుమతులు కూడా భారీగానే 376.41 శాతం పెరిగి 2.3 బిలియన్లకు చేరాయి. 2023-24 ఇదే కాలంలో 480.65 మిలియన్ డాలర్ల దిగుమతుల చోటు చేసుకున్నాయి. పండుగల డిమాండ్ పసిడి, వెండి దిగుమతుల పెరుగుదలకు దోహదపడుతుందని పరిశ్రమల నిపుణుడు తెలిపారు.
దేశంలోని మొత్తం పసిడి దిగుమతుల్లో 40 శాతం వాటా స్విట్జర్లాండ్ నుంచి రావడం గమనార్హం. యుఎఇ నుంచి 16 శాతం, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం చొప్పున దిగుమతుల జరిగాయి. ప్రపంచంలో అత్యధిక బంగారం దిగుమతుల్లో చైనా అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో ఉంది. బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో 2024-25 ప్రథమార్థంలో భారత వాణిజ్య లోటు (ఎగమతులు, దిగుమతుల మధ్య వ్యత్యాసం) 137.44 బిలియన్ డాలర్లకు ఎగిసింది. గతేడాది ఇదే సమయంలో 119.24 బిలియన్ల లోటు చోటు చేసుకుంది. 2024 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో అభరణాల ఎగుమతులు 10.89 శాతం తగ్గి 13.91 బిలియన్లుగా నమోదవడంతో.. ఈ రంగం వాణిజ్య లోటు 9.7 బిలియన్లకు పెరిగింది. బడ్జెట్‌లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించడంతో ఈ రంగం దిగుమతులు మరింత పెరిగాయి.
ఆర్‌బీఐ వద్ద 855 మెట్రిక్ టన్నుల పసిడి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వద్ద బంగారం నిల్వలు భారీగా పెరిగాయి. 2024 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషల్ సెటిల్‌మెంట్స్ నుంచి 102 టన్నుల బంగారాన్ని బదిలీ చేసుకుంది. దీంతో ఆర్‌బీఐ బంగారం నిల్వలు 855 మెట్రిక్ టన్నులకు చేరాయని ఆర్‌బీఐ తన నివేదికలో తెలిపింది. ఇందులో స్వదేశంలో 510.5 టన్నులు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్‌మెంట్స్ వద్ద 324 మెట్రిక్ టన్నుల చొప్పున నిల్వ ఉంది. మరో 20.26 టన్నుల బంగారం డిపాజిట్ల రూపంలో తమ వద్ద ఉందని వెల్లడించింది. 2024 మార్చి ముగింపు నాటికి మొత్తం విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా 8.15 శాతంగా ఉండగా.. సెప్టెంబర్ చివరి నాటికి దాదాపు 9.32 శాతానికి పెరిగింది.