హత్య, హత్యాయత్నం నేరాలలో ముద్దాయికి జైలుశిక్షలు

నవతెలంగాణ- కంటేశ్వర్

ఒకరిని హత్య చేసి, మరొకరిపై హత్యాయత్నం చేసిన నేరాలలో ముద్దాయి పెద్దలపల్లె రామయ్య కు జీవిత ఖైదు తో పాటు ఏడేళ్ళ కఠిన జైలుశిక్షలు విధిస్తు నిజామాబాద్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల గురువారం తీర్పు వెలువరించారు. తీర్పులోని వివరాలు. ఆంద్రప్రదేశ్ కడప జిల్లా వాస్తవ్యులైన కొందరు బతుకుతెరువు కోసం నిజామాబాద్ జిల్లా ముప్కాల్ లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని మేస్త్రీ,కూలి పని చేసుకుని జీవించేవారు. 02 ఆగస్టు, 2021న రాత్రి అందరు కలిసి మద్యం సేవించి పడుకున్నారు. కూతురు ఓబులేశు, అతని తమ్ముడు కూతురు రామయ్య మరికొందరు ఒక రూములో, పొలయ్య మరొకతను మరొక రూములో పడుకున్నారు.రాత్రి పదకొండు గంటల సమయంలో నిద్రలేచిన పెద్దలపల్లె రామయ్య సెల్ ఫోన్ కనిపించడం లేదని ఓబులేశు తో గొడవ పెట్టుకున్నాడు.రాత్రి అయింది పొద్దున మాట్లాడుకుందాం అని సర్దిచెప్పాడు. 03 ఆగస్టు తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో మల్లి గొడవపెట్టుకుని సుత్తెతో కూతురు రామయ్య ముఖంపై కొట్టి తీవ్రంగా గాయపర్చాడు, అడ్డుకోబోయిన ఓబులేశు ను కూడా తీవ్రంగా గాయపరచి హత్యాయత్నం చేశాడు.తీవ్రంగా గాయపడిన కూతురు రామయ్య అక్కడికక్కడే చనిపోయాడు. సెషన్స్ కోర్టు నేర న్యాయ విచారణ అనంతరం హత్య, హత్యాయత్నం నేరారోపణలు రుజువు అయినట్లు నిర్ధారిస్తు పెద్దలపల్లె రామయ్య కు హత్య నేరం ప్రకారం జీవిత కారాగార శిక్ష, ఓబులేశు పై హత్యాయత్నం చేసినందుకుగాను ఏడు సంవత్సరాల జైలుశిక్ష ఖరారు చేశారు.