అక్రమాలకు తావులేకుండా ఎరువుల సరఫరా

– ఈపీఓఎస్‌ ద్వారా అమ్మకాలు
– వోనాకాలంపై మంత్రి తుమ్మల సమీక్ష
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అక్రమాలకు తావులేకుండా ఎరువులను సరఫరా చేయాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈపీఓఎస్‌ ద్వారానే అమ్మకాలు జరిగేటట్టు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించి అమ్మకాలు చేసినట్లైతే సదరు డీలర్లు, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో వానాకాలం సీజన్‌లో ఎరువుల సరఫరా, సాగు విస్తీర్ణం తదితరాంశాలపై చర్చించారు.
విధిగా తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు విక్రయాలను పరిశీలించాలని సూచించారు. ఆగస్టు నెలకు సరిపడిన ఎరువులను వీలైనంత త్వరతగా వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాయాలని కోరారు.10.4 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా, 2.4 లక్షల టన్నుల డీఏపీ, 10లక్షల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 0.60 లక్షల ఎమ్‌వోపీ కేంద్రం నుంచి కేటాయించాలని కోరారు.