డ్యూటీ మీట్‌లతో పోలీసుల వృత్తి, నైపుణ్యాల్లో మెరుగుదల

– పోలీసు అకాడమీలో రాష్ట్రస్థాయి పోలీస్‌ డ్యూటీమీట్‌ ప్రారంభోత్సవంలో డీజీపీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
పోలీసుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలను మరింతగా ఇమిడింప జేయడానికి పోలీస్‌ డ్యూటీ మీట్‌లు ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర డీజీపీ జితేందర్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌ సాగర్‌లో గల ఆర్‌బీవీర్‌ పోలీసు అకాడమీలో రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్‌ను డీజీపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నేరపరిశోధన, ట్రాఫిక్‌ నియంత్రణలో అనుదినం క్షణం తీరిక లేకుండా గడిపే పోలీసులకు డ్యూటీ మీట్‌లు కొంత తేలికనిస్తాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రస్థాయి డ్యూటీమీట్‌ జరుగుతున్నదని తెలిపారు. ఈ డ్యూటీ మీట్‌లో రాష్ట్రంలోని 26 పోలీసు విభాగాలకు చెందిన 16 బృందాలు పాల్గొంటున్నాయని, మొత్తం 400 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఇందులో తమ ప్రావీణ్యాన్ని నిరూపించుకోనున్నారని తెలిపారు. ఈ డ్యూటీ మీట్‌లో విజయం సాధించిన వారిని వచ్చే ఏడాది 2025 జనవరిలో జరిగే ఆలిండియా పోలీస్‌ డ్యూటీ మీట్‌కు ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్ర పోలీసులు గతంలో జాతీయ స్థాయిలో జరిగిన డ్యూటీ మీట్‌లలో అనేక బహుమతులను గెలుపొందారని చెప్పారు. ఈ ఒరవడిని ఇకముందు కూడా కొనసాగించాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన శిక్షణను ఇస్తామని చెప్పారు. డ్యూటీ మీట్‌ ఇన్‌చార్జి, రాష్ట్ర సీఐడీ డీజీపీ శిఖాగోయల్‌ మాట్లాడుతూ.. 1956లో పోలీస్‌ డ్యూటీ మీట్‌ను ప్రారంభించారని తెలిపారు. శాంతిభద్రతలు, నేరపరిశోధన, సైంటిఫిక్‌ ఎవిడెన్స్‌ విభాగాల్లో వివిధ అంశాలపై నాలుగు రోజుల పాటు పోటీలను నిర్వహించడం ద్వారా పోలీసుల్లో వృతిపరమైన పరిణితి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ పోలీసు అధికారులు మహేశ్‌భగవత్‌, శశిధర్‌రెడ్డి, అవినాశ్‌ మహంతి, సుధీర్‌బాబు, సత్యనారాయణ, చంద్రశేఖర్‌ రెడ్డి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.