ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమాలు ‘వ్యూహం’, ‘శపథం’. ఈ సినిమాలను రామదూత క్రియేషన్స్ బ్యానర్‌లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీస్‌లో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనుంది. సెన్సార్ అడ్డంకులు దాటుకున్న ‘వ్యూహం’ ఈ నెల 23న, ‘శపథం’ మార్చి 1న థియేటర్స్‌లోకి రాబోతున్నాయి. ఈ సినిమాల ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, ‘ఈ సినిమాల రిలీజ్ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పాల్సిన ఒకే ఒక వ్యక్తి నారా లోకేష్. నేను, దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాలను డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని అనుకున్నాం. లోకేష్ కోర్టుకు వెళ్లి మా సినిమా రిలీజ్‌ను అడ్డుకున్నారు. ఇప్పుడు సరిగ్గా ఎలక్షన్స్‌కు ముందు మా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా పరోక్షంగా హెల్ప్ చేసింది ఆయనే. ప్రజా జీవితంలో ఉన్న కొందరి మీద మనకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. అలా నాకు ఉన్న అభిప్రాయాలతో, వాస్తవ ఘటనల నేపథ్యంగా నేను వ్యక్తీకరించిన సినిమాలే ఇవి. వైఎస్ మతి నుంచి వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేవరకు వ్యూహం కథ ఉంటుంది. జగన్ సీఎం ప్రమాణ స్వీకారం నుంచి చంద్రబాబు జైలుకు వెళ్లేవరకు శపథం కథ చూపిస్తున్నాం. నేను ఈ సినిమాను జగన్ కోసం కాదు పవన్, చంద్రబాబు కోసం తీశాను’ అని తెలిపారు.
‘ఈ రెండు సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నాం. ఆ టైమ్‌లో పెద్ద సినిమాల రిలీజ్ లేవు. రెండు సినిమాలు గ్యారెంటీగా సక్సెస్ అవుతాయి. ఈ రెండు సినిమాలు మొదలుపెట్టినప్పుడే రిలీజ్‌కు అడ్డంకులు వస్తాయని తెలుసు. తెలిసే ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాం. మా సినిమాలను ఆపడం కోసం నారా లోకేష్ విశ్వప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి న్యాయమే గెలిచింది. భావ ప్రకటన స్వేచ్ఛకు గౌరవం ఇస్తూ కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉంది’ అని నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చెప్పారు.