– జి20 స్పీకర్ల సదస్సు ముగింపులో ఓం బిర్లా
న్యూఢిల్లీ : పరస్పర ఆధారిత ప్రపంచంలో ఏ సమస్యను, అంశాన్నీ వేరు చేసి చూడలేమని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఇక్కడ జరుగుతున్న జి20 పార్లమెంటరీ స్పీకర్ల సదస్సులో ఆయన శనివారం మాట్లాడారు. పశ్చిమాసియా ఘర్షణలు, ఇతర భౌగోళిక, రాజకీయ అంశాలను నేతలు ఈ సదస్సులో చర్చించారు. రెండు రోజుల పాటు జరిగిన చర్చలు శనివారంతో ముగిశాయి. చర్చల కోసం నిర్దేశించిన ఎజెండాను వీడి అనేక మంది సభ్యులు ప్రస్తుతం తలెత్తిన అంతర్జాతీయ పరిణామాలను చర్చించారు. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న పలు సవాళ్ళను, ఆర్థికపరమైన అంశాలను వారు సుదీర్ఘంగా చర్చించారు. ‘చాలామంది పశ్చిమాసియా ఘర్షణల గురించే మాట్లాడారు. కాగా కొంతమంది బహుళ వాదాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని, సరఫరా మార్గాలను బలోపేతం చేయాల్సిన ఆవశక్యతను వారు చర్చించారు’ అని ఓం బిర్లా తన ముగింపు ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ ప్రస్తావనలన్నింటినీ అత్యంత జాగ్రత్తగా పరిశీలించాను. నేడు పరస్పరాధారిత ప్రపంచంలో, మనం ఏ ఒక్క అంశాన్ని విడిగా, దేనికదే చూడలేం.’ అని బిర్లా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ శాంతిని పెంపొందించేలా పార్లమెంటరీ దౌత్య పంథాను అనుసరించడం గురించి సదస్సులో ఆమోదించిన సంయుక్త ప్రకటనలో పేర్కొన్నట్లు స్పీకర్ తెలిపారు. సంఘర్షణలు, వివాదాల శాంతియుత పరిష్కారానికి తోడ్పాటునందించాలన్నారు. ఈ సంయుక్త ప్రకటన ఆమోదంతో జి-20 పార్లమెంటరీ స్పీకర్ల ప్రక్రియ మరింత బలోపేతమైందని బిర్లా పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, హరిత ఇంధనం, మహిళల నేతృత్వంలో అభివృద్ధి, డిజిటల్ ప్రభుత్వ మౌలిక సదుపాయాలపై మీ విలువైన ఆలోచనలు, సమాచారం మానవ సంక్షేమానికి హామీ కల్పించే జి-20 యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడగలవని ఆశిస్తున్నట్లు చెప్పారు.