ఎప్‌సెట్‌ బైపీసీ కౌన్సెలింగ్‌లో

– ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపునకు నేడే ఆఖరు
– 25 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి బీ ఫార్మసీ, ఫార్మా-డీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్‌ ఇంజినీరింగ్‌, ఫార్మాసూటికల్‌ సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎప్‌సెట్‌ బైపీసీ విద్యార్థులకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు గడువు మంగళవారంతో ముగియనుంది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఎప్‌సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 23 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని తెలిపారు. అదేనెల 25 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశముంటుందని వివరించారు. ఇప్పటి వరకు 15,510 మంది ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించారని పేర్కొన్నారు. 202 మంది అభ్యర్థులు 9,376 వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారని వివరించారు. ఈనెల 28న తొలివిడత కౌన్సెలింగ్‌లో అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని తెలిపారు.