కేసుల దర్యాప్తుల్లో

– న్యాయపరమైన చిక్కులపై దృష్టి పెట్టండి
– డీఎస్పీలు, అదనపు ఎస్పీలకు న్యాయ నిపుణుల సూచనలు
– డీజీపీ కార్యాలయం నుంచి అధికారులకు ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
క్లిష్టమైన కేసుల దర్యాప్తుల్లో న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా తగిన శ్రద్ధ వహించాలని పోలీసు అధికారులకు న్యాయ నిపుణులు సూచించారు. డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులకు మంగళవారం డీజీపీ కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌లో పోలీసు లీగల్‌సెల్‌ విభాగానికి చెందిన న్యాయ నిపుణులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌, రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజరు కుమార్‌ జైన్‌, సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌, డీజీపీ, ఉన్నతాధికారులకు న్యాయ సలహాదారుడైన ప్రముఖ న్యాయవాది రాములుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయ నిపుణులు మాట్లాడుతూ.. కేసు నమోదు చేయటంలో వహిస్తున్న శ్రద్ధ తదుపరి దర్యాప్తుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై లోపిస్తున్నదనీ, కొందరు దర్యాప్తు అధికారుల్లో ఉన్న నిర్లక్ష్యం కూడా దీనికి కారణమవుతున్నదని వారు అన్నారు. నేరాలు చేసిన వారికి కోర్టులలో శిక్షలు పడితేనే నిందితులలో భయాన్ని పాదుగొలపగలమనీ, అదే సమయంలో బాధితులకు న్యాయం కూడా జరుగుతుందని డీజీపీ అంజనీకుమార్‌ తెలిపారు. కేసులు కోర్టులలో వీగిపోకుండా ఉండాలంటే దర్యాప్తు ప్రారంభం నుంచి ఆ కేసుకు సంబంధించిన న్యాయ నిపుణులతో తగిన సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగితేనే చక్కటి ఫలితాలు లభిస్తాయని ఆయన అన్నారు. నేరాలకు పాల్పడ్డ నిందితులు ఆ కేసు నుంచి తప్పించుకోవటానికి చట్టపరమైన లొసుగులను ఎప్పుడూ అన్వేషిస్తూనే ఉంటారనీ, వారికి ఆ అవకాశాన్ని ఇవ్వకుండా శాస్త్ర, సాంకేతిక పరంగా తగిన ఆధారాలను సేకరించాల్సినవసరం ఉన్నదనీ, అప్పుడే నేరస్థుల జిత్తులు పారకుండా ఉంటాయని పోలీసు లీగల్‌ సెల్‌ విభాగానికి చెందిన అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కొన్ని క్లిష్టమైన కేసులకు సంబంధించి వివిధ ప్రాంతాలకు చెందిన డీఎస్పీలు, అదనపు ఎస్పీలు అడిగిన పలు ప్రశ్నలకు న్యాయ నిపుణులు సమాధానాలిచ్చారు.