నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం కోసం అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకునే గడువును పొడిగిస్తున్నట్లు ఆవిష్కర్తలు తమ ఎంట్రీలను సమర్పించడానికి ఆగస్టు 10, 2024 వరకు ఆఖరి తేదీని పొడిగించినట్లు డీపీఆర్ఓ తెలిపారు. ఈ ఏడాది 6 వ ఎడిషన్ తో ముందుకు వచ్చిన ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం గ్రామీణ తెలంగాణాలో ఆవిష్కరణ, వ్యవస్థాపకతను పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక సవాళ్లకు పరిష్కారాలను తీసుకువచ్చే ఉద్దేశంతో, తమ ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలు తయారు చేసిన ప్రజలను రాష్ట్ర ప్రజలకు పరిచయం చేస్తూ, ఆ ఆవిష్కరణలను ఆగస్టు 15 న ప్రదర్శించే అవకాశాన్ని అందిస్తుంది. గ్రామీణ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క ఆవిష్కర్తను ఇంటింటా ఇన్నోవేటర్ కు దరఖాస్తు చేసుకోవలసిందిగా కోరడం జరిగింది. తమ అద్భుతమైన ఆలోచనలతో, స్థానిక సమస్యలకు ఆవిష్కరణలు తయారు చేసి ఆ సమస్యకు అడ్డుకట్ట వేసిన ప్రతి ఒక్క ఆవిష్కర్తను దరఖాస్తు చేసుకునేందుకు ఆహ్వానిస్తున్నాము. సవాళ్లను పరిష్కరించే అత్యంత ఆశాజనకమైన పరిష్కారాలు ఆగస్టు 15, 2024న అవార్డులతో గుర్తించబడతాయి. ఈ సంవత్సరం మరిన్ని ఔత్సాహిక ఆవిష్కర్తలకు సమగ్ర మద్దతు అందించేందుకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ సిద్ధంగా ఉందనారు. ఈ సంవత్సరం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ఎన్నడూ లేని విధంగా విస్తృతమైన గ్రామీణ ఆవిష్కరణలపై దృష్టి సారించడమే కాకుండా మొత్తం 33 జిల్లాల్లోని 3 వేలకు పైగా గ్రామ పంచాయతీలకు, 550 మందికి పైగా ప్రభుత్వ అధికారులకు ఆవిష్కరణ సంస్కృతిపై అవగాహన కల్పించారు.
ఇంటింటా ఇన్నోవేటర్ కోసం దరఖాస్తు ప్రక్రియ చాలా సూలువుగా ఉంటుంది. ఆవిష్కర్తలు వాట్సప్ ద్వారా 9100678543 కు దరఖాస్తులను సమర్పించవచ్చు. పేరు, వయస్సు, ఫోటో, వృత్తి, గ్రామం, మండలం, ఆవిష్కరణ పేరు, ఆవిష్కరణ గురించి 100 పదాల వివరణ, నాలుగు అధిక -రిజల్యూషన్ చిత్రాలు మరియు రెండు వీడియోలు (2 నిమిషాలలోపు) పంపించగలరనీ కోరారు.