– రామమందిరంతో బీజేపీ
– నిరుద్యోగం, ధరల పెరుగుదలతో కాంగ్రెస్
జె.జగదీష్, నవతెలంగాణ
దేశంలో హిందీ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ ఒకటి. ఈ రాష్ట్రంలో 29 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో పది ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు కాగా, 19 స్థానాలు జనరల్ కేటగిరి స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలో మొదటి నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో తొలి విడతలో ఆరు స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 88 మంది బరిలో ఉన్నారు. ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. రెండో విడతలో ఏడు స్థానాలకు ఏప్రిల్ 26న పోలింగ్ జరుగనుంది. మూడో విడతలో ఎనిమిది స్థానాలకు మే 7న, నాలుగో విడతలో ఎనిమిది స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుంది.
ఎన్నికలకు సిద్ధమైన కాంగ్రెస్
2018 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలిచిన కాంగ్రెస్, చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఆరు నెలల అనతికాలంలోనే జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా డీలా పడింది. 29 స్థానాల్లో కేవలం ఒక స్థానాన్నే గెలుచుకుంది. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత జ్వోతిరాథిత్య సింధియా 2020 మార్చిలోనే 21 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. దీంతో కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనమైంది. వెంటనే సింధియా బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌లో సంక్షోభం నెలకొంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది.
సింధియాకు రాజ్యసభ ఎంపీ ఇచ్చి కేంద్ర మంత్రిని చేశారు. అలాగే రాష్ట్రంలో సింధియా వర్గం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చారు. అయితే ఇటీవల 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత కాంగ్రెస్‌లో స్తబ్దత నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ బీజేపీలో చేరుతారనే చర్చతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందో ఎవరికి తెలియని పరిస్థితి నెలకొంది. అయితే చివరికి ఆయన వెనక్కి తగ్గడంతో కథ సుఖాంతమైంది. ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా కోలుకుని ఎన్నికల యుద్ధానికి సిద్ధమైంది.
బీజేపీలో అంసతృప్తి రాగాలు
బీజేపీలో అసంతృప్తి రాగాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. పార్టీ నేతలు, ఎంపీలు తీవ్రంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లింది. అయితే ఎన్నికల్లో గెలిచిన తరువాత ఆయనను పక్కపెట్టి, మోహన్ యాదవ్‌ను ముఖ్యమంత్రి చేశారు. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన మాత్రం రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని, జాతీయ రాజకీయాలకు వెళ్లనని ప్రకటించారు. అయితే బీజేపీ మాత్రం ఆయనకు ఎంపీ టిక్కెట్టు ఇచ్చి రాష్ట్రంలో లేకుండా చేస్తుంది.
అలాగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భోపాల్ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్‌కి ఆ పార్టీ టిక్కెట్టు నిరాకరించింది. దీంతో ఆమె అసంతృప్తిని వెల్లగక్కింది. కెపి యాదవ్ (గుణ), రాజ్‌బహదూర్ సింగ్ (సాగర్), జెఎస్ దామోర్ (రత్లాం), రమాకాంత్ భార్గవ (విదిషా), వివేక్ షెజ్వాల్కర్ (గ్వాలియర్)లకు కూడా బీజేపీ టిక్కెట్లు ఇవ్వలేదు. వీరంతా బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎవరెన్ని స్థానాల్లో పోటీ ?
గత ఎన్నికల్లో బీజేపీ 28 స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్ ఒక్క స్థానానికే పరిమితమైంది. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ 29 స్థానాల్లో పోటీ చేయగా, ఇండియా ఫోరంలో భాగంగా కాంగ్రెస్ 28, ఎస్పీ ఒక స్థానంలో పోటీ చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లో ఓబీసీలు 50 శాతం, ఎస్టీలు 20 శాతం, ఎస్సీలు 15 శాతం, అగ్రవర్ణాలు 15 శాతం ఉన్నారు. ముస్లీంలు 7 శాతం ఉన్నారు.
నిరుద్యోగ సమస్య
బీజేపీ రామమందిరం అంశాన్ని నమ్ముకుంది. కాంగ్రెస్ నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలపై ఫోకస్ పెట్టి ప్రచారం చేస్తుంది. యువత అసహనంతో ఉన్నారు. దీన్ని సానుకూలంగా మార్చుకునేందుకు ఇండియా ఫోరం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఉద్యోగ నియామకం, సాయుధ దళాల్లో కాంట్రాక్టీకరణ పథకం అగ్నిపథ్ రద్దు వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా కాంగ్రెస్ ఉపయోగిస్తోంది. అలాగే కుల గణనను కూడా ప్రతిపక్షం డిమాండ్ చేస్తుంది.
భార్యాభర్తలే ప్రత్యర్థులు
భార్య కాంగ్రెస్ తరపున, భర్త బీఎస్పీ తరపున పోటీ చేస్తున్నారు. కంకర్ ముంజారే, అనుభా ముంజరే భార్యాభర్తలు. భార్య అనుభ గతేడాది నవంబర్‌లో మధ్యప్రదేశ్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి బీజేపీి అభ్యర్థి గౌరీశంకర్ బైసన్‌పై విజయం సాధించారు. అనుభ భర్త కంకర్? ముంజారే ఓ మాజీ ఎమ్మెల్యే, ఎంపీ కూడా. ప్రస్తుతం ఈయన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీలో)లో ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కంకర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలింగ్‌కు కొన్నిరోజుల ముందే ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు ముగిసేవరకు ఒకే ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఇంటిని వీడి బయటకొచ్చేశారు. ప్రస్తుతం ఆయన జిల్లాలోని ఓ డ్యామ్ సమీపంలో పూరిగుడిసెను ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. ఇక్కడి నుంచే తన ప్రచార కార్యక్రమాలను చక్కబెడుతున్నారు. ఇక ఏప్రిల్ 19న పోలింగ్ ముగిసిన రోజే మళ్లీ తిరిగి ఇంటికెళ్తానని ఆయన చెబుతున్నారు. భర్త కంకర్ ముంజరే నిర్ణయం పట్ల ఎమ్మెల్యే అనుభ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తనకు నచ్చలేదన్నారు. 33 ఏండ్లుగా తాము సంతోషంగా వైవాహిక జీవితం గడుపుతూ వచ్చామని చెప్పారు.