– నల్ల బెలూన్లతో ఆందోళన
నవతెలంగాణ-హైదరాబాద్
తెలుగుదేశం అధినేత చంద్రబాబను అరెస్టు చేసినప్పుడు నిరసన తెలియజేయడం మా హక్కు అని, ఆ హక్కుని కాలరాయవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు అన్నారు. బెంగుళూరు లాంటి మహా నగల్లోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తే అక్కడి పోలీసులు అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో మాత్రం నిరసనను అణచివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ పిలుపు మేరకు శనివారం ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలిపారు. ఏపీ సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జాతీయ క్రమ శిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చంద్రబాబును ఏ తప్పు చేయకుండా అక్రమంగా అరెస్టు చేసి జైలుకు తరలించడాన్ని ప్రజలందరూ నిరసిస్తునారని గుర్తు చేశారు. ప్రజానాయకుడైన చంద్రబాబు కి జైలులో సరైన సౌకర్యాలు ఇవ్వకుండా, దోమల మధ్యలో ఉంచడాన్ని తీవ్రంగా ఖండించారు. జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుని అరెస్టు చేస్తే అవినీతి బయటకు వస్తుందని జగన్ అనుకున్నాడనీ, .కానీ ఆయన చేసిన అభివద్ధి బయటకు వచ్చిందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు అజ్మీరా రాజునాయక్,గడ్డి పద్మావతి, జక్కిలి ఐలయ్య యాదవ్, జీవీజీ నాయుడు, అనుబంధ సంఘాల అధ్యక్షులు షకీలారెడ్డి, శ్రీపతి సతీష్, పోలంపల్లి అశోక్, హరికష్ణ తదితరులు ప్రసంగించారు.