– 25న రాష్ట్ర వ్యాపిత ఆందోళనలు
– సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల పిలుపు
– ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మణిపూర్‌లో జరిగిన సంఘటనలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే.వెంకటేష్, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్‌శోభన్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొప్పనిపద్మ, సీఐటీయూ నాయకులు వై.సోమన్నతో కలిసి వారు మాట్లాడారు. మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలను వివస్త్రలను చేసి, ఊరేగించడం దారుణ మన్నారు. పైగా వారిలో ఒక మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆమెను కాపాడేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులిద్దరిని హత్య చేశారని అన్నారు.
సంఘటన జరిగిన రెండు వారాల్లోపే బాధిత కుటుంబాలు అత్యంత ధైర్యసాహసాలతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పటికీ పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడిన నేరస్తులకు రక్షణ కల్పించడానికి మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యక్షంగా సాయపడుతోందని అన్నారు. 90 రోజులుగా రాష్ట్రం మండుతున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభు త్వాన్ని కేంద్రం, బీజేపీ అగ్ర నాయకత్వం సమర్ధిస్తూ వస్తోందని అన్నారు. నెలల తరబడి మౌనం పాటిస్తూ వచ్చిన ప్రధాని చిట్టచివరకు చేసిన ప్రకటన, జరిగిన సంఘటనను, మణిపూర్‌లో సుదీర్ఘంగా చెలరేగుతున్న హింసాకాండను ముఖ్యమంత్రి పక్షపాత పాత్రను చాలా చిన్నది చేసేలా ఉందని అన్నారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం జవాబుదారీతనం ఇదేనా? అని ప్రశ్నించారు. మణిపూర్ లో శాంతిని నెలకొల్పాల్సిన ప్రధాని మోడీ సానుభూతి చూపించడానికి నాటకాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు చర్చకు పెడితే సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారని విమర్శించారు.పైగా ఆ రాష్ట్ర సీఎం మాత్రం ఇతర రాష్రాల్లో ఇలాంటి ఘటనలు జరగలేదా? అనడం శోచ నీయమన్నారు. మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి మరణాహోమానికి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ శక్తులే కారణమని అన్నారు. దీనికి నిరసనగానే 25న రాష్ట్ర వ్యాప్తం గా జరిగే నిరసన కార్యక్రమంలో కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.