– ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్
– వ్యాపార అవకాశాలు పొందనున్న 4,200 మంది ప్రత్యక్ష లబ్దిదారులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
దక్షిణ మధ్య రైల్వేలో 109 స్టేషన్లలో ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్ ద్వారా స్థానిక ఉత్పత్తులను ప్రచారం చేయనుంది. తెలంగాణలోని 41 స్టాళ్ల ద్వారా 1,435, ఆంధ్రప్రదేశ్‌లోని 56 స్టాళ్ల ద్వారా 1,960, మహారాష్ట్రలోని 20 స్టాల్స్ నుంచి 700, కర్నాటకలోని మూడు స్టాల్స్ నుంచి 105 మంది వెరసి 120 మంది ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్ ద్వారా దాదాపు 4,200 మంది ప్రత్యక్ష లబ్దిదారులు వ్యాపార అవకాశాలను పొందారు. భారతీయ రైల్వే మంత్రిత్వశాఖ సమాజంలోని అల్పాదాయ వర్గాలకు అదనపు ఆదాయ అవకాశాలను కల్పించడానికి స్థానిక/స్వదేశీ ఉత్పత్తులకు మార్కెట్‌ను అందించడం, వాటిని ప్రోత్సహించడానికి నూతన చొరవతో ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’అనే పథకాన్ని ప్రారంభించింది. 2022-23 కేంద్ర బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించినప్పటి నుంచి ప్రజాదరణ పొందింది. దక్షిణ మధ్య రైల్వే అంతటా మొదట ఆరు రైల్వే స్టేషన్లలో ప్రారంభించబడింది. స్థానిక ప్రజల నుంచి అపారమైన స్పందన రావడం వల్ల ఇప్పుడు, 109 రైల్వే స్టేషన్లలో 120 స్టాళ్లతో ‘ఒక స్టేషన్ ఒక ఉత్పత్తి’ స్టాల్స్ నిర్వహించబడుతున్నాయి.
తెలంగాణలో సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, వరంగల్, నిజామాబాద్, గద్వాల్ మొదలైన 33 రైల్వే స్టేషన్లలో, ఒక స్టేషన్ ఒక ఉత్పత్తితో కూడిన 41 స్టాళ్లు ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక చేతివృత్తుల వారి జీవనోపాధి, సంక్షేమానికి పెద్ద ప్రోత్సాహాన్ని కలుగజేస్తున్నాయి. ఇందులో కొన్ని ఉత్పత్తులలో సాంప్రదాయ నారాయణపేట, గద్వాల్, పోచం పల్లి చీరలు వంటి స్థానిక నేత కార్మికులు చేనేత వస్త్రాలు ఉన్నాయి. మిల్లెట్ ఆధారిత ఆహార ఉత్పత్తులు, టెస్కో చేనేత, భద్రాచలం వెదురు ఉత్పత్తులు, ఆలయ దేవతా విగ్రహాలు, అటవీ సేకరణలు చేతిపనుల బొమ్మలు, నిర్మల్ బొమ్మలు, స్థానిక రుచికరమైన వంటకాలు మొదలైనవి లభిస్తున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్థానిక నైపుణ్యం, హస్తకళలో నిమగమైన స్థానిక యువతకు రైల్వే అందించిన ఈ అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. స్థానిక కళలు, సంస్కృతిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఇది ఒక ప్రత్యేకమైన అవకాశమనీ, తద్వారా ప్రయాణీకులకు చుట్టుపక్కల ప్రదేశాలకు సేవలను అందించే అవకాశాన్ని కలుగజేస్తున్నదని తెలిపారు.