తెలంగాణలో ఈసారి బీజేపీ ఖాతా కూడా తీయదు

– రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హౌదా ఖాయం
– జహీరాబాద్‌లో సమస్యల పరిష్కార బాధ్యత నాదే
– ఈసారి అవకాశం ఇస్తే సంగమేశ్వర ప్రాజెక్టు
– నీటిని సాగుకు అందిస్తాం: మంత్రి హరీష్‌ రావు
నవతెలంగాణ-జహీరాబాద్‌
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీి ఈసారి ఖాతా కూడా తీయదని మంత్రి హరీష్‌ రావు అన్నారు. శనివారం జహీరాబాద్‌ పట్టణంలోని భాగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నడ్డా వచ్చి రాష్ట్రంలో హంగు ఏర్పడుతుందని పలకడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో మతకల్లోహాలు దాడులు దౌర్జన్యాలు జరుగుతున్నాయని, అలాంటివారు తెలంగాణ రాష్ట్రంపై కన్ను వేయడం దురదష్టకరమన్నారు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్‌ వారే పాలించారు. నాడు చేయలేనటువంటి నాయకులు నేడు ఏదో చేస్తామని ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎవరైనా కాంగ్రెస్‌ వారు మీ వద్దకు వచ్చి మేము ఇది చేస్తామని ప్రగల్బాలు పలికితే వారిని ట్రూసర్లో కూర్చోబెట్టుకొని పక్కనే ఉన్న బీదర్‌లోకి తీసుకువెళ్లి అక్కడ విద్యుత్‌ సరఫరా ఉందా తాగునీరు సరఫరా అవుతుందా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్‌ పథకాలు అమలు అవుతున్నాయా పోయి విచారించాలని విజ్ఞప్తి చేయాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 88 సీట్లు గెలిచిన తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలవడం ఖాయమన్నారు. తెలంగాణ గడ్డ కేసీఆర్‌ అడ్డగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్‌ పాలనలో ఉన్నటువంటి కర్ణాటకలో రూ.600 పెన్షన్‌ ఇస్తున్న వారు ఇక్కడ వేలకు వేలు ఎలా ఇస్తారో ఒకసారి తెలపాలన్నారు. తాండాలన్నింటిని గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసిఆర్‌ కే దక్కుతుందని అన్నారు. జహీరాబాద్‌ నియోజకవర్గం అభివద్ధి తమ బాధ్యత అని, సమస్యలన్నింటికీ పరిష్కరించేందుకు అన్ని విధాల కషి చేస్తానన్నారు. వచ్చేది కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, అందులో కూడా తాను మంత్రిగా ఉంటానన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం జహీరాబాద్‌ నియోజకవర్గంలోని మోతీ మాత మందిరానికి కోటి రూపాయలతో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. గతంలో గీతారెడ్డి ఏనాడు గిరిజనులకు కానీ మైనార్టీలకు కానీ ఇతర వర్గాలకు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. కనీసం తాగునీటిని కూడా సక్రమంగా సరఫరా చేయలేని దౌర్భాగ్య స్థితి మంత్రి గీతారెడ్డిదని విమర్శించారు. గత సంవత్సరాలలో జహీరాబాద్‌ నియోజకవర్గంలో జరిగిన అభివద్ధికి గతంలో జరిగిన అభివద్ధికి బేరీజు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వీర శైవ లింగాయత్‌ల విజ్ఞప్తి మేరకు కోటి రూపాయలు ఖర్చు చేసి జహీరాబాద్‌లో బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో మైనారిటీల సంక్షేమం కోసం కనీసం ఒక్క రెసిడెన్షియల్‌ హాస్టల్‌ ను కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. టి ఎస్‌ ఐ డి సి చైర్మన్‌ మహమ్మద్‌ తన్వీర్‌ విజ్ఞప్తి మేరకు మైనారిటీలకు ఐదెకరాల స్మశాన వాటిక కోసం స్థలం, ఈద్గా ప్రహరీ గోడ చుట్టూ షట్టర్ల నిర్మాణానికి కావాల్సినన్ని నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తక్షణమే ప్రతిపాదనలు పంపించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. జహీరాబాద్‌ నియోజకవర్గం లో 175 కోట్లతో చేపట్టినటువంటి వివిధ అభివద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడం జరిగిందన్నారు. చరిత్రలో నిలిచే విధంగా 666 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో జహీరాబాద్‌లో కూడా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే అభివద్ధికి మీరు కూడా సహకరించిన వారవుతారని విజ్ఞప్తి చేశారు. శాసనసభ్యులు మాణిక్యరావు అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎల్లవేళలా కషి చేస్తారన్నారు. వారికి అవకాశం పార్టీ కల్పించింది కనుక భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టి ఎస్‌ ఐ డి సి చైర్మన్‌ మహమ్మద్‌ తన్వీర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ వై నరోత్తం, ఎమ్మెల్యే మాణిక్‌ రావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్రేవరీస్‌ మాజీ చైర్మన్‌ దేవి ప్రసాద్‌, కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ ,జడ్పీ చైర్మన్‌ మంజు శ్రీరెడ్డి ,జాయింట్‌ కలెక్టర్‌ రాధాబాయి, ఆర్డిఓ వెంక రెడ్డి ,డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, నాయకులు మహంకాళి శుభాష్‌ గుప్తా ,బాబి, వైద్యనాథ్‌ ,షేక్‌ ఫరీద్‌, శ్రీకాంత్‌ రెడ్డి లతోపాటు నియోజకవర్గంలోని పార్టీ అధ్యక్ష కార్యదర్శులు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పిటిసిలు పాల్గొన్నారు.