అమెరికా నేపథ్యంలో..

అమెరికా నేపథ్యంలో..ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారం భించింది. అశోక్‌ గల్లా కథానాయకుడిగా ప్రొడక్షన్‌ నెం.27 చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. సినీ ప్రముఖల సమక్షంలో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. నమ్రత ఘట్టమనేని ఫస్ట్‌ క్లాప్‌ ఇవ్వగా, పద్మ గల్లా, మంజుల స్వరూప్‌ తమ చేతుల మీదుగా స్క్రిప్ట్‌ని చిత్ర బృందానికి అందజేసి, సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రొమాంటిక్‌ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో అశోక్‌ గల్లాతో పాటు ‘మ్యాడ్‌’ ఫేమ్‌ శ్రీ గౌరీ ప్రియ, ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ ఫేమ్‌ రాహుల్‌ విజరు, శివాత్మిక ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అమెరికా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు ఉద్భవ్‌ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్‌ నెలాఖరు నుంచి చిత్ర బృందం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించనుంది. ఈ చిత్రంలో కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు, హృదయాన్ని హత్తుకునే డ్రామా ఉంటుందని, ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని నిర్మాతలు తెలిపారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు: భరద్వాజ్‌ ఆర్‌, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య.