ఆస్కార్‌ కోసం రంగంలోకి..

For the Oscars Into the field‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాట ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుని కైవసం చేసుకుని తెలుగు సినిమా సత్తాని ప్రపంచవ్యాప్తంగా చాటింది. దీంతో ఈ ఏడాది ఏ తెలుగు సినిమా ఆస్కార్‌ బరిలోకి వెళ్తుందనే అమితాసక్తి అందరిలోనూ ఉంది. 96వ అకాడమీ అవార్డుల్లో (ఆస్కార్‌ -2024) ఉత్తమ విదేశీ చిత్ర విభాగం కోసం ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ గిరీష్‌ కాసరవల్లి అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్‌ కమిటీ చెన్నై వేదికగా ఆస్కార్‌ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను వీక్షిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అన్ని భాషల నుంచి 22 సినిమాలు వచ్చినట్లు తెలుస్తోంది. వీటిల్లో ‘ది స్టోరీ టెల్లర్‌’, ‘మ్యూజిక్‌ స్కూల్‌’, ‘మిస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’, ‘ట్వల్త్‌ ఫెయిల్‌’, ఘూమర్‌, గదర్‌ 2, అబ్‌ థో సాబ్‌ భగవాన్‌ భరోస్‌, రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ, జ్విగాటో, ది కేరళ స్టోరీ వంటి తదితర బాలీవుడ్‌ చిత్రాలు, విడుదలై పార్ట్‌1 (తమిళం), వాల్వి (మరాఠి) సినిమాలతోపాటు తెలుగు చిత్ర సీమ నుంచి బలగం, దసరా చిత్రాలు పరిశీలనకు వచ్చాయి.
ఈ సినిమాలను వీక్షించిన అనంతరం మన దేశం తరఫున ఒక చిత్రాన్ని ‘ఉత్తమ విదేశీ చిత్రం’ కేటగిరిలో ఆస్కార్‌కి పంపుతారు. ఈ నేపథ్యంలో మన తెలుగు నుంచి ‘బలగం’, ‘దసరా’ సినిమాలు పోటీ పడుతుండటంతో ఏ సినిమా ఆస్కార్‌ వైపు అడుగులు వేస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది.
అయితే ఈ ఏడాది మన దేశం నుంచి ‘విడుదలై పార్ట్‌ 1, జ్విగాటో, బలగం’ చిత్రాల్లో ఏదో ఒకటి ఆస్కార్‌ ఎంట్రీకి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ మూడు సినిమాలు ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అత్యధికంగా అవార్డులను దక్కించుకుని బాగా పాపులర్‌ అయ్యాయి. వీటిల్లో ‘బలగం’ సినిమా ఏకంగా 100కి పైగా అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం.