– వేసవి తీవ్రతను కళ్లకు కడుతున్న ఎండలు-
– ఫిబ్రవరి చివరికి ఎండలు ఇంకా ముదరొచ్చని అంచనాలు
నవతెలంగాణ – పెద్దవూర
ఏటా మార్చి-ఏప్రిల్‌లో మంట పుట్టించే ఎండలు ఈసారి ముందే చుక్కలు చూపిస్తున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం దాటకముందే, శివరాత్రికి శివ శివ అంటూ చలి సెలవు తీసుకోక ముందే సూర్యుడు చెలరేగి పోతున్నాడు.జిల్లాఅంతా ఇదే పరిస్థితి. అసాధారణ వేడి ఉక్కపోతే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భూతాపం కారణంగా ఇప్పటికే గడిచిన 2024 చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. మరి 2025 ఏం చేయబోతోందీ అన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఇక ఈఏడాది 2025 అయితే ఫిబ్రవరి నెలలోనే భానుడి ప్రతాపం మొదలైంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటుతుంది. ఎండాకాలం స్టార్ట్ కాకముందే ఇన్ని డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.మధ్యాహ్నం చాలా మంది ఇంట్లో ఏసీ లు వేసుకొని సేద తీరుతున్నారు.ఫిబ్రవరి మొదటి వారంలోనే ఎండ తీవ్రత ఇలా ఉంటే.. ముందు ముందు పరిస్థితి దారుణంగా ఉండబోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ లో రానున్న మూడు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఈ మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని వెల్లడించింది. దీంతో జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం సమయాల్లో పొగమంచు ఉంటుందని పేర్కొంది.జిల్లా లో సరాసరి కనిష్ఠంగా 18 డిగ్రీలు, గరిష్ఠంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.ఇప్పటికే నల్లగొండలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రధానంగా తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వేడి గాలులు వీస్తున్నాయని, వాతావరణ శాఖవారు పలు చానల్లలో చెపుతున్నారు. దీంతో జిల్లాలో ఈ ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది.