ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో

– నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ నోటీసులు
– అక్టోబర్‌ 4న విచారణకు రావాలని నోటీసుల్లో వెల్లడి
న్యూఢిల్లీ : అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌ మెంట్‌ కుంభకోణం కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసు వ్యవహారంలో నారా లోకేష్‌కు, 41ఏ కింద నోటీసులు అందజేశారు. అక్టోబర్‌ 4న ఉదయం 10 గంటలకు సీడీఐ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో విచారణకు సహకరించాలని కోరారు. శనివారం ఢిల్లీ అశోక రోడ్‌ 50లోని టీడీపీ ఎంపి గల్లా జయదేవ్‌ అధికారం నివాసంలో ఉన్న లోకేష్‌ను కలిసి సీఐడీ అధికారులను ఉద్దేశించి ఇలా ఎలా వచ్చారని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే నోటీసులు పంపారు కాదా అని లోకేష్‌ అధికారులతో అన్నారు. అయితే దీనికి స్పందించిన అధికారులు నోటీసులు భౌతికంగా అందజేయాలని వచ్చినట్లు తెలిపారు. అయితే ఓకే అని నోటీసులను సీఐడీ అధికారుల నుంచి లోకేష్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా రాక రాక వచ్చారు. టీ అయిన, కాఫీ అయిన తీసుకోవాలని సీఐడీ అధికారులను లోకేష్‌ కోరారు. అందుకు సీఐడీ అధికారులు నిరాకరించారు. కాగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఎలైన్‌ మెంట్‌ వ్యవహారంలో నారా లోకేష్‌ను సీఐడీ ఏ 41గా చేర్చింది. దీంతో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ లోకేశ్‌ హైకోర్టు ఆశ్రయించగా.. సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు ఇవ్వడమంటే అరెస్ట్‌ కాదని అధికారులు కోర్టుకు నివేదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం… అరెస్ట్‌ చేసే ఆస్కారం లేనందున లోకేశ్‌ పెట్టుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ను ముగించిన విషయం తెలిసిందే.