కనీస వేతనాల సలహామండలిలో

కేంద్ర కార్మిక సంఘాలకు
ప్రాతినిధ్యం కల్పించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర కనీస వేతన సలహా మండలిలో కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో కార్మిక శాఖ ముఖ్యకార్యదర్శి ఐ.రాణికుముదినికి సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.కుమారస్వామి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ మాట్లాడుతూ..రాష్ట్ర కనీస వేతన సలహా మండలిని ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
అందులో కొన్ని కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం గత సాంప్రదాయాలకు భిన్నమైనదని తెలిపారు. కార్మిక సంఘాలకు విస్తృతంగా ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా కార్మికుల సమస్యలపై సమగ్ర చర్చ జరిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో కనీస వేతనాలు వర్తించే 73 షెడ్యూల్‌ ఎంప్లారుమెంట్స్‌ కాలపరిమితి ముగిసి చాలా ఏండ్లు గడుస్తున్నదన్నారు. సత్వరమే కొత్త జీవోలను విడుదల చేయాలనీ, కనీస వేతనాల సలహామండలిలోకి కేంద్ర కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.