– మోసగించిన ఇద్దరు ఛీటర్ల అరెస్ట్ : సీఐడీ వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురిని మోసగించిన అబ్రాడ్ వీసా కంపెనీకి చెందిన ఇద్దరిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ డీజీపీ షికా గోయెల్ తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన కమలాకర్‌కు మాల్టా దేశంలో ఉద్యోగం కల్పిస్తామంటూ కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన అబ్రాడ్ వీసా సంస్థ నిర్వాహకులు గంటా అనిల్, గంటా సునీల్ లు హామీ ఇచ్చారు. ఈ మేరకు కమలాకర్ నుంచి రూ.8 లక్షలను జాబ్ ప్రాసెసింగ్ ఫీజు పేరిట వసూలు చేశారు. దీంతో వారిచ్చిన ఉద్యోగ పత్రాలను తీసుకొని మాల్టా వెళ్లిన కమలాకర్‌కు.. చుక్కెదురైంది. అసలు అక్కడ నిర్వాహకులు చెప్పిన విధంగా ఎలాంటి సంస్థా లేకపోగా.. నకిలీ వీసాపై వచ్చారంటూ అక్కడి అధికారులు కమలాకర్‌ను వెనక్కి పంపించారు. దీంతో కమలాకర్ తనకు జరిగిన మోసంపై కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ కేసు తర్వాత సీఐడీ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగానికి బదిలీ అయింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు.. అబ్రాడ్ వీసా సంస్థ.. కమలాకర్‌నేగాక మరికొందరినీ విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసగించిందని కనిపెట్టారు. ఒక్కో బాధితుడి నుంచి రూ.5 లక్షల మేరకు జాబ్ ప్రాసెసింగ్ ఫీజు పేరిట వసూలు చేసి మోసగించిందని దర్యాప్తులో తేల్చారు. దీంతో గంటా సునీల్ కుమార్‌తో పాటు శ్రీవాత్సవ అనే మహిళను అరెస్ట్ చేశారు.