– ఆ యాత్రను సుప్రీం కోర్టు నిలిపివేయడం అభినందనీయం : ఆవాజ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కావడి (కన్వర్) యాత్ర సందర్భంగా నిబంధనలు పేరుతో బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన కుల, మత వివక్ష, విద్వేష, విష బీజాలు నాటే ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేయడాన్ని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ స్వాగతిస్తున్నదని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలిసి మెలిసి జీవిస్తున్న ప్రజల మద్య రాజకీయ ప్రయోజనాల కోసం విభజన చిచ్చు పెట్టే బీజేపీ విధానాలను ప్రజలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. దశాబ్దాలుగా గంగా నది తీరంలో కావడి(కన్వర్) యాత్ర జరుగుతోందని గుర్తు చేశారు. ఆ యాత్రను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నదని పేర్కొన్నారు. తినుబండారాలు అమ్మే అన్ని దుకాణాల ముందు యజమానులు, పనిచేసే వారి పేర్లతో బోర్డులు పెట్టాలనే ఆదేశాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేశాయని తెలిపారు.దీని వల్ల కలిసి మెలిసి జీవిస్తున్న ప్రజలను మతాల పేరుతో, కులాల పేరుతో విడదీసే కుట్రకు పాల్పడిందని విమర్శించారు. దశాబ్దాల నుంచి అన్ని మతాలకు చెందిన ప్రజలు యాత్రలో పాల్గొంటున్న వారికి సహాయ, సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. కానీ.. ఈ సారి మత, కుల వైషమ్యాలను పెంచి రాజకీయ లబ్దిపొందేందుకు చేస్తున్న కుట్రను సుప్రీం కోర్టు అడ్డుకోవటం హర్శనీయమని తెలిపారు.దేశంలో మతోన్మాద రాజకీయాలని ప్రజలు తిరస్కరిస్తున్నప్పటికీ బీజేపీ పదేపదే అదే ప్రయత్నాలు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.