‘పవన్ కళ్యాణ్ హీరోగా తాను నిర్మిస్తున్న భారీ చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఘన విజయం సాధిస్తుంది’ అని నిర్మాత ఎ.ఎం.రత్నం నమ్మకం వ్యక్తం చేశారు. మంగళవారం తన పుట్టినరోజు సందర్భంగా ప్రకటన విడుదల చేసిన ఆయన ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకుల హదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. భారత దేశం గర్వించదగ్గ నిర్మాతలలో ఏ.ఎం.రత్నం ఒకరు. కేవలం నిర్మాతగానే కాకుండా గీత రచయితగా, రచయితగా, దర్శకుడిగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో తనదైన ముద్ర వేశారు. ‘కర్తవ్యం’, ‘పెద్దరికం’, ‘సంకల్పం’, ‘భారతీయుడు’, ‘నట్పుక్కాగ’, ‘కధలర్ దినం’, ‘ఖుషి’, ‘బార్సు’, ‘గిల్లి’, ‘7/జి రెయిన్‌బో కాలనీ’, ‘స్నేహం కోసం’ వంటి చిత్రాలను నిర్మించారు. మెగా బడ్జెట్ చిత్రాల నిర్మాతగా పేరొందిన ఆయన డిస్ట్రిబ్యూటర్ గాను వ్యవహరించి ఎన్నో గొప్ప చిత్రాలను ప్రేక్షకులకు చేరువ చేశారు. పవన్ కళ్యాణ్‌తో ఎ.ఎం.రత్నంకు ఎంతో అనుబంధం ఉంది. వీరి కలయికలో గతంలో ‘ఖుషి, బంగారం’ సినిమాలు వచ్చాయి. వీరి కాంబోలో రూపొందుతున్న ‘హరి హర వీరమల్లు’ మూడో సినిమా కావడం విశేషం.