వీరుల దారుల్లో…

In the path of heroes...వీరులు నడిచిన దారుల్లో.. వీర తెలంగాణ సాయుధ పోరాట బాట వీధి వీధిలో మెరిసే నెత్తుటి పూదోట…
అవును…మట్టిమనుషుల శౌర్యం, సమరయోధుల త్యాగం, ప్రపంచపటంలోనే తెలంగాణ నేలను ”వీర తెలంగాణ”గా సుస్థిరం చేశాయి. ఇక్కడి పల్లెల్ని ప్రజాయుద్ధ క్షేత్రాలుగా, ప్రజల్ని తుపాకి తూటాలుగా తీర్చిదిద్ది, మన ఘనతలు చరిత్రపుటల్లో సువర్ణాక్షరాలై చిరకాలం వెలిగేలా చేశాయి.
భారతదేశమంతటా సాగుతున్న స్వాతంత్య్ర ఉద్యమ ప్రేరణతో మొదలైన తెలంగాణ పోరాటం… భూమి, భుక్తి, విముక్తి నినాదంతో ఆరంభమై కూలీరేట్ల పెంపు, సామాజిక న్యాయసాధన, అక్షరాస్యత, అందరికీ అభివృద్ధి, దోపిడీ అంతం, సమసమాజ స్థాపన అనే దిశగా సాగింది. సంఘం పిలుపుతో వరదలా కదిలిన జనసైన్యం ఊరూరా ఉద్యమ పతాకం అందుకుంది. తొలుత ఆంధ్రమహాసభ అండతో సాంస్కృతిక సమరంగా మొదలై 1946 జూలై 4న కడివెండిలో దొడ్డి కొమురయ్య అమరత్వంతో సాయుధ పోరాట ఫిరంగులై పేలింది. ఈ మహోజ్వల పోరాటంలో దొరలు, జాగీదార్ల దౌర్జన్య క్రీడలు, నిజాం సేనల నిరంకుశ దాడులు, రజాకార్ల దోపిడీ ఆకృత్యాలు, నెహ్రూ సైన్యాల అరాచకాలెన్నో…. వాటిని ఎదురించి మట్టికరిపించిన వీరగాథóలు మరెన్నో… వీటన్నిటికీ సాక్షిగా నిలచి ఎదురు తిరిగిన పల్లెలు ఈ నేలపై అనేకం.
ఐలమ్మ తిరుగుబాటు కేంద్రం పాలకుర్తి, తొలి గుతుపల సంఘం నీర్మాల నుంచి మొదలుపెడితే ఓ వీర బైరాన్‌పల్లి, గుండ్రాపల్లి, ధర్మాపురం, పురిగిల్ల, బాలెంల, సిరిసిల్ల, సూర్యాపేట, మానుకోట, కామారెడ్డి గూడెం, రాచకొండ, దేవరకొండ, నల్లగొండ, పిండిప్రోలు, కోయగూడెం, వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ ఇలా అన్నీ ఉద్యమ కేంద్రాలే. కొమురం భీం, షేక్‌ బందగీ వంటి వీరులు తిరుగుబాటు ప్రారంభిస్తే… సాయుధ పోరాట నావకు రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నర్సింహరెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు, కాచం కృష్ణమూర్తి, మల్లు వెంకట నర్సింహారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి ఎందరో సారథ్యం వహించారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర్‌రావు వంటి మహా నేతలు మార్గనిర్దేశం చేశారు.
నాలుగువేల మంది అమరుల రక్తతర్పణ, మూడువేల గ్రామాల్లో ప్రజారాజ్యం, పదిలక్షల ఎకరాల భూ పంపిణీ, వెట్టి చాకిరీ రద్దు ఇలా అనేక అంశాలకు పునాదిగా నిలిచింది వీరతెలంగాణ పోరాటం. నిజాం రజాకార్లను నెహ్రూ సైన్యాలను మట్టికరిపించి ఈ నేలను వీరభూమిగా రూపుదిద్దింది. ఈ మహత్తర పోరాటానికి ఇంధనం ప్రజాకళలే. దాశరథి, వట్టికోట, మగ్దుం మొహిద్దీన్‌, షోయబుల్లాఖాన్‌ వంటి సాహితీమూర్తులు తమ రచనలతో ప్రజల్లో స్ఫూర్తి రగిలిస్తే, సుద్దాల హనుమంతు, యాదగిరిలాంటి కళాకారులు ఊర్లకుఊర్లు ఉర్రూతలూగించి కదనానికి కదిలించారు.
ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న ప్రజానాట్యమండలి..ఈ వార్షికోత్సవ వేళ.. వీరతెలంగాణ అమరు లను స్మరించుకు నేందుకు, ఉద్యమ పల్లెల్ని, యోధుల స్థూపాలను గుండెలకద్దుకుని, ఆటాపాటల్లో వారి ఆశయాలను నెమరేసుకుని, రేపటిదిశగా నడిచేందుకు, నడిపించేందుకు ”శౌర్యయాత్ర”కు సిద్ధమైంది. ఈ ”శౌర్య యాత్ర” సెప్టెంబర్‌ 1న గుండ్రాం పల్లిలో ప్రారంభమై, వీరులు నడిచిన దారుల్లో నాటి పోరాట క్షేత్రాలను దర్శించుకొని, తొలి ఆంధ్రమహాసభకు పురుడుబోసిన జోగిపేటలో సెప్టెంబర్‌ 20న ముగియనుంది. రాష్ట్రమంతటా ఈ శౌర్యయాత్రతో గొంతుకలుపుదాం. వీరులకు జేజేలు పలుకుదాం.
కట్ట నర్సింహ
9490098337