– డీఎస్పీకి ఏడు రోజుల పాటు పోలీసుల కస్టడీ
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితుడు డీఎస్పీ ప్రణీత్‌రావును ఏడు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 17 నుంచి 23వ తేదీ వరకు కస్టడీకిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆదివారం చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రణీత్‌రావును పంజాగుట్ట పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్‌ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావు.. కొందరు ప్రతిపక్ష నాయకులు, మరికొందరు పోలీసు అధికారులు, ప్రముఖులకు చెందిన ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారనే అభియోగంపై పంజాగుట్ట పోలీసులు ప్రణీత్‌రావును అరెస్ట్ చేసిన విషయం విదితమే. కాగా, ఈ కేసులో ఆధారాలను ధ్వంసం చేయటం, రికార్డులను తారుమారు చేయటం వంటి నేరాలకు కూడా ప్రణీత్‌రావు పాల్పడినట్టు పంజాగుట్ట పోలీసులు ఆయనపై అభియోగం మోపారు. ఈ కేసులో మరిన్ని నిజాలను ప్రణీత్‌రావు నుంచి రాబట్టటానికి ప్రణీత్‌రావును తమ కస్టడీకి ఇవ్వాలని పంజాగుట్ట పోలీసులు కోర్టులో వేసిన పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి.. ఏడ్రోజుల పాటు తదుపరి విచారణ కోసం కస్టడీకిచ్చారు. కాగా, ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన దశ నుంచి అందుకు ప్రోత్సహించిన ఉన్నతాధికారుల వరకు అసలు నిజాలను రాబట్టటానికి దర్యాప్తు అధికారులు ప్రణీత్‌రావుపై సంధించాల్సిన ప్రశ్నలను సిద్ధం చేసుకొని ఉంచుకున్నారని తెలిసింది. జూబ్లిహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో ప్రణీత్‌రావును ప్రశ్నించటానికి రంగం సిద్ధం చేసినట్టు సమాచారం.