ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో

In the phone tapping case– ముగ్గురు అధికారుల కస్టడీ కోసం స్పెషల్‌ టీమ్‌ నేడు పిటిషన్‌
– సాఫ్ట్‌వేర్‌ టెక్నికల్‌ నిపుణుడు రవిపాల్‌ పాత్ర పైనా లోతుగా ఆరా
– క్యాన్సర్‌ వైద్యం కోసం అమెరికా వెళ్లానంటూ ప్రభాకర్‌రావు సమాచారం
– ప్రభాకర్‌రావు విచారణ తర్వాతే పొలిటికల్‌ పెద్దల హస్తంపై ప్రత్యేక బృందం దృష్టి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
రాష్ట్రంలో సంచలనం రేపిన ప్రతిపక్ష రాజకీయ ప్రముఖుల ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టయిన ముగ్గురు పోలీసు అధికారులను కస్టడీలోకి తీసుకొని విచారించటానికి మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ వేయనున్నారు. రెండ్రోజుల క్రితం ఈ కేసులో అరెస్ట్‌ చేసిన మహబూబాబాద్‌ అదనపు ఎస్పీ బుజంగరావు, ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ తిరుపతన్నలతో పాటు ఇప్పటికే వారం రోజుల పాటు విచారణ జరిపిన డీఎస్పీ ప్రణీత్‌రావులను కలిపి విచారించటం కోసం కస్టడీ పిటిషన్‌ వేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు జరిపిన విచారణలో ఈ ముగ్గురు అధికారులు గత ఎన్నికల్లో ప్రతిపక్షానికి చెందిన రాజకీయ ప్రముఖుల ఫోన్‌ ట్యాపింగ్‌లు చేయటంతో పాటు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు, బంగారు నగల వ్యాపారులతో పాటు మరికొందరు ప్రయివేటు వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేసి, వారవిని బెదిరించినట్టు కూడా వెలుగు చూసింది. ముఖ్యంగా, 36 మందికి పైగా బంగారు నగల వ్యాపారులు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల ఫోన్లను ట్యాపింగ్‌ చేసి, వాటిని సదరు వ్యాపారులకు వినిపించి మరీ బ్లాక్‌మెయిల్‌ చేసి భారీ మొత్తంలో డబ్బులను దండుకున్నారని తెలుస్తున్నది. ఈ బ్లాక్‌మెయిలింగ్‌ ద్వారా అప్పటి అధికార బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ మొత్తంలో నిధులను కూడా వ్యాపారుల నుంచి సమీకరించారని కూడా ప్రత్యేక బృందం దర్యాప్తులో వెల్లడైనట్టు తేలింది. ఈ విషయంలో కొందరు అప్పటి ప్రభుత్వ బీఆర్‌ఎస్‌ ప్రముఖుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వీరు నడుచుకున్నారని తెలిసింది.
ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని విదేశాల నుంచి తేవటంలో రవిపాల్‌ అనే ప్రయివేటు సాఫ్ట్‌వేర్‌ సాంకేతిక నిపుణుడు అప్పటి ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావుకు సహకరించినట్టు విచారణలో వెలుగు చూసింది. సాఫ్ట్‌వేర్‌ నిపుణుడైన రవిపాల్‌ ప్రభుత్వ సెక్యూరిటీ విభాగాలకు కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే, ఫోన్‌ ట్యాపింగ్‌కు సంబంధించిన ఈ పరికరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా వీరు రాష్ట్రానికి ఇజ్రాయెల్‌ నుంచి ఎలా తీసుకొచ్చారనే కోణంలో కూడా స్పెషల్‌ టీమ్‌ దర్యాప్తు సాగిస్తున్నది. ఈ పరికరాల కొనుగోలుకు అవసరమైన కోట్ల రూపాయలను ఎస్‌ఐబీ ఇంటెలిజెన్స్‌ విభాగం సమకూర్చిందా? లేక అప్పటి ప్రభుత్వానికి చెందిన కొందరు రాజకీయ ప్రముఖులు ఆ భారాన్ని భరించారా? లేక ఈ అధికారులు ఇతర మార్గాలను అన్వేషించారా? అనే కోణంలో కూడా సీరియస్‌గా దర్యాప్తును సాగిస్తున్నారు. ఈ విషయంలో మరిన్ని వివరాలను రాబట్టటానికి రవిపాల్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించటానికి స్పెషల్‌ టీమ్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ముఖ్యంగా, ప్రణీత్‌రావు, బుజంగరావు, తిరుపతన్నలను తిరిగి విచారించటం ద్వారా వారు జరిపిన ఫోన్‌ట్యాపింగ్‌ అకృత్యాలపై మరింత సమాచారం రాబట్టటానికి అధికారులు సిద్ధమవుతున్నారని సమాచారం.ఇదిలాఉంటే, ప్రణీత్‌రావు ధ్వంసం చేసిన పదిహేడు కంప్యూటర్ల హార్డ్‌ డిస్క్‌లను నాగోల్‌ వద్ద మూసీ నది పరివాహక ప్రాంతం నుంచి స్వాధీనపర్చుకున్న అధికారులు.. వాటి నుంచి మరిన్ని ఆధారాలను సేకరిం చటానికి ప్రయత్నం చేస్తున్నారు. హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం కావటం వల్ల కొత్తగా సమాచారాన్ని రాబట్టటం కష్టమే అయినా.. వీరు అక్రమంగా ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడినట్టు హార్డ్‌డిస్క్‌లపై ఉండే పాస్‌వర్డ్‌లు కీలకమైన ఆధారాలుగా మారాయని ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారుఈ కేసులో ప్రధాన నిందితుడు, మాజీ ఐజీ ప్రభాకర్‌రావును భారత్‌కు తీసుకురావటానికి అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మరోవైపు, తనకున్న క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స కోసం అమెరికాకు వచ్చాననీ, జూన్‌, జులైలో తాను హైదరాబాద్‌కు వస్తానంటూ ప్రభాకర్‌రావు హైదరాబాద్‌లో ఒక పోలీసు ఉన్నతాధికారికి సమాచారమందించినట్టు తెలుస్తున్నది. అయితే, ఈ సమాచారాన్ని కేసు దర్యాప్తు జరుపుతున్న అధికారులు ధృవీకరించటం లేదు.
ఈ పోలీసు అధికారుల ద్వారా ఫోన్‌ట్యాపింగ్‌లకు గురైన బాధిత నగల వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులలో ఎవరైనా ఫిర్యాదు చేయటానికి వస్తే వాటిని తీసుకొని విచారించటానికి తాము సిద్ధంగా ఉన్నామని ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కాగా, ఈ ఫోన్‌ ట్యాపింగ్‌ల వెనక అప్పటి ప్రభుత్వానికి చెందిన కొందరు పెద్దల హస్తముందనే ఆరోపణలపై దర్యాప్తు అధికారులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా, ఆ ప్రముఖులు ఎవరనే విషయమై ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తులో కొన్ని వివరాలు బటయపడినప్పటికీ.. ఈ విషయంలో తొందరపడకుండా పూర్తి ఆధారాలు సేకరించి చర్యలకు దిగాలని స్పెషల్‌ టీం అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావు, మరో మాజీ డీసీపీ రాధాకిషన్‌రావులను అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాతే అప్పటి రాజకీయ పెద్దల పాత్రపై కార్యాచరణకు దిగటం మంచిదని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్టు తెలిసింది.