మ‌హ‌నీయుని ఆశ‌య జాడ‌ల్లో‌…

నిష్కళంక దేశభక్తుడు. స్వాతంత్ర సమర యోధుడు. మహత్తర కమ్యూనిస్టు విప్లవకారుడు. పీడిత ప్రజల ప్రియతమ నాయకుడు. తెలుగు తల్లి ముద్దు బిడ్డడు. వలస పాలనను అంతమొందించినంత మాత్రాన స్వాతంత్య్రం రాదని, వర్గ దోపిడీని, దారిద్య్రాన్ని సమాజం నుంచి పారద్రోలిన నాడే స్వాతంత్య్రం సిద్ధిస్తుందని గట్టిగా విశ్వసించినవాడు. శ్రమదోపిడినీ, కులవివక్షను ఇంటి నుండే ప్రశ్నించిన వాడు. జీవిత సర్వస్వం ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం ధారపోసినవాడు. విశాలమైన ఆశయాల కోసం నిరంతరాయంగా పోరాడిన వీరుడు. చారిత్రాత్మక వీర తెలంగాణ పోరాటానికి నేతృత్వం వహించినవాడు. అతడే కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య. ఈ రోజు ఆయన వర్థంతి సందర్భంగా ఆయన పేర విశేష సేవలందిస్తున్న సుందరయ్య విజ్ఞాన కేంద్రాల గురించి తెలుసుకుందాం…

పుచ్చలపల్లి సుందరయ్య 1913 మే 1న నెల్లూరు జిల్లా అలగాని పాడులో, ధనిక రైతు కుటుంబంలో పుట్టారు. చిన్నతనం నుండే ఆయనపై కందుకూరి, గురజాడ, కొమర్రాజు లక్ష్మణరావు వంటి అనేక మంది సంఘసంస్కర్తల ప్రభావం పడింది. మహాత్మాగాంధీ నుంచి ఉత్తేజం పొంది తన 14 ఏండ్ల ప్రాయంలో మద్రాసు రాష్ట్రంలో జరిగిన కాంగ్రెస్‌ మహాసభకు హాజరయ్యారు. సైమన్‌ గో బ్యాక్‌ ఆందోళనలో పాల్గొన్నారు. మద్రాసులోని లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్‌ చదివేటపుడు ఇతర విద్యార్థులతో కలిసి సోదర సమితి స్థాపించారు. రాజకీయాలను అర్థం చేసుకోవడం, ఆదివారాల్లో ఖద్దరు అమ్మడం, సామాజిక దురాచారాల నిర్మూలన, సెలవు రోజుల్లో గ్రామాల్లో వ్యవసాయ కార్మికులకు చదువు చెప్పడం వంటివి చేశారు. 1930లో మహాత్మాగాంధి ఇచ్చిన పిలుపునందుకొని చదువుకు స్వస్తిచెప్పి స్వాతంత్ర పోరాటంలో చేరారు. రెండేండ్లు జైలు శిక్ష అనుభవించారు. విడుదలైన తర్వాత గ్రామాల్లో పని చేయడం మొదలుపెట్టారు. అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు.
కమ్యూనిస్టు పార్టీలో…
కామ్రేడ్‌ అమీర్‌ హైదర్‌ఖాన్‌ మార్గదర్శకత్వంలో కమ్యూనిస్టు పార్టీలో చేరారు. ఆ సమయంలో పార్టీపై బ్రిటిష్‌ వారు నిషేధం విధించారు. ఆయినా ఆంధ్రా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. 1943లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగిన తర్వాత బొంబాయిలో జరిగిన తొలి మహాసభల్లో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. అప్పటి నుండి మరణించే వరకూ పార్టీలో వివిధ బాధ్యతల్లో సేవలందించారు. 1952 సాధారణ ఎన్నికల తర్వాత మద్రాసు అసెంబ్లీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. రాష్ట్రంలో క్రియాశీల ఎన్నికల రంగంలో దూకి 1955 నుంచి 1967 వరకు తిరిగి 1978 నుంచి 1983 వరకు రాష్ట్ర శాసనసభ సభ్యునిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నాయకునిగా రాష్ట్ర అభివృద్ధికి అనేక కార్యక్రమాలు, పథకాలకు రూపురేఖలిచ్చారు. పేదలకు విద్యా, వైద్యం అందుబాటులో ఉండాలని ఆయన నిత్యం తపించేవారు. అంతే కాదు సుందరయ్య గొప్ప చదువరి. అధ్యయనానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు. అందరికీ శాస్త్రీయ విజ్ఞానం అందుబాటులో ఉండాలనేది ఆయన ఆశయం. అలగానిపాడులోని దళితులకు తక్కువ ధరలో నిత్యావసరాలు ఇచ్చేందుకు సైకిల్‌ మీద సరుకులు తెచ్చి ఓ దుకాణంలా పెట్టి పేదలకు ఇచ్చేవారు. ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా ఎన్నికైనా అత్యంత సాదాసీదాగా సైకిల్‌పైనే వెళ్లేవారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి. డ్రైనేజీ బోర్డుకు సుందరయ్యను అధ్యక్షుడిగా చేశారు. కోస్తా ఏరియాల్లో డ్రైనేజ్‌ వ్యవస్థ చాలా సమస్యగా ఉండేది. అంతకు ముందే ఆయనకు జనాన్ని పోగు చేసి బందరు కాలువ పూడిక తీయించిన అనుభవం ఉంది. అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా డ్రైనేజ్‌ సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం కోసం చాలా కృషి చేశారు. అసెంబ్లీలో ఆయన లేస్తే అందరిలో గౌరవంతో కూడిన భయం ఉండేది. ఏం అడుగుతారో, ఏం సమాధానం చెప్పాలో అని కంగారు పడేవారు. ఏదైనా మాట్లాడాలంటే ఆ విషయంపై సంపూర్ణ సమాచారంతో వెళ్ళేవారు. అందుకే ఆయనకు సమాధానం చెప్పలేక అందరూ భయపడేవారు.
స్ఫూర్తినిచ్చే మ్యూజియం
అప్పట్లో సుందరయ్య ఉపయోగించిన వస్తువులన్నింటితో ఒక మ్యూజియం ఏర్పాటు చేసి వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు. ఆయన వాడిన కళ్ళజోడు, సైకిల్‌, గొంగళితో పాటు తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఆయన స్వయంగా మోసుకొని తిరిగిన రేడియో సెట్‌ కూడా అందులో భద్రంగా ఉంది. ఇలా ఆయన ఇంట్లో ఉన్నట్టువంటి చిన్న చిన్న వస్తువులన్నీ ఈ మ్యూజియంలో ప్రజల సందర్శనార్ధం అందుబాటులో ఉంచారు.
ఆయన ఆశయ సాధనకై…
గొప్ప విజ్ఞాన వంతుడు, ప్రజానాయకుడు సుందరయ్య 1985లో మే 19న మరణించారు. ఆయన ఆశయాలను కొనసాగించాలనే లక్ష్యంతో సుందరయ్య పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసి విస్తృతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొదట 1988లో హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. అప్పట్లో తెలుగు దేశం ప్రభుత్వం దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయించింది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ముఖ్యంగా ముఖ్యమంత్రులు ఈ కేంద్రానికి అవసరమైన సహాయ సహకారాలు అందించారు. అలాగే ఎంతో మంది ప్రముఖులు సుందరయ్య విజ్ఞాన కేంద్రాల నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారు. 1994లో ప్రజా కళలను ప్రదర్శించే ఉద్దేశంతో కళానిలయం ప్రారంభించారు. అలాగే కార్యకర్తలకైనా, నాయకులకైనా నిరంతర అధ్యయనం అవసరం అంటారు సుందరయ్య. అందుకే బాగ్‌లింగ్‌పల్లిలోని ఎస్వీకేలో రెండవ అంతస్థులో నిరంతర పాఠశాల కోసం ఓ హాల్‌ కేటాయించారు. 1998లో ఎస్వీకే ఎదురుగా ఉన్న సుందరయ్య పార్కులో సుందరయ్య శిలా విగ్రహాన్ని ప్రతిష్టించారు. అలాగే 2005లో గచ్చిబౌలిలోని మరో ఎస్వీకే ప్రారంభమయింది. 2021 నుండి హైదరాబాద్‌ ప్రగతి నగర్‌లో కూడా సుందరయ్య భవన్‌ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రతిష్టాత్మక లైబ్రరీ
అప్పట్లో సుందరయ్య వద్ద 40 వేల సొంత పుస్తకాలు ఉండేవి. ఆ పుస్తకాలతో మొదట బాగ్‌లింగ్‌పల్లిలోని ఎస్వీకేలో పెద్ద లైబ్రరీగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎంతో మంది ప్రముఖులు, దాతలు తమ పుస్తకాలను ఈ లైబ్రరీకి ఇచ్చేశారు. ఇందులో ఎక్కడా దొరకని ఉర్దూ సాహిత్యం కూడా చాలా ఉంది. ఆరుద్ర కూడా ఆయన పుస్తకాలను ఈ లైబ్రరీకి అందించారు. ఈ లైబ్రరీలో చదువుకుని చాలా మంది పీహెచ్‌డీ పట్టాలు అందుకున్నారు, అందుకుంటున్నారు. ఇందులో హ్యుమానిటీ, చరిత్ర, ఆర్థిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా ఉంటాయి. 2000లో హైదరాబాద్‌లో పెద్దఎత్తున వరదలు వచ్చాయి. ఆ వరదల్లో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. ఆ సమయంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోకి నీళ్లు వచ్చి లైబ్రరీలో పుస్తకాలు చాలా వరకు తడిసిపోయాయి. చికాగో యూనివర్సిటీ సహాయంతో పుస్తకాలను డీహైడ్రేట్‌ చేసి తడి మొత్తం తొలగించి తిరిగి మంచి స్థితికి తీసుకొచ్చారు. బాగ్‌లింగంపల్లి లోతట్టు ప్రాంతం కాబట్టి ఎప్పటికైనా లైబ్రరీకి ప్రమాదం ఉంటుందని ఆ పుస్తకాలన్నీ అప్పుడే గచ్చిబౌలీలో కొత్తగా ప్రారంభమైన ఎస్వీకేకి బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ చారిత్రాత్మక లైబ్రరీ అక్కడే ఉంది. విద్యార్థులు అహ్లాదకరమైన, ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా ఈ లైబ్రరీ నిర్వహించబడుతుంది. ఫోర్డ్‌ ఫౌండేషన్‌ గ్రాంట్‌, బ్రిటిష్‌ లైబ్రరీ గ్రాంట్‌ పొందిన ఈ లైబ్రరీ ఆధునీకరణకు శ్రీకారం చుట్టి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అలాగే ప్రగతినగర్‌లోనూ సావిత్రీబాయిపూలే పేరుతో పదివేల పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేశారు.
వైద్య సేవలు
సుందరయ్య వైద్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. పేదలకు వైద్యం అందించాలని నిత్యం తపించేవారు. తెలంగాణ సాయుధ పోరాట కాలంలో దళాల్లో పని చేసే మహిళలకు ప్రసూతి చేయడంలో శిక్షణ ఇచ్చేవారంట. ఆయన కూడా స్వయంగా ప్రసూతి చేసేవారంట. కాబట్టి ఎస్వీకే ఆధ్వర్యంలో కూడా పేదలకు అతి తక్కువ ధరకు వైద్యం, మందులు అందించాలనే ఉద్దేశంతో వైద్య సేవలు ప్రారంభించారు. అందులో భాగంగా జనరిక్‌ మెడిసెన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచారు. హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లి, నవతెలంగాణ కార్యాలయం, కమలానగర్‌, సంతోష్‌నగర్‌, వనపర్తి, గద్వాల్‌, నకరికల్‌, నల్గొండ, మిర్యాలగూడలో జనరిక్‌ మెడికల్‌ షాపుల్లో ఎస్వీకే ఆధ్వర్యంలో మందులు పంపిణీ చేస్తున్నారు. అలాగే బాగ్‌లింగంపల్లిలో ఒక క్లినిక్‌ కూడా నడిపిస్తుంది. సాయంత్రం పూట పిల్లల స్పెషలిస్ట్‌, ఫ్యామిలీ ఫిజీషియన్‌ వస్తారు. కన్సల్‌టేషన్‌ ఫీజు కేవలం వంద రూపాయాలు. అలాగే ఆక్యుపెంచ్ఛర్‌ క్లినిక్‌ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. బయట అయితే ఒక్కసారికి రూ.800 వందులు తీసుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం రూ.250 మాత్రమే తీసుకుంటారు. మధ్యాహ్నం సమయంలో 1గం నుండి 4 గంటలకు ఫిజియోథెరఫీ అందుబాటులో ఉంటుంది. అలాగే గచ్చిబౌలిలో ప్రతీ నెల మెడికల్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నారు. అలాగే ప్రగతి నగర్‌లో కూడా ప్రతి నెల ‘వైద్య నేస్తం’ పేరుతో మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేస్తున్నారు.
రీడింగ్‌ రూమ్‌
మొదటి నుండి బాగ్‌లింగంపల్లిలోని ఎస్వీకేలో ఒక రీడింగ్‌ రూమ్‌ అందుబాటులో ఉంది. అందులో ఎవరైనా వచ్చి చదువుకునే అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలకు చదువుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేశారు. వారికి అవసరమైన పుస్తకాలు, పత్రికలు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ప్రిపేరైన వారు చాలా మంది డిప్యూటీ తహసీల్దారులుగా, బ్యాంక్‌ ఉద్యోగులుగా, రైల్వే ఉద్యోగులుగా, పోలీస్‌ కానిస్టేబుల్స్‌గా ఎంపికయ్యారు. ఇది ముఖ్యంగా పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి రీడింగ్‌ రూం గచ్చిబౌలి, ప్రగతినగర్‌లో కూడా ఏర్పాటు చేశారు.
సాంకేతికతలో శిక్షణ
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నియోకర్సర్‌ అనే సాఫ్ట్‌వేర్‌ శిక్షణా కేంద్రం కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ సాఫ్ట్‌వేర్‌ కోర్సుల్లో అతి తక్కువ ఫీజలకు శిక్షణ ఇస్తారు. అలాగే ప్రగతినగర్‌లో కూడా ఇలాంటి శిక్షణా కేంద్రం నడుస్తున్నది. అలాగే వీరు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కోచింగ్‌ సెంటర్‌ కూడా నిర్వహిస్తున్నారు.
ఉచిత ట్యూషన్లు
బస్తీల్లోని పిల్లలకు ఉచిత ట్యూషన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పాతబస్తీలోని జియాగూడ, బాగ్‌లింగంపల్లి నెహ్రూసెంటర్‌, పార్శీగుట్టలో మూడు ట్యూషన్‌ సెంటర్లు నడుస్తున్నాయి. ఐదో తరగతి నుండి పదో తరగతి వరకు పిల్లలు ఈ ట్యూషన్‌ సెంటర్‌లో చదువుకుంటారు. తల్లిదండ్రులిద్దరూ పనికి వెళితే సాయంత్రం స్కూల్‌ నుండి వచ్చిన తర్వాత ఆ పిల్లలకు ఏం చదవాలి, ఎలా చదవాలి అని చెప్పేవారు ఉండరు. అలాంటి పేద పిల్లల కోసం ఈ ట్యూషన్‌ సెంటర్లు నడిపిస్తున్నారు. ప్రగతినగర్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం కూడా ఇలాంట ట్యూషన్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు.
పిల్లల కోసం
బాగ్‌లింగంపల్లి ఎస్వీకేలో తెలంగాణ బాలోత్సవ్‌ పేరుతో నవంబర్‌ 14 చిల్డ్రన్స్‌ డే సందర్భంగా ప్రతి ఏడాది పిల్లల కోసం అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటితో పాటు వేసవి సెలవుల్లో సమ్మర్‌ క్యాంప్‌లు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది దూర ప్రాంతాల నుండి వచ్చే హైస్కూల్‌ పిల్లల కోసం అక్కడే వసతి కూడా ఏర్పాటు చేశారు. ఇందులో చిత్రలేఖనం, కథ ఎలా రాయాలి, ఎలా చదవాలి, చేతిరాత, సబ్జెక్ట్స్‌ అభివృద్ధి చేసుకోవడం, కూచిపూడి డాన్స్‌, శాస్త్రీయ సంగీతం ఇలా పిల్లల ఆసక్తిని బట్టి శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు. ప్రగతినగర్‌లో ప్రగతి చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు సెలవు దినాల్లో ముఖ్యంగా వేసవి కాలంలో సమ్మర్‌ క్యాంపులలో విజ్ఞానం, వినోదంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దాశరథి ఫిలిం సొసైటీ
ప్రస్తుతం సమాజంలో తిరోగామి భావాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే అనేక షార్ట్‌ఫిల్మ్స్‌ విపరీతంగా అందుబాటులో ఉంచారు. వాటి వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయి. అభ్యుదయ కరమైన చిత్రాలు మాత్రం ప్రజలకు అందుబాటులో లేవు. ఆ లోటు భర్తీ చేసే బాధ్యత కూడా ఎస్వీకే తీసుకుంది. అందుకోసమే 2023లో దాశరథి ఫిలిం సొసైటీ ఏర్పాటు చేశారు. దాని ఆధ్వర్యంలో అభ్యుదయకరమైన షార్ట్‌ఫిల్మ్స్‌ తీయడం, స్క్రీనింగ్‌ చేయడం, వాటిని ప్రదర్శించడం వంటివి చేస్తున్నారు. ప్రతి నెల రెండు, నాలుగో శుక్రవారాలు అటువంటి చిత్రాలను ప్రదర్శిస్తుంటారు. ఇతరులను ప్రోత్సహించడమే కాకుండా అవసరమైన కొన్ని చిత్రాలను సొసైటీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు.
ప్రగతి ఇండెక్స్‌ నెట్‌వర్క్‌
ప్రగతి నగర్‌ సుందరయ్య భవన్‌ ఆధ్వర్యంలో యూట్యూబ్‌ ఛానెల్‌ కూడా ప్రారంభించారు. సమాజంలో మంచి మార్పుకై ప్రశ్నించే వారికి వేదికనివ్వడం దీని లక్ష్యం. షార్ట్‌ ఫిలిం మేకర్స్‌ను ప్రోత్సహించేలా స్క్రిప్ట్‌ రైటింగ్‌, డైరెక్షన్‌పై సెలబ్రిటీలతో వర్క్‌షాపులు, షార్ట్‌ ఫిల్మ్స్‌ పోటీలను నిర్వహిస్తున్నారు. అలాగే ప్రగతి కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువజనులు, మహిళల కోసం కల్చరల్‌ కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు.
– సలీమ, 94900 99083

ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు
సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో అసమానతలు (2007-2009): ప్రాంతాలు, జిల్లాల మధ్యనే కాకుండా ప్రజల మధ్య కూడా అసమానతలు ఉన్నాయి. అందుకే ఎస్వీకే వివిధ తరగతుల ప్రజల్లో సామాజిక ఆర్థిక అసమానతలను అధ్యయనం చేసే పనిని చేపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 22 గ్రామీణ జిల్లాల్లోని 88 గ్రామాలను ఎంపిక చేసి ఆర్థిక డేటాను సేకరించారు. 14 మంది వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి చేయడానికి సుమారు రెండున్నరేండ్లు పట్టింది. వివిధ తరగతులు, సామాజిక వర్గాల ప్రజల మధ్య అస్పష్టమైన అసమానతలు ఉన్నాయని, భూ పంపిణీలో అనేక లోపాలున్నాయని వీరి సర్వేలో తేలింది. గ్రామీణ కుటుంబాల్లో దాదాపు సగం మందికి భూమి లేదు. 40శాతం గ్రామ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. ఈ వివరాలన్నీ కలిపి ఒక పుస్తకంగా రూపొందించారు.
అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలపై: అరవయ్యో దశకం చివరి నుంచి ఏర్పాటువాద ఉద్యమాలు మొదలయ్యాయి. మొదట తెలంగాణ ఉద్యమం, తర్వాత ప్రత్యేక ఆంధ్ర, ఆ తర్వాత రాయలసీమ ఉద్యమం అలాంటివే. ప్రతి ప్రాంతం తన వెనుకబాటుకు ఇతర ప్రాంతాలను నిందిస్తుంది. దీనికి తోడు రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాంతీయ అసమతుల్యతపై అధ్యయనం చేపట్టాలని ఎస్వీకే నిర్ణయించింది. వీరి సర్వే ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 23 జిల్లాల్లో కోస్తా ఆంధ్రాలోని 6 జిల్లాలు, హైదరాబాద్‌, రంగారెడ్డి, ఉత్తర తెలంగాణలో ఒకటి మాత్రమే అభివృద్ధి చెందాయి. రాయలసీమలోని కర్నూలు, తెలంగాణలో ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలు అత్యంత వెనుకబడిన జిల్లాలుగా తేలింది. ఈ ప్రాజెక్టుకు కోల్‌కతాలోని ప్రసిద్ధ మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏషియన్‌ స్టడీస్‌ నిధులు సమకూర్చింది. ఈ డేటాతో ‘అభివృద్ధిలో అసమానతలు’ అనే పుస్తకం ప్రచురించారు.
వ్యవసాయంలో భూమి సంబంధాలు-సంక్షోభం ఓ అధ్యయనం 2013-2014 : 2008లో మొదటి గ్రామీణ సర్వే తర్వాత ఎస్వీకేతో పాటు అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం, అఖిల భారత కిసాన్‌ సభ సంయుక్తంగా మారుతున్న భూసంబంధాలు – వ్యవసాయంలో సంక్షోభానికి సంబంధించి మరొక సర్వే చేపట్టాయి. వందలాది మంది స్థానిక నాయకులు పాల్గొనడం ఈ సర్వే ప్రత్యేకత. పాత భూస్వామ్య భూ సంబంధాల స్థానంలో పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు కొంత వరకు చోటు చేసుకున్నప్పటికీ భూ కేంద్రీకరణ కొనసాగింది. ఫలితంగా వ్యవసాయ కూలీలు, కౌలుదారుల సంఖ్య పెరిగింది. వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, పేద రైతులు సంక్షోభానికి బాధితులుగా మారారు. మరోవైపు పెట్టుబడిదారీ భూస్వాములు, ధనిక రైతులు మరింత బలపడ్డారు. గ్రామీణ జీవితంపై (ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ) వారి పట్టు మరింత బలపడిందని ఈ అధ్యయనంలో తేలింది. ఈ వివరాలన్నీ ఐదు పుస్తకాలుగా ప్రచురించబడ్డాయి.

ఎస్వీకే సారధులు

పూర్వ ట్రస్ట్‌ సభ్యు: లావు బాలగంగాధర్‌, మాకినేని బసవపున్నయ్య, అట్లూరి శ్రీమన్నారాయణ, మోటూరు హనుమంతరావు, కొరటాల సత్యనారాయణ, నండూరి ప్రసాదరావు, ఉద్దరాజు రామం, భీమిరెడ్డి నరసింహారెడ్డి, పర్సా సత్యనారాయణ, మల్లు వెంకట నరసింహారెడ్డి.
పూర్వ ట్రస్ట్‌ మేనేజింగ్‌: లావు బాలగంగాధర్‌రావు, వై.రాధాకృష్ణమూర్తి, సి.సాంబిరెడ్డి, కొరటాల సత్యనారాయణ.
పూర్వ కార్యదర్శులు: సి.సాంబిరెడ్డి, పర్సా సత్యనారాయణ, వై.సిద్ధయ్య.
పూర్వ కోశాధికారులు: కొరటాల సత్యనారాయణ, మోటూరు హనుమంతరావు, అల్లూరి సత్యాన్నారాయణ, సి.సాంబిరెడ్డి
పూర్వ బోర్డు సభ్యులు: కె.స్వరూపారాణి, ఆర్‌.సాంబశివరావు, వై.కిరణ్‌చంద్ర, మిరియం వెంకటేశ్వర్లు, అల్లూరి సత్యనారాయణ, కె.జోజయ్య, ఎన్‌.ఎస్‌.లక్ష్మీదేవమ్మ, ఎ.మురళి, మల్లు స్వరాజ్యం, పాటూరి రామయ్య, డా.ఉదరు మనోహర్‌ నాన్‌కర్‌, ఎ.సి.నరసయ్య.
ప్రస్తుత చైర్మన్‌: బి.వి.రాఘవులు, కార్యదర్శి: తమ్మినేని వీరభద్రం, కోశాధికారి: ఎస్‌.వీరయ్య,
ట్రస్ట్‌ బోర్డ్‌ సభ్యులు: జి.నాగయ్య, ఎం.ఎ.గఫూర్‌, ఎస్‌.పుణ్యవతి, పి.మధు, ఎన్‌.నరసింహారెడ్డి
మేనేజింగ్‌ కమిటి కార్యదర్శి: ఎస్‌.వినయ్‌కుమార్‌, కోశాధికారి:జి.రాములు, కమిటీ సభ్యులు: వై.సిద్ధయ్య, సి.సాంబిరెడ్డి, జి.రఘుపాల్‌, వై.కిరణ్‌చంద్ర, జి.విజయారావు, ఆర్‌.సాంబశివరావు.

అందరికీ విజ్ఞానం
సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా ఎస్వీకే నడుస్తోంది. అందరికీ విజ్ఞానం అందుబాటులో ఉండాలనేది ఈ కేంద్రం లక్ష్యం. కరోనా తర్వాత వివిధ సమకాలిన అంశాలపై వెబినార్‌లు నిర్వహిస్తున్నాం. ఇంకా ఎన్నో చేయాల్సి వుంది. ముఖ్యంగా స్పోకెన్‌ ఇంగ్లీష్‌ కోర్సులు, అకౌంటెన్సీ, ఫిజిక్‌, మాథ్స్‌కు సంబంధించిన కోర్సులు ప్రారంభించేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు పెట్టాము. తిరిగి ప్రారంభిస్తే మంచిదనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మెడికల్‌ క్యాంపులు పెట్టి ఉచితంగా నెల రోజులకు అవసరమైన మందులు అందిస్తున్నాము. సుందరయ్య వర్థంతి సందర్భంగా ప్రతి ఏడాది మే 19న స్మారకోపన్మాసం ఏర్పాటు చేస్తాం. ఈసారి ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తిగా చేసి రిటైరైన జస్టిస్‌ మురళీథర్‌ గారిని ఆహ్వానించాం. భావ ప్రకటనా స్వేచ్ఛ – రాజ్యాంగం అనే అంశంపై ఆయన మాట్లాడతారు. అన్ని జిల్లాలో ఇలాంటి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం బాగ్‌లింగం పల్లిలోని కేంద్రంలో కళా నిలయం, ఐలమ్మ ఆర్ట్‌ గ్యాలరీ, దొడ్డి కొమరయ్య, కాట్రగడ్డ, షోయబ్‌హాల్‌ ఇలా ఐదు మీటింగ్‌ హాల్స్‌ ఉన్నాయి. నిత్యం వీటిలో ఏదో ఒక సభ జరుగుతూనే ఉంది. వీటిలో వెయ్యి మంది వరకు కూర్చునే సౌకర్యం ఉంది.
– ఎస్‌.వినయ కుమార్‌, కార్యదర్శి, ఎస్వీకే మేనేజింగ్‌ కమిటి

ఉచిత ఐసోలేషన్‌ సెంటర్లు
కరోనా సెకండ్‌ వేవ్‌ అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఇదే అదనుగా ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ లక్షల్లో డబ్బులు వసూలు చేశాయి. మృతదేహాలు తాకేందుకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో బాగ్‌లింగంపల్లి ఎస్వీకే 100 బెడ్స్‌తో హాస్పిటల్‌గా మారి 2021 మార్చి, ఏప్రిల్‌, మే నేలల్లో కరోనా సోకిన వారికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉచిత సేవలందించింది. 300 వందల మంది ఇక్కడ చికిత్స తీసుకున్నారు. అంబులెన్స్‌, కరోనా కిట్స్‌, ఆక్సిజన్‌ సిలెండర్లను దాతలు అందజేశారు. ముగ్గురు వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. వీరికి సహకారంతో ఏడెనిమిది మంది నర్సులు కూడా పని చేశారు. దీని నిర్వహణ కోసం కోటి రూపాయలు ఫండ్‌ రూపంలో వచ్చాయి. ఇక్కడ ప్రారంభించిన తర్వాత గచ్చిబౌలిలో స్వేచ్ఛ ఆధ్వర్యంలో, ప్రగతినగర్‌లోని సుందరయ్య భవన్‌లో కూడా సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇవి కాక రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో సుందరయ్య ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి సేవలందించారు. అలాగే లాక్‌డౌన్‌ ఉన్న అన్ని రోజుల్లో మున్సిపల్‌ వర్కర్లకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు.
– డి.జి.నరసింహారావు, సుందరయ్య ఐసోలేషన్‌ సెంటర్ల నిర్వాహకులు

డిజిటలైజేషన్‌ మా లక్ష్యం
గచ్చిబౌలి ఎస్వీకే అంటే అందరికీ గుర్తుకొచ్చేది అతిపెద్ద గ్రంథాలయమే. దీనికి అంతర్జాతీయ గుర్తింపు వుంది. సుందరయ్య పుస్తకాలతో పాటు శ్రీశ్రీ, ఆరుద్ర, చలం పుస్తకాలన్నీ ఈ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా నిజాం నవాబు కాలం నాటి 40వేల ఉర్దూ పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయి. సెంట్రల్‌, మౌలానా ఉర్దూ యూనివర్సిటీ రీసర్చ్‌ స్కాలర్స్‌తో పాటు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే యువత చదువుకునేందు ఇక్కడికి వస్తుంటారు. పాత పుస్తకాలన్నీ పాడైపోతే మళ్ళీ దొరకడం కష్టం. అందుకే వీటిని డిజిటలైజేషన్‌ చేయాలనుకున్నాం. ఇప్పటి వరకు 20 వేల పుస్తకాలు చేశాం. ఇవన్నీ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాం. దీని కోసం జర్మనీ నుండి స్కానర్‌ తెప్పించాం. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ కలిపి మొత్తం 2,50,000 పుస్తకాలన్నాయి. ఇందులో 50వేలు తెలుగు పుస్తకాలున్నాయి. భవిష్యత్‌లో తెలుగు పుస్తకాలన్నీ డిజిటలైషన్‌ చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలనుకుంటున్నాం.
– పి.ప్రభాకర్‌, గచ్చిబౌలి ఎస్వీకే సెక్రెటరీ

18 వేదికలుగా కార్యక్రమాలు
కుల, మత, ప్రాంత, భాషల కతీతంగా ప్రజల్లో సేవా కార్యక్రమాలతో సమైఖ్యతా భావాన్ని, ప్రజాస్వామయ్య వాతావరణాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం పని చేస్తున్నది. కుకట్‌పల్లి సమీపంలోని ప్రగతినగర్‌లో 2021లో ఎస్వీకే ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు ప్రారంభించాం. బాచుపల్లి, కుత్బుల్లాపూర్‌, గండిమైసమ్మ, కుకట్‌పల్లి, శేరిలింగం పల్లి మండలాల పరిధిలో కార్యక్రాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం 18 వేదికలుగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్షర కుసుమాలు పేరుతో ఓ సాహిత్య వేదిక నడుపుతున్నాం. అభ్యుదయ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. బాక్సింగ్‌, యోగా, జిమ్‌ సెంటర్లు కూడా ఉన్నాయి. అలాగే ప్రగతి చెస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో చెస్‌లో శిక్షణ ఇప్పించి రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నాం. మహిళా ఎంపవర్‌మెంట్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో మహిళలకు ఉపాధి అవకాశాలకై కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రం ఈ నెల 19న సుందరయ్య వర్థంతి సందర్భంగా ప్రారంభం చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో యువత, మహిళలకు వివిధ రంగాలలో ఉపాధి కోసం, లైఫ్‌స్కిల్స్‌ మెరుగుదలకు తగిన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్‌ చేస్తున్నాం. ‘వైద్య నేస్తం’ మరిన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలి. ప్రగతి టెక్‌ అకాడమీ ద్వారా వివిధ సంస్థలతో టై అప్‌ ఏర్పాటు చేసుకొని యువతకు ఉపాధి అవకాశాలకు కృషి చేయాలి.
– ప్రగతినగర్‌ సుందరయ్య భవన్‌ నిర్వాహణ కమిటి