హైటెక్స్‌లో అంతర్జాతీయ ఫార్మా ఎగ్జిబిషన్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : ఫార్మాస్యూటికల్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఫార్మాక్సిల్‌) నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫార్మా ఎగ్జిబిషన్‌ (ఐపెక్స్‌) బుధవారం ప్రారంభమైంది. నగరంలోని హైటెక్స్‌లో 5,6,7 తేదిల్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను తొలిరోజు ఫార్మెక్సిల్‌ ఛైర్మన్‌ ఎస్‌వి వీరమణి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని 200 దేశాలను చేరుకోవడంలో మన భారతీయ ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమ ప్రత్యేకతను చాటుకుందన్నారు. గతేడాది 25.39 బిలియన్‌ డాలర్ల విలువైన ఫార్మా ఎగుమతులు నమోదు చేశామన్నారు. ఈ ఏడాది 28 బిలియన్‌ డాలర్ల లక్ష్యాన్ని పెట్టుకున్నామన్నారు. భారత ఎగుమతుల్లో ఔషదాల రంగం ఐదవ స్థానంలో ఉందన్నారు. ఈ సదస్సులో దాదాపు 400 మంది ఎగ్జిబిటర్లు, 660 మంది విదేశీ సందర్శకులు పాల్గొంటున్నారని.. మొత్తంగా 10000 మందికి పైగా సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు.