నవతెలంగాణ -సుల్తాన్ బజార్ : సావిత్రిభాయి పూలే జయంతి ఉత్సవాలను తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించి సావిత్రిబాపూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం క్యాలెండర్ ను ప్రొఫెసర్ హరిగోపాల్ , ప్రొఫెసర్ కోదండరాం, వి సి ప్రొఫెసర్ విజ్జుల్లత ల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రొఫెసర్ హారగోపాల్ ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ఉన్నత విద్య నిర్లక్ష్యానికి గురైందని వాపోయారు. రావలసిన నిధులు రాకపోవడంతో ప్రభుత్వ విద్య రోజుకు నీరుగారి పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన నియమించబడిన అధ్యాపకులు లేకపోవడంతో అనేక సంవత్సరాలుగా కాంట్రాక్ట్ అధ్యాపకులపై ఆధారపడి విశ్వవిద్యాలయాలు నడుస్తుండటం విచారకరమని ఆయన తెలిపారు. కావున కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేసి విశ్వవిద్యాలయాలను పటిష్ట పరచాలని తెలిపారు. సావిత్రిబా పూలే స్త్రీల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పోరాడిందని తెలిపారు. సావిత్రిబాపూలేని స్మరించుకోవటం అంటే విద్యకు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని, తద్వారా సమానత్వం సాధించాలని చెప్పారు. మహిళా విశ్వవిద్యాలయంకు ఇప్పటివరకు నిధులు మంజూరు చేయకపోవడం అత్యంత సోచనీయమని తెలిపారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. అనేక ఒడిదుడుకలను తట్టుకొని ఆనాడు మహిళా విద్య కోసం సావిత్రిభాయ్ ఫూలే పాటుపడిందని గుర్తు చేశారు. మహిళల కోసం ప్రత్యేక పాఠశాలలు నిర్మించి మహిళా అభ్యున్నతికై పాటుబడిన విషయాన్ని గుర్తు చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అందరూ ఉన్నత జీవన విధానం కొనసాగించే వైపుగా ప్రభుత్వం విధానాలు తీసుకోవాలని తెలిపారు. గత ప్రభుత్వం తెలంగాణ మట్టిబిడ్డల బాధలను పట్టించుకోలేదని అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాభిస్తానికి అనుగుణంగా పరిపాలన కొనసాగాలని అలా కొనసాగిస్తుందని ఆశాభావంతో ఉన్నామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను నిరంతరం అభద్రతా భావంలో ఉంచడం సరికాదన్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. వి సి ప్రొఫెసర్ విజ్జులత ప్రసంగిస్తూ.. సావిత్రిబాయి పూలే అడుగుజాడల్లో నడుస్తూ అధ్యాపకులు, విద్యార్థులు సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎస్ ఓప్రొఫెసర్ సరస్వతమ్మ, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వారజ రాణి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ శైలజ, డాక్టర్ జయసూర్య, డాక్టర్ జ్యోతి, డాక్టర్ ఈ ఉపేందర్, డాక్టర్ సనత్, డాక్టర్ ధర్మ తేజ, డాక్టర్ కృష్ణజి రావు, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ శేఖర్ రెడ్డి, డాక్టర్ యాదయ్య, పి ఆర్ ఓ కృష్ణ జీ తదితరులు పాల్గొన్నారు.