3 నుంచి 5 తేదీల్లో ఖమ్మంలో ఐక్యతా మహాసభ పోస్టర్ల ఆవిష్కరణ

నవతెలంగాణ – డిచ్ పల్లి
భారత దేశంలోని 14 రాష్ట్రాల్లో విస్తరించి పీసీసీ, సీపీఐ ఎంఎల్, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా, సీపీఐ ఎంఎల్ రివల్యూషనరి ఇన్సియేటివ్, మూడు విప్లవ కమ్యూనిస్టు పార్టీల విలీనమై సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీగా ఏర్పడుతున్న సందర్భంగా 2024 మార్చి 3,4,5 తేదీల్లో  ఖమ్మంలో జరిగే ఐక్యతా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్ ప్రజా పంథా డివిజన్ కార్యదర్శి వెంకన్న  పిలుపునిచ్చారు. శనివారం డిచ్ పల్లి మండల కేంద్రంలో మార్చి 3,4,5 తేదీలలో ఖమ్మంలో జరగబోయే సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జాతీయ మహాసభల వాల్ పోస్టర్లు లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత విప్లవోద్యమం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నదన్నారు. మారిన పరిస్థితులను సరిగ్గా అంచనా వేసుకోలేక పోయిందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశ పెట్టుబడిదారీ విధానం విసిరే సవాళ్లను అధిగమించడానికి కమ్యూనిస్టు విప్లవోద్యమం సైతం మార్పులు చేసుకోవాల్సి ఉందన్నారు. ఆ కృషి కొనసాగింపే మూడు పార్టీల ఐక్యత అన్నారు.14 రాష్ట్రాలలో, వివిధ స్థాయిలలో పనిచేసే మూడు పార్టీలు కలిసి చర్చించుకుని ఒక అవగాహన ఏర్పరచుకొని ఐక్యం కావాలని నిర్ణయించుకున్నాయన్నారు. 2024 మార్చ్ 3,4,5 తేదీల్లో ఖమ్మంలో ఐక్యతా మహాసభ ఉంటుందన్నారు. దేశంలో బలమైన విప్లవ కమ్యూనిస్టు పార్టీ నిర్మాణానికి ఈ ఐక్యత సభ ఒక ముందడుగుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా పంథా కార్యదర్శి మురళి, గంట రాజేందర్, మోహన్ ,రాందాస్, సాయిబాబా, గంగాధర్, సాయిలు, లక్ష్మి, సుజాత, సుగుణ తదితరులు పాల్గొన్నారు.