‘ఉన్నత చదువులు చదివినంత మాత్రానా డప్పు కొట్టడం మానేస్తారా..? డప్పు కొట్టకపోతే సర్కారిచ్చిన ఇనాం భూమిని తిరిగిచ్చేయండీ.. ఊర్లో చావు, పెండ్లిండ్లు, పండుగలాంటి శుభ, అశుభ కార్యమేదైనా సరే మీరు వచ్చి డప్పులు కొట్టాల్సిందే.. కాదంటే ఊరి నుంచి బహిష్కరిస్తం.. మీతో ఎవ్వరూ మాట్లడరు. ఎలాంటి సహాయం చేయరు. ఎవరైనా మాట్లాడితే వారికి ఇరవైఐదు చెప్పుదెబ్బలతో పాటు ఐదువేల రూపాయల జరిమానా తప్పదు’ అంటూ ఊరంతా కలిసి తీర్మానించింది. తండ్రి బతికున్నంత కాలం ఊర్లో శుభమైనా, అశుభమైనా డప్పు కొట్టేవాడు. ఆయన తదనంతరం పెద్ద కొడుకు సైతం కొంత కాలం డప్పు కొట్టాడు. పట్టణంలో ఉద్యోగం చేసే అతనికి ఊర్లో డప్పు కొట్టాల్సి వస్తే సెలవు దొరకడం కష్టంగా మారింది. దీంతో అనేక ఇబ్బందులు పడ్డాడు. మొన్నటికి మొన్న ఊరి వాళ్ల ఒత్తిడితో ఇబ్బంది పడుతూ డప్పు కొట్టేందుకు మూడు రోజులు ఊర్లో ఉండ టంతో ఉన్న కాస్త ఉద్యోగం ఊడి పోయిం ది. ఒక పక్క ఉద్యోగం వదిలొచ్చి ఊర్లో డప్పు కొట్టడం వీలుకాకపోవడం, మరో పక్క ఉన్నత చదువులు చదివి చావు, పండుగలు, పెండ్లిండ్లకు డప్పు కొట్టి చిన్నచూపునకు గురికావడం ఇష్టంలేని అన్న దమ్ములు కొంత కాలంగా డప్పు కొట్టేందుకు వెళ్లడం లేదు. ఈనెల మొదటి వారంలో ఊర్లో ఓ వ్యక్తి చని పోయాడు. అంత్యక్రియలకు డప్పుకొట్టేందుకు వీళ్లు వెళ్లలేదు. దాంతో ఊరికి కోపం వచ్చింది. పంచాయితీ పెట్టి వీరిని నిలదీశారు. ఊర్లో ఎలాంటి కార్యమైనా తప్పని సరిగా డప్పు కొట్టేందుకు మీరు రావాలని పెద్ద మనుషులు హుకుం జారీ చేశారు.’కులగోత్రాలు మలమూత్రాలు/ ఒకలాంటివే / అలాంటివి విసర్జిస్తేనే ఆరోగ్యం/ ఒకటి దేహానికి, మరొకటి దేశానికి’ అంటాడో కవి. సాంకేతకంగా మానవుడు ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ప్రత్యేకంగా మన దేశంలో కులమతాలు అడ్డు గోడల్లా నిలుస్తున్నాయి. 75 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో ఇప్పటికీ చాలా ఊర్లలో కుల బహిష్కరణ ఓ కట్టుబాటుగా సాగిపోతోంది. ఊరి కట్టుబాట్లు, కులపంచాయితీలు, వీడిసీ(గ్రామాభివృద్ధి కమిటీ) వ్యవస్థ గ్రామాలను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో చోటుచేసుకునే హింసాత్మక సంఘటనలు సరేసరి. బాపూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇదేనా? సాయుధ పోరాట మూలాలతో చైతన్యవంతమైన తెలంగాణ నేలపై ఇలాంటి వెలి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఉన్నత చదువులు చదువుకొని ఉద్యోగం చేసుకుంటున్న దళిత యువకులు ఉద్యోగాలు వదులుకోలేం అని చెప్పడమే పెద్ద నేరమైంది. పెద్ద మనుషులు, మాజీ ప్రజాప్రతినిధులు కుల ఆధిపత్య భావజాలాన్ని ప్రదర్శించారు. ఇది ఎక్కడో మారుమూల పల్లెలో కాదు హైదరాబాద్‌కు కూతవేటు దూరంలోని మనోహరాబాద్‌లో డప్పు కొట్టడం వీలు కాదని చెప్పినందుకు ఒక దళిత కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేశారు.మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న భయంకరమైన జబ్బు కులవ్యవస్థే. కుల ప్రభావం లేని రంగం లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందకపోవడానికి కుల వ్యవస్థే కారణమన్న సామాజిక శాస్త్రవేత్తల మాటలు అక్షర సత్యాలు. ఇప్పటికీ దాదాపు 30కోట్ల మంది అంటరానితనం, కులవివక్షతో అణచివేయ బడుతున్నారంటే ఆ జాడ్యం దేశంలో ఎంతగా వేళ్ళూనుకుందో అర్థం చేసుకొవచ్చు. మనదేశంలో కులం కొందరికి వరమైతే…ఎందరికో శాపంగా మారుతోంది. కులాల చిచ్చుతో నిత్యం గాయపడుతున్న మన సమాజానికి శస్త్ర చికిత్స తక్షణ అవసరం. ‘ ప్రతి ఏటా వందల సంఖ్యలో యువకులు కులానికి బలైపోతున్నారు. దేశంలో కుల దురహంకార జాఢ్యం ప్రమాదకర సమస్యగా మారిందని’ స్వయంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారంటే దేశంలో పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణలు ఇంకేం కావాలి?దేశం ఆధునికతను సంతరించుకునే కొద్దీ అంతరించ పోవాల్సిన కులం మన రాజకీయ వ్యవస్థ పుణ్యమా అని వెర్రితలలు వేస్తోంది. మర్రి ఊడల్లాగా వేళ్లూను కుంటోంది. మానవ సంబంధాలను ప్రేమానురాగాలను దునుమాడు తున్నది. ఈ ఉదంతాల న్నిటినీ చూస్తుంటే నిజంగా మనం ఆధునిక ప్రపంచంలోనే ఉన్నామా..? లేక మధ్యయుగాల్లో ఉన్నామా అనే అనుమానం కలుగక మానదు. కుల దురహంకార హత్యలు, కుల బహిష్కరణలు వంటి ఈ ఆకృత్యాలకు బాధ్యత ఎవరిది? ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తులదే కాదు, ఈ వ్యవస్థది. నేటి ఆధునిక యుగంలో కూడా తమ స్వార్థ రాజకీయాల కోసం ఈ సనాతన భావజాలాన్ని పెంచి పోషిస్తున్న పాలకవర్గాలది. ప్రభుత్వాలది కూడాను. నేడు మత దురహంకారం, కుల దురహంకారం మరింత పెచ్చరిల్లుతున్నాయి. భావితరాల భవిష్యత్తు మీద చావు గీతలు గీస్తున్నాయి. ఫలితంగా నేటికీ కుల రక్కసి కోరల్లో విలవిలలాడుతున్నది మాత్రం అమాయక ప్రజలే. అందుకే అంబేద్కర్ నాడే ‘ కులం పునాదుల మీద ఒక జాతిని కాని, నీతిని కాని నిర్మించలేం’ అన్నారు. కుటుంబాలకు కుటుంబాలను ఊరి నుంచి వెలివేస్తున్న కులమెంత క్రూరమైనదో కదా..!