ఎడతెరిపి లేని వర్షం

Incessant rain– జనజీవనం అస్తవ్యస్తం.. ప్రజలు ఇండ్లకే పరిమితం
– ప్యారవరం, ఎల్గోయి మామిడి వాగులు పొంగడంతో నిలిచిన రాకపోకలు
– భద్రత చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు
నవతెలంగాణ – ఝరాసంగం
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో మండలంలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మండల వాసులు ఇళ్లకే పరిమతమయ్యారు. రెండురోజులుగా కమ్ముకున్న ముసురుతో పలు రహదారులు చిత్తడిగా మారాయి. దీంతో దారులన్నీ దెబ్బతిని గుంటలుగా మారాయి. ఉదయం నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుండడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దీంతో మండల వాసులు ఇండ్లకే పరిమితమయ్యారు. మండల పరిధిలోని జీర్లపల్లి చెరువుకు వరద ఉధృతి పెరగడంతో చెరువు కట్ట అలుగుల పై నుండి నీరు భారీగా పారుతుంది. అదేవిధంగా ప్యారవరం సమీపంలో ఉన్న వాగుకు వరద నీరు ఎక్కువ అవ్వడంతో పొంగిపొర్లుతోంది. దీంతో గ్రామానికి పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. ఎల్గోయి-రేజింతల్ గ్రామ శివారు మధ్యలో ఉన్న మామిడి వాగుకు వరద నీరు భారీగా పారడంతో ప్రయాణికుల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీస్ అధికారులు ఈ వాగు దగ్గర భద్రత చర్యలు చేపట్టారు. వాగుకు అడ్డంగా రోడ్డుపై ముండ్ల కంచను ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేని వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుండి బయటకు రాకూడదని పోలీసులు సూచించారు.