నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని చేర్చాలని ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం యూనియన్ ప్రధాన కార్యదర్శి కే రాజిరెడ్డి, కార్యదర్శి జక్లయ్య, హైదరాబాద్ రీజినల్ అధ్యక్షులు రంగ కిషన్ గౌడ్ తదితరులు కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్ డీ శ్రీధర్‌బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలతో కూడిన మూడు పేజీల వినతిపత్రాన్ని అందచేశారు.
అధికారంలోకి వస్తే స్థలమే కాదు…ఇండ్లు కట్టిస్తాం : డీజేహెచ్‌ఎస్ ప్రతినిధులకు శ్రీధర్ బాబు హామీ
తాము అధికారంలోకి వస్తే జర్నలిస్టులకు ఇంటి స్థలమే కాకుండా ఇండ్లు కూడా కట్టించి ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్ శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రణాళికలో జర్నలిస్టుల ఇంటి స్థలం అంశాన్ని పొందుపరుస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్‌ఎస్) ప్రతినిధులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బొల్లోజు రవి, ట్రెజరర్ చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు ప్రతాప్ రెడ్డి, నాగరాజు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా డీజేహెచ్‌ఎస్ అధ్యక్షులు బొల్లోజు రవి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాదులో మొదటగా డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఏర్పడిందని పేర్కొన్నారు. హైదరాబాదులో పని చేసే జర్నలిస్టులు ఇంటి స్థలానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమంపై కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపరచాలని కోరుతూ జర్నలిస్టుల అధ్యయన వేదిక ఆధ్వర్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్ శ్రీధర్‌బాబును కలిసి వినతిపత్రం సమర్పించారు. వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్‌రెడ్డి, సాధిక్, నాయకులు కె. శ్రీనివాస్‌రావు, జె వెంకటేశ్వర్లు, మధు, కోశాధికారి సురేష్, కంచరాజు తదితరులు ఉన్నారు.