ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలి

Income tax rates should be reduced– 56 శాతం మంది డిమాండ్‌
– బడ్జెట్‌లో ఉపశమనం కల్పించాలి
– నిరుద్యోగాన్ని పరిష్కరించాలి
– ఇటి సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను రేటును తగ్గించాలని మెజారిటీ పన్ను చెల్లింపుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. మోడీ సర్కార్‌ పన్ను భారాలు తగ్గించడం ద్వారా ప్రజల చేతుల్లో నగదు ఉంటుందని.. దీంతో వినిమయానికి డిమాండ్‌ పెరుగుతుందని సూచిస్తున్నారు. జులై 23న ఆర్థిక శాఖ మంత్రి మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్బంగా ఎకనామిక్స్‌ టైమ్స్‌ ఆన్‌లైన్‌ సర్వేలో 9500 మంది అభిప్రాయాలను సేకరించింది.
వచ్చే బడ్జెట్‌లో తమకు పన్ను భారాల నుంచి ఉపశమనం కల్పించేలా పన్ను రేట్ల తగ్గింపునకు ప్రాధాన్యతను ఇవ్వాలని 56 శాతం మంది అభిప్రాయపడ్డారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సంక్షోభాన్ని కట్టడి చేయాలని 37 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు నగదు బదిలీ పెంచాలని కేవలం 4 శాతం మంది మాత్రమే పేర్కొనడం గమనార్హం. రైల్వేలకు నిధుల కేటాయింపు పెంచాలని 2 శాతం మంది కోరారు.
పన్ను రేట్ల శ్లాబులను హేతుబద్దీకరించాలని.. రూ.15 లక్షల లోపు ఆదాయం కలిగిన వారికి ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని 53 శాతం మంది అభిప్రాయపడ్డారు. 80సి పన్ను మినహాయింపుల పరిధిని పెంచాలని 20 శాతం మంది కోరారు. అధిక శ్లాబులో ఉన్న వారిపై పన్ను రేట్లను పెంచాలని, తక్కువ శ్లాబులో ఉన్న వారిపై పన్ను రేట్లకు కోత పెట్టాలని 11 శాతం మంది డిమాండ్‌ చేశారు.
2024-25లో ఇప్పటివరకు ప్రత్యక్ష పన్నుల వసూళ్లురూ.5.74 లక్షల కోట్లకు పెరిగాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే 20 శాతం అదనం. ఇందులో రూ.3.61 లక్షల కోట్లు వ్యక్తిగత పన్ను ఆదాయానికి సంబంధించినవే. ఫిబ్రవరి 1న ప్రకటించిన మధ్యంతర బడ్జెట్‌లో 2024-25లో ఆదాయపు పన్ను వసూళ్లు రూ.11,56,000 కోట్లకు పెరుగుతాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ఇది 2023-24తో పోల్చితే 13 శాతం ఎక్కువ. ఆదాయపు పన్ను రేట్లను తగ్గించడం ద్వారా ఇప్పటికే వెనుకబడిన వినియోగ స్థాయిలను పెంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సహం లభించనుందని అభిప్రాయపడుతున్నారు.