అసమర్థుని వీలునామా

Incompetent willచేత కానిలేనివాడిని
నేను ఎప్పటికి చేతకాని వాడినే
ఎదను తొలిచే
ఊసులేవో ఉద్విఘ్న మానస సంభాషణలక్షరాలై
పుటంపెట్టిన నగల్లాగ
పుటలుపుటలుగా, పుంఖానుపుంఖాలుగా
కవితా సంపుటాలై సలుపుతుంటే
యాభై యేండ్లకు పైగా రాసిన రాతలు
కవి సమ్మేళనాలలో తప్పట్లై మోగాయి
కానీ, గూట్లో రాశులై మూల్గుతున్నపుడు
సలపరించిన మెదడు ఒత్తిడి చేస్తే
చచ్చీచెడి తల తాకట్టు పెట్టినట్టు
గత్యంతరం లేని స్థితిలో అప్పుచేసి
అచ్చువేసేవాడిని గీచిగీచి
బతిమాలి బామాలి.. మూడు సంపుటాలు
మొదటి సారి డెబ్భై ఏండ్ల వయసులో
కవిగా నిలబడ్డ యాభై ఏండ్లకు అచ్చరువొందిన మొహంతో
వెలువరించి చేతులు దులుపుకున్నట్టు
తనూ మొగాడిననిపించుకున్నంత
సంబరపడినంత మాత్రాన
ఆగని ఊహాల ఊటగా
ఉరికించే నిత్యకత్యాకత్యాల హోరుకు
రాయకుండా ఉండలేను
కాని, రాసే ప్రతిసారి ఇదే ఆఖరంటూ
అస్త్ర సన్యాసం చేయాలనుకుంటున్నాను
మరల ఆచ్చు వేసేదెలా? చేయూత యిచ్చే దెవరు?
సందిగ్ధం, సంశయం, సందేహం
చేత కాని లేనితనం
మళ్ళీ చేతకానివాడిని కాబట్టే
కవిగా నిష్క్రమించాలనుకుంటున్నా
చేతిని చంపేయాలనుకుంటున్నా
ఎవరూ జాలిపడకండి
నా మానాన నన్నొదిలేయండి
కవినని ఎప్పుడూ పిలవకండి
నేనెక్కడికి రాలేనని మొరాయించే
మోకాళ్ళున్నవాడ్ని నన్నిలా వదిలేయండి.
– కపిల రాంకుమార్‌, 9849535033