భక్తులకు అసౌకర్యం కలిగిస్తే సహించేది లేదు

Adilabad– బాసరలో దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి
– అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌
నవతెలంగాణ-ముధోల్‌
బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని ఎమ్మెల్యే పవార్‌ రామారావు పటేల్‌ అన్నారు. బుధవారం సరస్వతి అమ్మవారి క్షేత్రంలో రాజన్న అతిథి గృహంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో జరిగిన తప్పులు పునరావృతం అయితే ఊరుకునేది లేదని ఆలయ అధికారులను హెచ్చరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లు, ఇతరత్ర సౌకర్యాలు కల్పించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి, భక్తులు రానున్న సందర్భంగా సరస్వతి అమ్మవారి దర్శనం కోసం వేచి చూసే భక్తులకు ఇలాంటి ఇబ్బందులకు గురి చేయకూడదు అన్నారు. క్యూలైన్లలో పాల పంపిణీ, అల్పాహారం పంపిణీ చేయాలని సూచించారు. పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అవసరమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు తెలియజేశారు. భక్తుల వాహనాలకు ఇబ్బందులు కలగకుండా విశాలమైన ప్రాంతంలో పార్కింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు విశ్రాంతి కోసం సత్రాల ఏర్పాటు చేయాలన్నారు. గోదావరి నది స్నాన ఘట్టాల వద్ద భక్తుల పుణ్యస్నానం ఆచరించే సమయంలో గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా గజ ఈతగాళ్లను నియమించాలన్నారు. ప్రస్తుతం ఎండలు మండుతున్న తరుణంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా, వైద్య సిబ్బంది వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పారు.