ఉద్యోగుల వయోపరిమితి పెంపు సరికాదు

– డీఎస్సీ-2024 ఉపాధ్యాయ సంఘం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును పెంచే ఆలోచన సరైంది కాదని డీఎస్సీ-2024 ఉపాధ్యాయ సంఘం తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం నాయకులు రావుల రామ్మోహన్‌రెడ్డి, ఇర్ఫాన్‌, కోటేశ్‌, చంద్రశేఖర్‌రెడ్డి, రాము, శ్రీను, స్వప్న, కావ్య, శ్వేత గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగ విరమణ వయస్సు పెంపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దని డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ వయస్సును పెంచితే సుమారు 40 వేల ఉద్యోగాలను నిరుద్యోగులు కోల్పోతారని వివరించారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌ రాకపోతే ఉద్యోగులు నష్టపోతారనీ, కానీ ఉద్యోగ విరమణ వయస్సును పెంచితే నిరుద్యోగులు అంతకంటే ఎక్కువ నష్టపోతారని పేర్కొన్నారు.