– కొత్త ఆలోచనలు చేయండి :ప్రభుత్వ శాఖల సమీక్షలో ఆర్థికశాఖ మంత్రి భట్టి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజలపై భారం లేకుండా రాష్ట్ర ఖజానా ఆదాయం పెంచేలా కొత్త ఆలోచనలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారుల్ని ఆదేశించారు. శుక్రవారంనాడిక్కడి బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రతి నెల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆదాయం పెంపుపై జరిగే సమావేశానికి నూతన ఆలోచనలతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని రావాలని చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. ఆయా శాఖల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని ఫలితాలు సాధించాలన్నారు.
అందరికీ ఇసుక అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన పట్టణాలకు సమీపంలో సబ్ యార్డులు, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మార్కెట్ యార్డుల్లో ఇసుక నిల్వలు అందుబాటులో ఉంచాలని మైనింగ్ శాఖ అధికారులకు సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో వేగం పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులు, ఇప్పటివరకు సమకూరిన ఆదాయం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఆర్‌ఎస్ ద్వారా ఏ మేరకు ఆదాయం అంచనా వేయవచ్చు అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ ప్రణాళికలు, అసైన్డ్ భూములు, కోర్టు వివాదాలను సమీక్షించారు. ల్యాండ్ పూలింగ్ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులు పునరావృతం కావొద్దన్నారు. జీఎస్టీలో లీకేజీలను అరికట్టి ఆదాయం పెంచేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్, కమర్షియల్ టాక్స్ అండ్ రెవెన్యూ కమిషనర్ ఎస్‌ఎమ్‌ఏ రిజ్వీ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్, రవాణా శాఖ కమిషనర్ బుద్ధప్రకాష్, హౌసింగ్ ప్రత్యేక కార్యదర్శి గౌతమ్, మైనింగ్ శాఖ సెక్రెటరీ సురేంద్రమోహన్, డైరెక్టర్ సుశీల్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.