మీ సేవా ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచాలి

–  ఐటీ, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు ఉద్యోగుల వినతి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మీసేవా కేంద్రాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచాలని తెలంగాణ మీ సేవా ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో ఐటీ, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు ఆ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె. వెంకటేష్‌, అధ్యక్షులు ఆర్‌. సురేష్‌, ప్రధాన కార్యదర్శి జెనీమా, కోశాధికారి ఎవీబీ లక్ష్మి, సహాయ కార్యదర్శి కవిత, ఉపాధ్యక్షులు బాల్‌రాజు మెమోరాండం అందజేశారు. వేతనాల పెంపు కోసం ఏడాది కోరుతున్నామన్న విషయాన్ని జె.వెంకటేశ్‌ గుర్తుచేశారు. మీ-సేవా కేంద్రాలు అందించే సేవల ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగం జరుగుతున్నదని మంత్రి కేటీఆర్‌ పలు సందర్భాల్లో అన్న విషయాన్ని ప్రస్తావించారు. మీ-సేవా మేనేజర్‌కు రూ.17 వేలు, ఆపరేటర్‌కు రూ.13,922, హౌస్‌కీపింగ్‌ సిబ్బందికి రూ.5,305 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ఛార్జీలతో సహా అన్నిరకాల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిన క్రమంలో ఆ వేతనాలతో బతకడం ఎలా అని అడిగారు. రాష్ట్రంలో రెండో పీఆర్సీ అమలు కానున్న నేపథ్యంలో మీ-సేవా ఉద్యోగుల కనీస వేతనాలు పెంపుదలకు చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు.